– మేడ్చల్ జిల్లా గాజులరామారంలో నిర్వహణ
– అసమానతల్లేని సమాజ నిర్మాణమే లక్ష్యం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
– పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈనెల 20 నుంచి 22 వరకు సీపీఐ రాష్ట్ర నాలుగో మహాసభలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం మహారాజా గార్డెన్‌లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలు జరిగే ప్రాంతానికి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ బాలమల్లేష్ నగర్’గా నామకరణం చేశామని వివరించారు. సీపీఐ వందేండ్ల ప్రస్థానంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రజలతో మరింత మమేకం అవుతామనీ, సిద్ధాంతాన్ని తీసుకెళ్తామని అన్నారు. కాంగ్రెస్‌తో అవగాహన కొనసాగిస్తూనే ప్రజా సమస్యలపై పోరాటాలను చేస్తామన్నారు. ఈ మూడేండ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ మతోన్మాద, ఫాసిస్టు విధానాలను అనుసరించిందని విమర్శించారు. ఆ విధానాలను ఎండగట్టడం ద్వారా గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 240 సీట్లకు కట్టడి చేయడంలో విజయం సాధించామన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాటాలు చేశామని చెప్పారు. రాష్ట్రంలో పోడు భూములకు సంబంధించి కమ్యూనిస్టులు నిర్వహించిన ఉద్యమాలతో 75 శాతం సమస్య పరిష్కారమైందన్నారు. అసంఘంటిత కార్మికుల వేతనాల పెంపు కోసం రాజీలేని పోరాటాలు జరిగాయని అన్నారు. ప్రజా సమస్యలు, పాలకుల విధానాలపై రాష్ట్ర మహాసభల్లో చర్చించి కార్యాచరణను రూపొందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, విఎస్ బోస్, ఈటి నరసింహా, మాజీ ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖరరావు, సీపీఐ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎండి యూసుఫ్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఇ. ఉమామహేష్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్ ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.
లోపభూయిష్టంగా పార్టీ ఫిరాయింపుల చట్టం
ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని కూనంనేని చెప్పారు. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. ఈ చట్టంలోని లోసుగుల కారణంగా అది సాధ్యం కాదని అన్నారు. గెలిచాక పార్టీ మారిన వెంటనే వారిపై అనర్హత వేటు పడేలా చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారించిన జస్టిస్ పిసి ఘోష్ ఏకసభ్య కమిషన్ నివేదికను ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనానికి సంబంధించి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపించిందని కూనంనేని సాంబశివరావు చెప్పారు. దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపారని గుర్తు చేశారు. తర్వాత బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్‌ను మంత్రివర్గం ఆమోదించి గవర్నర్‌కు పంపించిందని వివరించారు. దాన్ని కూడా కేంద్ర హోం శాఖ పరిశీలనకు పంపించారని అన్నారు. దాన్ని బట్టి బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకంగా ఉందని అర్థమవుతున్నదని విమర్శించారు. బీసీ బిల్లుకు అడ్డుపడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లునే కాకుండా ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి ద్వంద వైఖరి అవలంభిస్తున్నదని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి అన్ని పార్టీలూ, ప్రజలూ ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ అంశంపై కేంద్రం పార్లమెంట్‌కు వాస్తవాలను చెప్పడం లేదన్నారు. యుద్ధం తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించే ధైర్యం కూడా ప్రధాని మోడీ చేయడం లేదని చెప్పారు. వాస్తవాలను పార్లమెంట్ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
20 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES