ప్రకాశ్‌నగర్ వైకుంఠధామంలో అంత్యక్రియలు
తమ్మినేని, పోతినేని, నున్నా సహా నేతలు, కార్యకర్తల సంతాపం.. నివాళులు
కమ్యూనిస్టు ఉద్యమం చిగురించే రోజుల్లో రమేశ్ చనిపోవడం విచారకరం : తమ్మినేని..
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ ఖమ్మం
ఖమ్మం మాజీ కౌన్సిలర్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు నర్రా రమేశ్(58) శనివారం తెల్లవారుజామున అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. రమేశ్ మృతదేహాన్ని పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. తమ్మినేనితో పాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు ఎర్రజెండా కప్పి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం రమేశ్ మృతదేహాన్ని బురహాన్‌పురంలోని ఆయన స్వగృహానికి తరలించారు. అక్కడి నుంచి అంతిమయాత్ర ప్రకాశ్‌నగర్‌లోని వైకుంఠదామం వరకు సాగింది. అక్కడ అంత్యక్రియలు పూర్తి చేశారు. నర్రా రమేశ్‌కు భార్య నాగలక్ష్మి, కుమార్తె లోహిత, కుమారుడు లిఖిత్ ఉన్నారు. ఆయన సతీమణి నాగలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్నారు.
అంతకుముందు సీపీఐ(ఎం) కార్యాలయంలో ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంతాప సభలో తమ్మినేని మాట్లాడారు. ప్రపంచంలోనే కమ్యూనిస్టు ఉద్యమం, సిద్ధాంతాల బలం బలహీనపడిన పరిస్థితుల్లో ఉద్యమాన్ని అంటిపెట్టుకోవటం అనేది గొప్ప కమ్యూనిస్టు లక్షణం.. అటువంటి లక్షణమున్న నాయకుడు నర్రా రమేశ్ అని చెప్పారు. పెట్టుబడిదారీ సమాజానికి చివరి ఆశలు కొన్ని ఉన్నాయని తెలిపారు. మళ్లీ కమ్యూనిస్టు ఉద్యమం చిగురించే రోజుల్లో రమేశ్ చనిపోవటం దురదృష్టకరమన్నారు. జాతీయోద్యమం గురించి గొప్పగా పాఠం చెప్పేవారని, జాతీయోద్యమం అంటే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటమని వివరించారని గుర్తు చేశారు. పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల తరఫున హృదయపూర్వక నివాళులర్పించారు.
నర్రా రమేశ్‌లో గొప్ప కమ్యూనిస్టు లక్షణాలు
నర్రా రమేశ్ మరణం చాలా బాధాకరమని, అతని శక్తిసామర్థ్యాలు ప్రత్యేకమైనవని సంతాప సభలో తమ్మినేని తెలిపారు. నిర్మాణ సామర్థ్యం, దక్షత, సైద్ధాంతిక స్పష్టత ఉన్న కామ్రేడన్నారు. 58 ఏండ్ల జీవితంలో సుమారు 40-45 ఏండ్లపాటు అదే ఆశయానికి కట్టుబడి ఉండటం, వేరే స్వార్థం లేకుండా ఉండటం…అనారోగ్యంలోనూ పార్టీ గురించి ఆలోచించటం నర్రా రమేశ్‌లో ఉన్న ఉత్తమ కమ్యూనిస్టు లక్షణమని తెలిపారు. కుటుంబం ఇబ్బందులపాలైనా పార్టీ ఇబ్బందుల పాలుకాకూడదు అనే ఆలోచన చేసిన వారే గొప్ప కమ్యూనిస్టన్నారు. విద్యార్థి, యువజన ఉద్యమంలో నర్రా రమేశ్ కీలకంగా వ్యవహరించారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తెలిపారు. పేదల ఇండ్ల స్థలాలు, మంచినీటి సమస్యపై కౌన్సిలర్‌గా రమేశ్ గళమెత్తారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఈ సంతాపసభలో కార్పొరేటర్లు యర్రా గోపీ, యల్లంపల్లి వెంకట్రావ్, బి.వెంకట్‌కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజె రమేశ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, పి.రాజారావు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, మాదినేని రమేశ్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, పార్టీ సీనియర్ నాయ కులు పి.సోమయ్య, ఎం. సుబ్బారావు, దేవేంద్ర, పొన్నం వెంకటేశ్వర రావు, సీపీఐ జిల్లా నాయకులు శింగు నర్సింహారావు, ప్రముఖ రచయిత మువ్వా శ్రీనివాస రావు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా నాయకులు సీవై పుల్లయ్య, అశోక్, డాక్టర్ చీకటి భారవి తదితరులు పాల్గొన్నారు.
మోడీ చైనాకు వెళ్లి ఎర్రజెండాకు నమస్కరించక తప్పనిస్థితి
కమ్యూనిస్టు, సోషలిస్టు వ్యతిరేకి, మతోన్మాది, అమెరికాకు వంగి వంగి దండం పెట్టిన ప్రధాని మోడీ ఇప్పుడు చైనా వెళ్లి ఎర్రజెండాకు నమస్కరించే పరిస్థితులు వచ్చాయని తమ్మినేని అన్నారు. మనమంతా కలిసి అమెరికాను ఎదుర్కోవాలని చైనా అధ్యక్షులు జిన్‌పింగ్, రష్యా ప్రధాని పుతిన్‌తో కలిసి ఫ్రంట్ ఏర్పాటుకు సిద్ధపడటమే కమ్యూనిస్టు ఉద్యమానికి మంచి రోజులు వచ్చాయనేందుకు నిదర్శనమన్నారు. అమెరికన్ సామ్రాజ్య వాదం బలహీనపడి, ప్రపంచ ఆధిపత్యాన్ని కోల్పోయే స్థితి వచ్చిందన్నారు. ఇదీ కమ్యూనిస్టులు చెప్పేమాట కాదు.. ప్రపంచ పెట్టుబడి దారులు కూడా అంగీకరిస్తున్న విషయమన్నారు.