Wednesday, November 19, 2025
E-PAPER
Homeమానవికూల్ వెద‌ర్.. వెచ్చ‌టి సూప్‌

కూల్ వెద‌ర్.. వెచ్చ‌టి సూప్‌

- Advertisement -

రోజురోజుకు చలి చంపేస్తోంది. ఈకాలంలో చాలా మంది వెచ్చదనం కోసం రకరకాల సూప్స్‌ చేసుకుని తాగుతుంటారు. కూల్‌ వెదర్‌లో వెచ్చటి సూప్‌లు నోటికి రుచులను పంచుతూ సూపర్‌గా ఉంటుంది. అయితే సూప్‌లలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. మనం తీసుకొనే ఆ సూప్‌లు వెచ్చదనంతో పాటు మన శరీరానికి శక్తిని ఇచ్చేవిగా ఉంటే మరింత ప్రయోజన కరంగా ఉంటుంది. అలాంటి కొన్ని రకాల సూప్‌లు మీకోసం ఈరోజు…

వెజిటేబుల్‌ సూప్‌
కావాల్సిన పదార్థాలు: బీన్స్‌ – 8, క్యాబేజీ – పావు ముక్క, క్యారెట్‌ – 1, క్యాప్సికం -1(చిన్నది), అల్లం ముక్క – చిన్నది, ఉల్లిగడ్డ – 1, నెయ్యి – టేబుల్‌ స్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు – 2, ఉప్పు – రుచికి సరిపడా, కార్న్‌ఫ్లోర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, స్ప్రింగ్‌ ఆనియన్స్‌ – కొన్ని, మిరియాల పొడి – అర టీస్పూన్‌.
తయారీ విధానం: ఉల్లిగడ్డ, క్యాప్సికం, బీన్స్‌, క్యాబేజీని సన్నగా కట్‌ చేసుకోవాలి. క్యారెట్‌, అల్లం, వెల్లులి పొట్టు తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నెయ్యి వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి తరుగు వేసి ఓ నిమిషం పాటు వేయించాలి. అందులోకి ఉల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత తరిగిన క్యాబేజీ, క్యారెట్‌, క్యాప్సికం, బీన్స్‌ వేసి వేయించాలి. ముక్కలు కాస్త మగ్గిన తర్వాత లీటర్‌ నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఓసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు ఓ గిన్నెలోకి కార్న్‌ఫ్లోర్‌, పావు కప్పు నీళ్లు తీసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కూరగాయలు ఉడుకుతున్నప్పుడు కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం యాడ్‌ చేసుకుని అంతా కలిసేలా మిక్స్‌ చేసుకుని లో-ఫ్లేమ్‌లో మరో ఐదు నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. సూప్‌ కాస్త చిక్కబడిన తర్వాత మిరియాల పొడి, స్ప్రింగ్‌ ఆనియన్స్‌ వేసి కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసి వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే సరి.

చికెన్‌ సూప్‌
కావాల్సిన పదార్థాలు: చికెన్‌ – 400 గ్రాములు, నెయ్యి – నాలుగు టీస్పూన్లు, బిర్యానీ ఆకులు – రెండు, దాల్చిన చెక్క – రెండించుల ముక్క, లవంగాలు – ఆరేడు, యాలకులు – నాలుగైదు, ఉల్లిగడ్డలు – రెండు(చిన్నవి), పుదీనా ఆకులు – కొన్ని, ఉప్పు – రుచికి తగినంత, పసుపు – అరటీస్పూన్‌, నిమ్మకాయ – ఒకటి.
కొత్తిమీర పేస్ట్‌ కోసం: అల్లం – రెండించుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 20, కొత్తిమీర – కొద్దిగా, ఉల్లిగడ్డలు – రెండు (మీడియం సైజ్‌వి), మిరియాలు – రెండు టీస్పూన్లు.
తయారీ విధానం: చికెన్‌ శుభ్రంగా కడిగి పక్కనుంచాలి. అలాగే ఉల్లిగడ్డను సన్నగా తరిగి పెట్టుకోవాలి. కుక్కర్‌ గిన్నెలో నెయ్యి వేసి వేడయ్యాక బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. అవి లైట్‌గా వేగాక ఉల్లిగడ్డ వేసి కాస్త మెత్తబడే వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా వేసి వేయించాలి. అన్నీ వేగిన తర్వాత చికెన్‌ ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్‌ను లో-ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ ఐదారు నిమిషాలపాటు చికెన్‌ను బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మిక్సీ జార్‌లో అల్లం, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, పెద్ద సైజ్‌ ఉల్లిగడ్డ ముక్కలు, మిరియాలు, రెండు టీ గ్లాసుల నీళ్లు పోసుకుని మెత్తని పేస్ట్‌ చేసుకోవాలి. చికెన్‌ మిశ్రమంలో ఈ పేస్ట్‌ వేసి బాగా కలపాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సూప్‌కు తగినన్ని(నాలుగు గ్లాసుల) నీళ్లు పోసుకోవాలి. ఆపై నిమ్మరసం పిండి ఒకసారి మిశ్రమం మొత్తం బాగా కలిపి కుక్కర్‌ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో నాలుగు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించి దించేయాలి. అంతే నోరూరించే ‘చికెన్‌ సూప్‌’ రెడీ!

