నవతెలంగాణ – హైదరాబాద్: గిరిజన హక్కులు, సంస్కతి, సమస్యలపై జీవితమంతా అంకితభావంతో పనిచేసిన డాక్టర్ వి.ఎన్.వి.కే. శాస్త్రి మరణం పట్ల సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ రోజు మెహిదీపట్నంలోని వారి నివాసంలో శాస్త్రి గారి భౌతికకాయానికి రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ శాస్త్రి గారు ఏటూరునాగారం, ఉట్నూర్, శ్రీశైలం, భద్రాచలం ఐటిడిఏల్లో ప్రాజెక్టు అధికారిగా, ఆ తరువాత గిరిజన సాంస్కతిక అధ్యయన సంస్థ డైరెక్టర్‌గా పనిచేసి ఆదివాసీల సంక్షేమానికి సేవలందించారు.
గిరిజన సంస్కతి, సంక్షేమం, జీవనోపాధి, భౌగోళిక హక్కులపై అనేక పరిశోధనలు చేసి పుస్తకాలు, వ్యాసాలు రాసి ప్రజలను చైతన్యపర్చారు. గిరిజన హక్కులు, చట్టాల రక్షణకై అండగా ఉంటూ, సదస్సులు, సెమినార్లల్లో ప్రత్యక్షంగా పాల్గొని వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చేవారు. బాక్సైట్ తవ్వకాల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో సభ్యుడిగా గిరిజనులకు వాటిల్లే నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తూ, నివేదికను సమర్పించారు. ఇంద్రవెళ్ళి గిరిజన భూముల ఆక్రమణ సందర్భంగా జరిగిన పోలీస్ కాల్పుల్లో 25 మంది మరణించిన ఘటనపై విచారణాధికారిగా పనిచేసి పోలీసులపైనే వ్యతిరేకంగా ధైర్యంగా నివేదికిచ్చిన అరుదైన అధికారి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అనేక గిరిజన కమిటీల్లో సభుడిగా పనిచేసి గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి, భూముల హక్కుల పరిరక్షణకు చివరి వరకూ శ్రమించిన ఆయన సేవలు అందరికీ ఆదర్శమని జాన్ వెస్లీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఆర్ శ్రీరాం నాయక్, ఎం ధర్మనాయక్, రైతు సంఘం నాయకుడు మూడ్ శోభన్ పాల్గొని నివాళులర్పించారు. (జె బాబూరావు)ఆఫీస్ కార్యదర్శి


