“The relevance of studying literary criticism as a student is to sensitize and sharpen your literary analysis and critical thinking
skills, in order to more fully engage with the text”.
CARL ROODNICK, Author, Content development specialit, Educationak expert
ఏదేని సాహితీ ప్రక్రియను లేదా గ్రంథాన్ని వివిధ కోణాల నుండి విశ్లేషించి, మూల్యాంకనం చేసే ప్రక్రియను ‘సాహిత్య విమర్శ’ అంటారు. కేవలం ప్రక్రియా సంబంధ, గ్రంథ కర్తత్వంలోని తప్పొప్పులు చెప్పడం మాత్రమే కాకుండా, రచన స్థాయిని, అంతరార్థాన్ని, రచయిత ఉద్దేశాన్ని, రచనా నేపథ్యాన్ని, పాఠకుల అనుభూతిని, ప్రాసంగికతను పరిగణనలోకి తీసుకుని విమర్శకుడు చేసే సమగ్ర అధ్యయనమే విమర్శ. రచనలోని సౌందర్యాన్ని పాఠకుడికి మరింత గ్రాహ్యం చేయడం, సాహిత్యానికి సదిశను సూచిస్తూ సాహిత్యాభివృద్ధికి మార్గదర్శనం చేయడమే విమర్శ ముఖ్య లక్ష్యం. రచనా నిర్మితి, వస్తు సౌందర్యం, రస నిర్వహణ, అలంకారాల చర్చకు ప్రాధాన్యతనిచ్చే కళాత్మక విమర్శ కావొచ్చు.
రచనా కాలం, నాటి పరిస్థితులు, రచయిత నేపథ్యాన్ని విశ్లేషించే చారిత్రక విమర్శ కావొచ్చు, సాహిత్యం సమాజంపై చూపే ప్రభావాన్ని, సామాజిక సమస్యలు ప్రతిబింబించిన తీరుతెన్నులను అనుశీలించే సామాజిక విమర్శ కావొచ్చు, వర్గ పోరాటం, కార్మిక నేతత్వ రాజకీయాలు, అభ్యుదయ భావజాలం, ప్రగతిశీల దృక్పథం, క్రాంతికారి పరివర్తన కోణంలో సాహిత్యాన్ని విశ్లేషించే మార్క్సిస్టు విమర్శ కావొచ్చు, పాత్రల ప్రవర్తన, మనస్తత్వాన్ని విశ్లేషించే మనోవైజ్ఞానిక విమర్శ కావొచ్చు… ఈ అన్నింటికి మూలాధారమైన చర్చను చేపట్టినపుడే విద్యార్థులు సాహిత్య విమర్శను పరిపూర్ణంగా అర్థం చేసుకోగలరు.
ఇందుకు సాహిత్య విద్యార్థులు రొటీన్‌కు భిన్నంగా తరగతిగదిలో కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. సాహిత్య విమర్శ కొలమానాలు, ధోరణులు వాటి వస్తురూపాల సంసర్గత అర్థమయ్యేటట్టు మౌలిక విషయాల దగ్గర ఈ ప్రశ్నలు ప్రారంభం కావాలి. ఈ ప్రపంచంలో కోటానుకోట్లమంది ప్రజలు తమదైనందిన జీవితాల్లో మునకలేస్తూ ఉంటే కొద్దిమంది మాత్రమే కవులు రచయితలు ఎందుకు అవుతారు అనేది ప్రతిసాహిత్య విద్యార్థి సంధించుకోవాల్సిన మొట్టమొదటి ప్రశ్న. ఈ ప్రశ్న సాహిత్య విమర్శకు తాత్వికమైన తొలి అడుగు. ఇదిగో ఇదీ దీనికి సమాధానం. ప్రపంచమంతా ఒక విషయాన్ని కంటితో మాత్రమే చూడగలిగితే, కవులు రచయితలు మాత్రం హదయంతో దర్శిస్తారు. ఇట్లా హృదయంతో చూడగలగడమే కవులు రచయితలను మిగతావారి కంటే భిన్నంగా నిలబెడుతుంది. ఆయా విషయాలను హృదయంతో చూసేటప్పుడు కవులు రచయితల మానసిక పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నను కూడా సాహిత్య విద్యార్థి తప్పనిసరి వేసుకోవాలి. ఈ ప్రశ్న సాహిత్య విమర్శకు రెండో అడుగు. దీనికీ సమాధానం తాత్వికంగానే దొరుకుతుంది.
కవులు రచయితలు ఒక విషయాన్ని హృదయంతో దర్శించినప్పుడు వారి మానసిక స్థితి అత్యంత ఉద్వేగభరితంగానూ లోతుగానూ గంభీరంగానూ సారభూతంగానూ ఉంటుంది. మార్మికమైన ఈ సమయంలో కవులు రచయితల మానసికస్థితి చూస్తే ‘భావోద్వేగ తాదాత్మ్యం (Emotional Empathy)’ మొదటిది. ఈ స్థితిలో కవులు తాము చూసే వస్తువుతో లేదా సన్నివేశంతో పూర్తిగా మమేకమైపోతారు. ఎదుటివారి బాధ తమ బాధగా, అందం ఆనందాలను తమ సౌందర్యం ఆనందంగా అనుభూతి చెందుతారు. రెండోది ‘అతీంద్రియ స్థితి (Transcendental state/ Supernatural state)’. ఇక్కడ లౌకిక ప్రపంచాన్ని మరచిపోయి ఒక రకమైన ‘సమాధి’ స్థితిలో ఉంటారు. అంటే, బాహ్య ప్రపంచంలో ఉంటూనే అంతర్ముఖంగా తమ మనోప్రపంచంలో తాము సంచరిస్తుంటారు. ఇక మూడోది ‘అతిసూక్ష్మ పరిశీలన (Microscopic observation)’. ఈ స్థితిలో సాధారణంగా కంటికి కనిపించని భావాలు, రంగులు, ధ్వనులు, హేతువులు కవుల రచయితల హృదయానికి స్పష్టంగా వినిపిస్తాయి, అగుపిస్తాయి.
