Friday, March 6, 2026
E-PAPER
Homeఆటలుకివీస్‌ కాచుకో!

కివీస్‌ కాచుకో!

- Advertisement -

సెమీస్‌ థ్రిల్లర్‌లో భారత్‌దే పైచేయి
7 పరుగుల తేడాతో మెరుపు విజయం
భారత్‌ 253/7, ఇంగ్లాండ్‌ 246/7

నవతెలంగాణ-ముంబయి
డిఫెండింగ్‌ చాంపియన్‌, ఆతిథ్య భారత్‌ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం వాంఖడెలో జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై 7 పరుగుల తేడాతో మెరుపు విజయం సాధించిన టీమ్‌ ఇండియా.. ఆదివారం అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో టైటిల్‌ ఫైట్‌కు సై అనేసింది. 254 పరుగుల రికార్డు ఛేదనలో జాకబ్‌ బెతెల్‌ (105, 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌తో పోరాడాడు. విల్‌ జాక్స్‌ (35, 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శామ్‌ కరణ్‌ (18, 14 బంతుల్లో 2 ఫోర్లు) నుంచి మిశ్రమ సహకారం బెతెల్‌పై ఒత్తిడి పెంచింది.

డెత్‌ ఓవర్లలో భారత్‌ మెరుగ్గా బంతులేయటంతో ఇంగ్లాండ్‌ ఆశలు ఆవిరయ్యాయి. 20 ఓవర్లలో 7 వికెట్లకు ఆ జట్టు 246 పరుగులే చేసింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 253/7 పరుగులు చేసింది. ఓపెనర్‌ సంజు శాంసన్‌ (89, 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగాడు. శివం దూబె (43, 25 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (39, 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్య (27, 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (21, 7 బంతుల్లో 3 సిక్స్‌లు) దంచికొట్టారు. సంజు శాంసన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

బౌలర్ల శుభారంభం
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక ఛేదన 229 పరుగులు. ఇంగ్లాండ్‌ లక్ష్యం 254 పరుగులు. పవర్‌ప్లేలో భారత బౌలర్లు మెరవటంతో ఇంగ్లాండ్‌ టాప్‌ ఆర్డర్‌ తేలిపోయింది. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (5) అక్షర్‌ పటేల్‌ అద్భుత క్యాచ్‌తో నిష్క్రమించాడు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (7), జోశ్‌ బట్లర్‌ (25), టామ్‌ బాంటన్‌ (17) ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. 95/3తో ఇంగ్లాండ్‌ కష్టాల్లో కూరుకుంది. ఈ దశలో ఛేదనలో ఇంగ్లాండ్‌ ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి.

బెతెల్‌ ధనాధన్‌
మ్యాచ్‌పై భారత్‌ పట్టు బిగించిన దశలో ఎదురుదాడి మొదలెట్టిన జాకబ్‌ బెతెల్‌ (105).. శతకంతో చెలరేగాడు. స్పిన్నర్లు, పేసర్లపై చెలరేగిన బెతెల్‌.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 19 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 45 బంతుల్లోనే సెంచరీ సాధించిన బెతెల్‌ ఇంగ్లాండ్‌ను రేసులో నిలిపాడు. విల్‌ జాక్స్‌ (35)తో కలిసి ఐదో వికెట్‌కు 39 బంతుల్లో 77 పరుగులు.. శామ్‌ కరణ్‌ (18)తో కలిసి 27 బంతుల్లో 50 పరుగులు పిండుకున్న బెతెల్‌ ఓ దశలో భారత్‌ను భయపెట్టాడు.

