రాష్ట్రానికి వరద సాయం అందించండి : కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ వరద నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం నాడిక్కడ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ సెక్రెటరీ రఘనందన్ రావు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ లో రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే తెలంగాణలో ప్రస్తుతం యూరియా కొరత కారణంగా నెలకొన్న పరిస్థితులను తుమ్మల.. కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణలో ఇప్పటివరకు 71,985 మంది రైతులు 63,567 హెక్టార్లలో పామాయిల్ సాగుచేస్తున్నారన్నారు. 2025-26 సంవత్సరంలో మరో 50 వేల ఎకరాల్లో సాగుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కి తుమ్మల వివరించారు. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకం సమస్యగా మారిందని తెలిపారు. అందువల్ల ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపును పున్ణపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఆయిల్ పామ్ గెలలకు టన్నుకు రూ. 25000 కనీస మద్ధతు ధర కల్పించేలా ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని మంత్రి కోరారు. తద్వారా రాష్ట్రంలో పామాయిల్ సాగు పెరిగి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడుతుందని వివరించారు. అలాగే న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీ (ఎన్‌బీఎస్) స్కీం కింద ఫాస్పరస్, పొటాషియంపై రాయితీని పెంచాలని కోరారు. యూరియాతో సమానంగా ధరల సమతుల్యత పాటించాలని తుమ్మల నాగేశ్వర రావు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని.. భూమి సారాన్ని కాపాడటానికి అవకాశం ఉంటుందని వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, ప్రభావాలు రైతులపై పడకుండా ఉండాలంటే.. రాయితీని పెంచడం ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డారు.
అలాగే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాలను ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ జిల్లాల్లో రైతులు వర్షాధార పంటలను పండిస్తున్నారని.. పరిమితమైన మౌలిక సదుపాయాల కారణంగా.. తక్కువ దిగుబడి వస్తోందని వివరించారు. ఈ జిల్లాలను పీఎండీడీకేవై పథకంలో చేర్చడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతోపాటు.. రైతులకు మేలు జరుగుతుందని మంత్రి వివరించారు. వ్యవసాయ యంత్రాలపై 12 శాతం జీఎస్టీ తెలంగాణ రైతులకు ఆర్థిక భారాన్ని పెంచుతోందని కేంద్రమంత్రికి వివరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారని మంత్రి వెల్లడించారు.
కేంద్రం నిర్లక్ష్యంతోనే దేశమంతా యూరియా కొరత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో దేశవ్యాప్తంగా యూరియా కొరత సమస్యగా మారిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగే శ్వరరావు విమర్శించారు. యూరియా సరైన సమయానికి రాకపోవడం వల్ల తెలంగాణ రైతాంగం ఆందోళనలో ఉందన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. వేరే దేశాల నుంచి సమయానికి తగ్గట్లుగా యూరియా దిగుమతి చేసుకోవడంలో కేంద్ర వైఫల్యం చెందిందని, ఆ ప్రభావం తెలంగాణపైనా ఉందని చెప్పారు. భౌగోళికపరంగా తెలంగాణలో పంటలకు సెప్టెంబర్ 5 లోపు ఎరుపులు చాలా అవసరం అన్నారు. ఇందుకు తగ్గట్లుగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కి 11 లక్షలు మెట్రిక్ టన్నులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. అయితే, 9.8 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తామని కేంద్రం తెలిపిందని, అందులోనూ ఇప్పటి వరకు కేవలం 5.20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందిందని వివరించారు.
రాష్ట్రం లో బ్లాక్ మార్కెట్‌కు ఆస్కారం లేదు
కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు తెలంగాణ లో యూరియా బ్లాక్ మార్కెట్ కి ఆస్కారం లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. యూరియాకు సంబంధించి జిల్లా కలెక్టర్ల వద్ద పూర్తి సమాచారం ఉంటుందని తెలిపారు. యూరియా సమస్య ఒక్క తెలంగాణలోనే కాదని.. దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉందని కేంద్రం గుర్తించాలన్నారు. చైనా నుంచి ఎర్ర సముద్రం మీదుగా వచ్చే యూరియా రాకపోవడం, దేశీయంగా ఉత్పత్తి పెంచకపోవడం వల్ల యూరియా కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. రామగుండంలో నాలుగు నెలలుగా ఉత్పత్తి లేదని, ఇంకా 15 రోజుల వరకు ఉత్పత్తి జరిగే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణాలో భారీ వర్షాల ప్రాథమిక అంచనా ప్రకారం 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరతామన్నారు. గత వరదల విషయంలోనూ కేంద్రం సాయం చేయలేదని గుర్తు చేశారు. అలాగే, కొత్తగూడెం ఎయిర్ పోర్టు, ఇతర అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి చర్చిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం
- Advertisement -
- Advertisement -