రాగి సూప్‌
కావాల్సిన పదార్థాలు: రాగి పిండి – ఆరు టీస్పూన్లు, ఉల్లిగడ్డలు – రెండు, టమాటాలు – రెండు, బీన్స్‌ – 12, క్యారెట్స్‌ – రెండు, పచ్చిమిర్చి – రెండు, అల్లం – అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు – నాలుగైదు, నెయ్యి లేదా నూనె – రెండు టీస్పూన్లు, జీలకర్ర – టీస్పూన్‌, ఉప్పు – రుచికి తగినంత, మిరియాల పొడి – టీస్పూన్‌, కొత్తిమీర తరుగు – కొద్దిగా, నిమ్మకాయ – ఒకటి.
తయారీ విధానం: ఉల్లిగడ్డ, బీన్స్‌, టమాటా, క్యారెట్‌, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి శుభ్రంగా కడిగి సన్నగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి నెయ్యి లేదా నూనె వేసి జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, క్యారెట్‌, బీన్స్‌ ముక్కలు వేసుకుని హై-ఫ్లేమ్‌లో రెండు మూడు నిమిషాలు వేగనియ్యాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు జత చేసి మరో రెండు నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి. అన్నీ కాస్త మగ్గాక అందులో ఆరు కప్పుల నీళ్లు పోసి, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్‌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ బాగా మరిగించుకోవాలి. ఈలోపు చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని రాగిపిండిని ఉండలు లేకుండా చిక్కని పేస్ట్‌లా కలుపుకోవాలి. కూరగాయల ముక్కలు బాగా మరుగుతున్నప్పుడు అందులో రాగిపిండి పేస్ట్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో మరో మూడ్నాలుగు నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని మరిగించుకోవాలి. తర్వాత అందులో మిరియాల పొడి యాడ్‌ చేసుకుని బాగా కలిపి ఒకట్రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. చివరగా అందులో కొత్తిమీర తరుగు వేసి, నిమ్మరసం పిండి ఒకసారి బాగా కలిపి సర్వ్‌ చేసుకోండి.

స్వీట్‌ కార్న్‌ సూప్‌
కావలసిన పదార్థాలు: స్వీట్‌ కార్న్‌ – పావుకప్పు, నీళ్లు – అరలీటర్‌, తరిగిన క్యారెట్‌ – చిన్నది, తరిగిన క్యాబేజీ – 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, వెనిగర్‌ – టీ స్పూన్‌, మిరియాలపొడి – అర టీ స్పూన్‌, పంచదార – అర టీ స్పూన్‌, కార్న్‌ ఫ్లోర్‌ – ఒక టీ స్పూన్‌, స్ప్రింగ్‌ ఆనియన్స్‌ – 3 టేబుల్‌ స్పూన్లు.
తయారు చేసే విధానం: ఒక మిక్సీ జార్‌లో స్వీట్‌ కార్న్‌ వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేయాలి. ఒక గిన్నెలో కార్న్‌ ఫ్లోర్‌ (మొక్కజొన్న పిండి) తీసుకుని కొద్దిగా నీరు పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో అరలీటర్‌ నీరు పోసి వేడి చేశాక.. అందులో కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేసిన స్వీట్‌ కార్న్‌, తరిగిన క్యారెట్‌, క్యాబేజీతో పాటు మరో రెండుస్పూన్ల స్వీట్‌ కార్న్‌ గింజలు వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి. పైన ఏర్పడిన నురుగను తీసేసి ఎనిమిది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. తర్వాత పైన చెప్పిన క్వాంటిటీలో వెనిగర్‌, మిరియాలపొడి, పంచదార, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న కార్న్‌ ఫ్లోర్‌ మిశ్రమాన్ని అందులో వేసి కలపాలి. అది కొంచెం చిక్కబడేలా ఉడికించాక స్ప్రింగ్‌ ఆనియన్స్‌ వేసి ఒక నిమిషం తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేస్తే.. వేడి వేడి హెల్దీ అండ్‌ టేస్టీ స్వీట్‌ కార్న్‌ సూప్‌ రెడీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -