– చెరువులో చేపల వేటకు వెళ్లేందుకు జంకుతున్న మత్స్యకారులు
– అటవీ శాఖ అధికారులు మొసలిని పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకోలు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ నల్ల చెరువు(ఊర చెరువు)లో ఆదివారం ఉదయం ముసలి కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా నల్ల చెరువులో మొసలి ఉందన్న వదంతులు వ్యాపించిన నేపథ్యంలో పలువురికి మొసలి కనిపించడంతో గ్రామ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చెరువులోకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఇకపై చేపల వేటకు ఎలా వెళ్లడం అనే ఆందోళనలో మునిగిపోయారు. గత 15 రోజుల క్రితం చెరువులో మొసలి కనిపించిందని కొందరు స్థానిక గ్రామ సోషల్ మీడియా గ్రూపులో వీడియోను పోస్ట్ చేశారు. అయితే గ్రామస్తులు దాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు.
అయితే ఆదివారం ఉదయం చెరువుకట్టపై వ్యవసాయ తోటలోకి వెళుతున్న పలువురి రైతులకు మొసలి కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే ముసలి ఫోటోలను తీసి గ్రామ సోషల్ మీడియా గ్రూపులో ఫోటోలను పోస్ట్ చేశారు. చెరువులోకి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలంటూ సమాచారాన్ని పెట్టారు. దీంతో క్షణంలోనే చెరువులో మొసలి ఉందన్న సమాచారం దావనంలా గ్రామంలో వ్యాపించింది. అయితే చెరువులోకి మొసలి ఎలా వచ్చిందనేది ఎవరికి అందుచిక్కని ప్రశ్నగా మిగిలింది. అయితే గత సంవత్సరం భారీగా కురిసిన వర్షాల మూలంగా వరద కాలువ తూము నుండి చెరువులోకి నీటిని వదిలిన సమయంలో మొసలి పిల్ల రూపంలో ఉప్పులూరు నల్ల చెరువులోకి వచ్చి ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.
అయితే గత సంవత్సర కాలంగా చెరువుల ముసలి ఉన్న సంగతి చెరువుగట్టు పై నుండి పంటతోటల్లోకి వెళ్లే రైతులు గాని చెరువులో చేపలు పట్టే మస్యకారులు గాని గుర్తించకపోవడం ఏంటని ఎవరికి అంతు పట్టడం లేదు. ప్రస్తుతం చెరువులో మొసలి దర్శనం ఇవ్వడంతో మత్స్యకారులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం ఏం తెలియకపోవడంతో చెరువులో చేపల వేట కొనసాగించామని, ఇప్పుడు మొసలి ఉందన్న విషయం తెలియడంతో చేపలు పట్టేందుకు వెళ్లాలంటే భయంగా ఉందని పలువురు మత్స్యకారులు తెలిపారు.ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా పరిశీలిస్తామని తెలిపినట్లు మత్సకారులు పేర్కొంటున్నారు. అటవీ శాఖ సిబ్బంది మాత్రం త్వరగా చెరువులో ఉన్న ముసలిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఉప్లూర్ నల్ల చెరువులో మొసలి కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES