Wednesday, September 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపిరికిపంద చర్య

పిరికిపంద చర్య

- Advertisement -

ఇజ్రాయిల్‌ దాడులపై మండిపడిన అరబ్‌, ఇస్లామిక్‌ దేశాల అధినేతలు
రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం కఠిన చర్యలు అవసరమన్న నేతలు

దోహా (ఖతార్‌) : ఖతార్‌ రాజధాని దోహాలో హమాస్‌ నేతలపై ఇజ్రా యిల్‌ జరిపిన దాడులను అరబ్‌, ఇస్లామిక్‌ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడులను పిరికిపంద చర్యగా అభివర్ణించాయి. ఆయా దేశాల నేతలతో ఏర్పడిన గల్ఫ్‌ సహకార మండలి (జీసీసీ) దోహాలో సమావేశమైంది. ఉమ్మడి రక్షణ వ్యవస్థను తిరిగి క్రియాశీలకం చేయాలని నిర్ణయించింది. దోహాపై ఇజ్రాయిల్‌ జరిపిన దాడులను కఠోరమైన, నమ్మకద్రోహంతో కూడిన పిరికిపంద చర్య అని ఖతార్‌ ఎమిర్‌ షేక్‌ తమిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీ మండిపడ్డారు. ఈ సమావేశానికి జీసీసీలో భాగస్వామ్య దేశాలైన బV్‌ారైన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌ హాజరయ్యాయి. సభ్య దేశాలు భద్రతా పరంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జీసీసీ ఓ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

శాంతి స్థాపనపై ఆసక్తి లేదు
‘నా దేశ రాజధానిలో హమాస్‌ నేతల కుటుంబాలు, ఆ నేతల చర్చల ప్రతినిధి బృందం నివసిస్తున్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని నమ్మకద్రోహంతో దాడి చేశారు’ అని సమావేశాన్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేసిన షేక్‌ తమిమ్‌ ఆరోపించారు. గాజాలో కాల్పుల విరమణ పాటించే విషయంపై అమెరికా చేసిన తాజా ప్రతిపాదనపై చర్చించడానికి హమాస్‌ నేతలు దోహాలో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వారిని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్‌ వైమానిక దాడి జరిపింది. ఇజ్రాయిల్‌ ప్రభుత్వ అధికార వ్యామోహం, అహంకారం, రక్తపిపాసను నిలువరించడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని షేక్‌ తమిమ్‌ పిలుపునిచ్చారు. మధ్యవర్తులపై ఇజ్రాయిల్‌ జరిపిన దాడిని చూస్తుంటే దానికి శాంతి స్థాపనపై నిజంగా ఆసక్తి లేదని, గాజాలో యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న చర్చలను అడ్డుకోవాలని ప్రయత్ని స్తోందని స్పష్టమవుతోందని ఆరోపించారు.

నేతలు ఏమన్నారంటే…
అమెరికా తన సన్నిహిత భాగస్వామి ఇజ్రాయిల్‌ను అదుపులో ఉంచాలని జీసీసీ సెక్రటరీ జనరల్‌ జసేమ్‌ మహమ్మద్‌ అల్‌బుదైవీ సూచించారు. ఖతార్‌పై మరోసారి దాడి చేసే అవకాశం ఉన్నదంటూ ఇజ్రాయిల్‌ చేస్తున్న బెదిరింపులను జీసీసీ సభ్య దేశాలు ఖండించాయి. ఇజ్రాయిల్‌ కనుక అలాంటి చర్యకు పూనుకుంటే అంతర్జాతీయ సమాజం ముందు దానిని దోషిగా నిలబెడతామని తెలిపాయి. ఇజ్రాయిల్‌పై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయి. ఇజ్రాయిల్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ సూచించారు. ఇజ్రాయిల్‌ అధికారులను చట్టం ముందు నిలపాలని కూడా ఆయన కోరారు.

అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించి ఖతార్‌పై ఇజ్రాయిల్‌ దాడి చేసిందని ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి విమర్శించారు. ఇజ్రాయిల్‌ను సస్పెండ్‌ చేయాలని ఐక్యరాజ్యసమితికి పాకిస్తాన్‌ విజ్ఞప్తి చేసింది. అరబ్‌-ఇస్లామిక్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఖండించినంత మాత్రాన క్షిపణి దాడులు ఆగవని, డిక్లరేషన్లను ఆమోదించినంత మాత్రాన పాలస్తీనాకు విముక్తి లభించదని మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహిం వ్యాఖ్యానించారు.

ఆధిపత్యం కోసం ఆరాటం
ఈ నెల 9న హమాస్‌ నేతలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఖతార్‌లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో జీసీసీ సభ్య దేశాలు అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి. గల్ఫ్‌ దేశాలు తమ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించాయని, త్వరలోనే దోహాలో యూనిఫైడ్‌ మిలిటరీ కమాండ్‌ సమావేశం జరుగుతుందని ఖతార్‌ విదేశాంగ ప్రతినిధి మహమ్మద్‌ అల్‌-అన్సారీ తెలిపారు. ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని విస్తరించుకోవడానికి ఇజ్రాయిల్‌ ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే లెబనాన్‌, సిరియా, ఎమన్‌పై బాంబు దాడులు చేస్తోందని ఖతార్‌ ఎమిర్‌ మండిపడ్డారు. సిరియా భూభాగాన్ని కూడా ఇజ్రాయిల్‌ ఆక్రమించుకున్నదని, దక్షిణ లెబనాన్‌ నుంచి తన దళాలను ఉపసంహరించుకునేందుకు నిరాకరిస్తోందని ఆయన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -