భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
నవతెలంగాణ-టేక్మాల్
అనుమానాస్పద స్థితిలో భార్య మృతి చెందడంతో మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. బర్దిపూర్‌కు చెందిన దంపతులు గంగారం శ్రీశైలం (40), మంజుల (35).. మధ్య కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నెల క్రితం కూడా ఇలాగే గొడవకావడంతో కుటుంబీకులు, బంధువులతో కలిసి టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించి సర్ది చెప్పి పంపారు. కాగా, సోమవారం మళ్లీ వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో శ్రీశైలం బయటికి వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య మంజుల అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉంది. మనస్థాపంతో శ్రీశైలం సైతం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న అల్లాదుర్గం, టేక్మల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలకు పంచనామ నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ కృష్ణ చెప్పారు.