అందుకే రాయిలో శిల్పాన్ని, రాలిన పువ్వులో వేదనను కవులు రచయితలు చూడగలుగుతారు. ఇక నాల్గోది ‘ప్రసవ వేదనను పోలిన తపన (A burning desire/ Intens longing)’. ఈ స్థితిలో హృదయంలో జనించిన భావాలు అక్షర రూపందాల్చే వరకు మనోతాపాన్ని ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. ఆ భావనలు రచనగా మారాకనే కవులు రచయితలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక ఐదోది ఆఖరుది ‘సార్వజనీనత (Universality)’. ఈ స్థితిలో కవులు రచయితల వ్యక్తిగత అనుభవాలు హదయ స్పర్శతో లోకమంతటికీ సంబంధించినవిగా మారుతాయి. ఆ స్థితిలోనే తమ బాధ, దుఃఖం ప్రపంచం బాధగా దుఃఖంగా రూపాంతరం చెందించే సృజనాత్మకత సమకూరుతుంది. ఈ ఐదు స్థితులను గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, కవులు రచయితలు హృదయంతో చూడగలిగే శక్తిమంతులు అయినందున్నే తాము ‘ద్రష్ట’ (Visionary)లు గా మారి రచనల్లో సత్యాన్ని సౌందర్యంగా ఆవిష్కరిస్తారు.
ద్రష్ట నుండి స్రష్టగా పరిణతి చెందిన కవి రచయిత ఏం రాస్తాడు? ఈ ప్రశ్న సాహిత్య విమర్శలో మూడో అడుగు. ప్రపంచంలో ఏకాలపు కవులు రచయితలైనా రచనలు చేయడానికి ప్రధాన కారణాలు నాలుగు. వీటిలో మొదటిది భావోద్వేగాల వ్యక్తీకరణ’ (Expression of emotions)’. ప్రేమ, కోపం, బాధ, ఆనందం వంటి తీవ్రమైన భావోద్వేగాల వ్యక్తీకరణకు సాహిత్యం ఒక సాక్షాత్కారం. రెండోది ‘జీవితానుభూతుల ప్రతిబింబం (Reflection of life experiences)’. జీవితంలోని సంఘటనలను, అనుభవాలను, వాటిలోని లోతును, అసంబద్ధతను సజీవంగా ఆవిష్కరించడానికి సాహిత్యం ఒక నిర్దిష్ట కళారూపం. మూడో కారణం ‘ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం (Understanding the world)’. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, సమాజాన్ని, మనుషులను విశ్లేషించడానికి, అర్థం చేసుకోవడానికి సాహిత్యం ఒక అపురూప సాధనం. ఇక ఆఖరుది ‘సామాజిక చలనం పట్ల స్పందన’ (Response to social dynamics). సమజంలోని అంతరాలు, అసమానతలు, సమస్యలు, ఉద్యమాలు, ప్రతిఫలనాలు, స్పందన ప్రతిస్పందనల రికార్డుకు సాహిత్యం ఒక ప్లాట్‌ఫాం.
అయితే, ఒక వ్యక్తి సాహిత్యకారుడిగా రూపుదిద్దుకున్నాక తను చేపట్టి కొనసాగించిన ప్రక్రియల్లో గుణాత్మకమార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. ఆ మార్పులు కవులు రచయితల తాలూకు స్థల కాల వర్గ, వర్గలింగ సంబంధిత ‘లోతైనభావాలు (Profound ideas), చిత్రణ (Imagery), వైయక్తిక స్వరం (Unique Voice), భాషణ మర్యాద (Speech Etiquette)’ల రూపంలో నమోదవుతాయి. లియో టాల్‌స్టాయ్, దోస్తోయెవ్‌స్కీ, టిఎస్ ఇలియెట్, జార్జ్ ఆర్వెల్, గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్, ఖలీల్ జిబ్రాన్ తదితరులు హదయంతో ప్రపంచాన్ని దర్శించి విజనరీలుగా ‘వార్ అండ్ పీస్, క్రైమ్ అండ్ పనిష్మెంట్, వేస్ట్ లాండ్, 1984, వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్, ది ప్రాఫెట్’ గ్రంథాలను సృజించారు. తెలుగు సాహిత్యంలో గురజాడ, జాషువా, చలం, శ్రీశ్రీ, శేషేంద్ర, విశ్వనాథ, తిలక్, కొకు, సినారె ప్రభతులు మహాద్రష్టలుగా కొనసాగించిన కృషి ఎనలేనిది. కార్ల్ రుడ్నిక్ చెప్పినట్టు ఆయా సాహిత్యకారుల గొప్పతనం, రచనల విలువ ఉత్కృష్టత బోధపడేది context to text సహేతుకమైన ప్రశ్నలు సంధిస్తూ శోధిస్తూ విద్యార్థులు తాము మెదళ్లకు పదును పెట్టుకోవడం మూలాన్నే.
- డా.బెల్లి యాదయ్య
9848392690



