Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువ్యవస్థీకృత నేరాలను అదుపు చేయండి

వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయండి

- Advertisement -

– నేరాల అర్ధవార్షిక సమీక్షలో డీజీపీ జితేందర్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాలతో పాటు డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టడానికి అన్ని రకాల వ్యూహాలతో సమిష్టి కృషి జరపాలని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లను రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతలు, నేరాల అదుపునకు సంబంధించి అర్ధవార్షిక సమీక్షా సమావేశం ముగింపు సభ జరిగింది. అందులో ఆయన మాట్లాడుతూ…వ్యవస్థీకృత నేరాలతో పాటు డ్రగ్స్‌ మహమ్మారి యువత జీవితాలను ఛిద్రం చేస్తున్నదనీ, వాటి సరఫరా దారులను పట్టుకోవడమే కాకుండా మూలాల వరకు వెళ్లి మహమ్మారిని భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా పోలీసు శాఖ సహాయ సహకారాలను అందజేస్తుందనీ, ఈగల్‌ వంటి సంస్థలు ఏర్పాటు చేసిందని జితేందర్‌ తెలిపారు. ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకుంటూ నేరాలను అదుపు చేయాలని ఆయన సూచించారు.

ఈ దిశగా కింది స్థాయి అధికారులు, సిబ్బందికి కూడా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని సూచించారు. శాంతిభద్రతలు సవ్యంగా ఉంటేనే రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తాయనీ, తద్వారా ప్రజా సంక్షేమం సవ్యంగా సాగుతుందని చెప్పారు. ఈ గురుతర బాధ్యత పోలీసు శాఖపై ఉందనే విషయాన్ని మరువొద్దని సూచించారు. రాష్ట్ర శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ…చెడ్డీ గ్యాంగ్‌, పాల్‌పార్థీ, గ్రామ్‌పార్థీ, వంటి బందిపోటు ముఠాల కదలికలు రాష్ట్రంలో సాగకుండా నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈగల్‌ డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ శాండిల్యా మాట్లాడుతూ…దేశంలోకి విదేశాల నుంచి నైజీరియన్‌ ముఠాల ద్వారా భారీ ఎత్తున డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ అవుతున్నదనీ, ఆ బెడద రాష్ట్రానికి కూడా పట్టుకున్నదని అన్నారు. వారి ఆగడాలను అరికట్టడానికి ఈగల్‌కు చెందిన పలు టీమ్‌లు నిరంతరం కృషి చేస్తున్నాయనీ, ఇప్పటికే ఆ దిశగా మంచి ఫలితాలు కూడా వస్తున్నాయని ఆయన తెలిపారు.

పోలీసు టెక్నికల్‌ విభాగం అదనపు డీజీ వీవీ.శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ..సీసీసీఎన్‌ఎస్‌ పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లను అనుసంధానం చేసి నేరాలను అరికట్టడంలో పోలీసులు అధికారులు సమిష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌ మాట్లాడుతూ..తమ విభాగంలో కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలకు శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల అదుపునకు సమగ్ర శిక్షణ ఇస్తూ భవిష్యత్‌ సవాళ్లను కూడా వారికి వివరిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ డాక్టర్‌ సౌమ్యా మిశ్రా మాట్లాడుతూ…ప్రతిరోజూ ఖైదీలను కోర్టులకు తీసుకొచ్చే విషయంలో సెక్యూరిటీ పరంగా సవాళ్లు ఎదురవుతున్నాయనీ, అయినా, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధిగమిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఫోరెన్సిక్‌ విభాగం ప్రొఫెసర్‌ కృపాల్‌సింగ్‌ మాట్లాడుతూ.. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ద్వారా జఠిలమైన కేసులను కూడా పరిష్కరించ గలుగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్టీజోన్‌ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఐజీ తబ్సీల్‌ ఇక్బాల్‌, ఐజీ రమేశ్‌, మరో ఐజీ రమేశ్‌నాయుడు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img