మధిరలో ర్యాలీ.. జిల్లా వ్యాప్తంగా నిర్బంధం
సీపీఐ(ఎం) నేతల అరెస్టులపై పెల్లుబికిన ఆగ్రహం
డిప్యూటీ సీఎం తీరుపై వెల్ల్లువెత్తిన నిరసన
దాడులను నిరసిస్తూ మధిరలో భారీ ప్రదర్శన
అడ్డంకులను అధిగమించి నిర్వహించిన శాంతి ర్యాలీ, సభ విజయవంతం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో సీపీఐ(ఎం) నేతలు, కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ శనివారం నియోజకవర్గ కేంద్రంలో తలపెట్టిన శాంతి ర్యాలీని పోలీసులు అడ్డుకోవటంపై పెద్దఎత్తున నిరసనలు పెల్లుబి కాయి. పార్టీ సీనియర్ నాయకులు సామినేని రామారావు హత్య మొదలు మొన్నటి పంచాయతీ ఎన్నికలు, అంతకుముందు నుంచి చోటుచేసుకున్న పరిణామాలపై సీపీఐ(ఎం) కార్యకర్తలు నిరసన తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలపై మధిర నియోజకవర్గంలో దాడులు కొనసాగుతున్నాయి. ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్.. మధిర నియోజకవర్గంలో కొనసాగిస్తున్న నిర్బంధకాండను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధిరలో సీపీఐ(ఎం) చేపట్టిన శాంతి ర్యాలీకి పోలీసుల అనుమతి తీసుకుంది. సమ్మతించిన పోలీసులు.. దానికి భిన్నంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేశారు. మధిరలో జరిగే ర్యాలీకి వెళ్లకుండా సీపీఐ(ఎం) ముఖ్య నేతలను అరెస్టు చేయటం, గృహ నిర్బంధం చేశారు.
ఖమ్మం నగరంలో అరెస్టులు
మధిరలో శనివారం ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉండగా పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వై.విక్రమ్, పార్టీ సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు తదితరులను శనివారం తెల్లవారుజామునుంచే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు యల్లంపల్లి వెంకటరావు, యర్రా గోపిని అరెస్టు చేశారు. ఖమ్మం టూటౌన్, త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో మధ్యాహ్నం వరకూ ఉంచారు. ఇదంతా సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతుండటంతో పోలీసులు నున్నా నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావును మధిర వెళ్లేందుకు అనుమతించారు. మారుమూల ప్రాంతమైన కారేపల్లి మండల సీపీఐ(ఎం) నేతలను కూడా అరెస్టు చేశారు. ముదిగొండ నుంచి జనసమీకరణ కాకుండా నాయకులను అడ్డుకున్నారు. మధిరకు తరలివచ్చే కార్యకర్తలను అడ్డగించారు. మధిర నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే కొనసాగింది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తీరు ఉంది. అయినా అడ్డంకులను అధిగమించి సీపీఐ(ఎం) కార్యకర్తలు పెద్దఎత్తున మధిర తరలివెళ్లారు. శాంతిర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీకి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సైతం హాజరై భట్టి విక్రమార్క, పోలీసుశాఖ తీరును ఎండగట్టారు.
ప్రజాపాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి
ప్రజాపాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. మధిర నియోజకవర్గంలో సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతించి ఆ తర్వాత అరెస్టులు చేయటం అనైతికం. ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పరిరక్షణను భుజాని కెత్తుకున్న కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదు. ప్రజాభవన్‌లో నివసించే ఉపముఖ్యమంత్రి ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించే విధానం ఇదేనా? ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలి.