డెత్‌ ఓవర్లలో జశ్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యలు భారత్‌ను మళ్లీ ముందంజలో నిలిపారు. ఆఖరు 2 ఓవర్లలో 39 పరుగులు అవసరం కాగా.. హార్దిక్‌ పాండ్య ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో 9 పరుగులే ఇచ్చాడు. ఆఖరు ఓవర్‌ తొలి బంతికి బెతెల్‌ రనౌట్‌గా నిష్క్రమించటంతో భారత్‌ ఊపిరీ పీల్చుకుంది. ఆర్చర్‌ (19 నాటౌట్‌) హ్యాట్రిక్‌ సిక్సర్లతో ఓటమి అంతరం కుదించాడు. 20 ఓవర్లలో 7 వికెట్లకు ఇంగ్లాండ్‌ 246 పరుగులే చేసింది. 7 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది. భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్య (2/38), జశ్‌ప్రీత్‌ బుమ్రా (1/33), అక్షర్‌ పటేల్‌ (1/35) రాణించారు.

మళ్లీ శాంసన్‌ షో
ఈడెన్‌లో విండీస్‌పై విశ్వరూపం చూపించిన సంజు శాంసన్‌.. వాంఖడెలో ఇంగ్లాండ్‌ను ఉతికేశాడు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ను సంజు శాంసన్‌ టాప్‌ గేర్‌లో నడిపించాడు. 2 ఫోర్లతో మెరిసిన అభిషేక్‌ శర్మ (9) మరోసారి ఆఫ్‌ స్పిన్‌ వలలో చిక్కాడు. ఇషాన్‌ కిషన్‌ (39) జతగా ఎదురుదాడి చేసిన శాంసన్‌.. రెండో వికెట్‌కు 45 బంతుల్లోనే 97 పరుగులు జోడించాడు. కిషన్‌ 2 సిక్స్‌లు, 4 ఫోర్లతో మెరువగా.. శాంసన్‌ ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 26 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. శాంసన్‌, కిషన్‌ జోరుతో 10 ఓవర్లలో భారత్‌ 119/1తొ నిలిచింది. మరో 9 వికెట్లు చేతిలో ఉండటంతో భారత్‌ భారీ స్కోరుకు గట్టి పునాది వేసుకుంది. స్పిన్నర్లను ఎటాక్‌ చేసేందుకు శివం దూబె (43)ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకొచ్చాడు. ఆదిల్‌ రషీద్‌పై సిక్సర్ల్లు బాదినా.. విల్‌ జాక్స్‌ మిడిల్‌ ఓవర్లలో బౌండరీ ఇవ్వకుండా మాయ చేశాడు. 7 సిక్సర్లు, 8 ఫోర్లతో మెరిసిన సంజు శాంసన్‌.. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించేలా కనిపించాడు.

కానీ విల్‌ జాక్స్‌ ఓవర్లో 89 పరుగుల వద్ద వికెట్‌ కోల్పోయాడు. అప్పటికి భారత్‌ స్కోరు 13.1 ఓవర్లలో 163/3. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (11) రషీద్‌పై ఓ సిక్సర్‌ బాది ఊపుమీద కనిపించినా.. తర్వాతి బంతికే స్టంపౌట్‌గా నిష్క్రమించాడు. స్పిన్నర్లపై శివం దూబె శివమెత్తగా.. హార్దిక్‌ పాండ్య (27) మూడు ఫోర్లు, 2 సిక్సర్లతో రెచ్చిపోయాడు. జోఫ్రా ఆర్చర్‌ ఓవర్లో తిలక్‌ వర్మ (21) 3 సిక్సర్లతో దంచికొట్టాడు. డెత్‌ ఓవర్లలో సమిష్టిగా మెరవటంతో భారత్‌ 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. మిడిల్‌ ఓవర్లలో 3 వికెట్లకు 123 పరుగులు, పవర్‌ప్లేలో ఓ వికెట్‌కు 67 పరుగులు చేసింది. బ్యాటింగ్‌ పిచ్‌పై 20 ఓవర్లలో 7 వికెట్లకు భారత్‌ 253 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో విల్‌ జాక్స్‌ (2/40), ఆదిల్‌ రషీద్‌ (2/41) రెండేసి వికెట్లు పడగొట్టారు. పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (1/61)ను భారత బ్యాటర్లు ఆడుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -