– ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి
– ఏఈడబ్ల్యూసీఏ జిల్లా కార్యదర్శి జోగ రాంబాబు
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఆదివాసుల పురోగతికి వారి సంస్కృతి, సంప్రదాయాల రక్షణే మార్గమని ఏఈడబ్ల్యూసీఏ జిల్లా కార్యదర్శి జోగ రాంబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ప్రపంచం ఆదివాసీ దినోత్సవాన్ని ఆనవాయితీగా జరుపుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా ఆదివాసుల సంస్కృతిక విలువలు, జీవనశైలి, హక్కులను గుర్తించడమే లక్ష్యమన్నారు. ఈ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆదివాసుల గొప్ప చరిత్రను స్మరించుకోవాలని చెప్పారు.
అదేవిధంగా వారి హక్కులు – చట్టాల పై వారికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఆదివాసులకు అడవి అమ్మ అని, భూమి హక్కు అని అభివర్ణించారు. గిరిజనుల ఉనికి కోసం ఓ ఉద్యమం ఎంతైనా అవసరమని ఉద్ఘాటించారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు, గ్రామస్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు, ర్యాలీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం గిరిజనుల హక్కులను పకడ్బందీగా అమలు చేయాలని అదేవిధంగా పోడు భూముల పంపిణీ, అటవీ హక్కులు, వన జీవుల హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రతి గూడెంలో ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, జెండా ఆవిష్కరణ కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.