నవతెలంగాణ – జమ్మికుంట
రైతులు వేసిన పంటలు వాతావరణ పరిస్థితులు రీత్యా ఆరోగ్యవంతంగా ఎదిగి మంచి దిగుబడి రావాలంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన సలహాలను రైతులు పాటిస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త జె విజయ్ తెలిపారు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల గత వారం రోజులుగా రాష్ట్రంలో మోస్తారు నుంచి భారి వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజులలో జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
వరి: వరి పొలాలలో భారీ వర్షాల కారణంగా మురుగు నీరు నిలిచి ఉండకుండా ఉండేందుకు, మురుగు నీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్త రైతులకు సూచిస్తున్నారు. వర్షాలు ఆగిపోయే వరకు ఎరువులు ,పురుగు మందులు , కలుపు మందుల వాడకాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలి.
మొక్కజొన్న: పంట పొలాలలో మురుగు నీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. మొక్కజొన్న ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి ఒకవేళ పొలంలో మురుగు నీరు నిలిచి ఉన్నట్లైతే పొలం నుండి నీటిని వెంటనే తీసివేయాలి. అధిక వర్షాల వలన నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్ని ఊదారంగులోకి మారే అవకాశం ఉంటుంది. కావున వర్షాలు తగ్గిన తర్వాత 5గ్రా. 19-19-19 లేదా 20 గ్రా డిఎపి మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.
ప్రత్తి: జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్ష సూచన ఉన్నందున ప్రత్తి పంట పొలాలలో మురుగు నీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. భారీ వర్షాల కారణంగా ప్రత్తిలో కాండం కుళ్ళు తెగులు సోకుటకు అనుకూలం. ఈ తెగుళ్ళు సోకడం గమనించినట్లైతే, వర్షాలు తగ్గిన తరువాత, నివారణకు 2 గ్రా. కార్బండజిమ్ , మాంకోజెబ్ మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ళు తడిచే విధంగా పోయాలి.
భారీ వర్షాల కారణంగా ప్రత్తి పంట నీటి ముంపుకు గురైనట్లైతే వడలు తెగులు ఆశించడానికి అనుకూలం. వడలు తెగులు నివారణకు, పొలంలోంచి మురుగు నీటిని తీసివేసి, పంట త్వరగా కోలుకోవడానికి, వర్షాలు తగ్గిన తరువాత, 10 గ్రా. పాలిఫీడ్ (19:19:19) లేదా మల్టీ-కే లేదా యూరియా లీటరు నీటికి కలిపి వా రోజుల వ్యవధిలో రెండు నుండి మూడు సార్లు పిచికారి చేయాలి. 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటరు నీటికి నేల పూర్తిగా తడిచేతట్టు పోయాలని వ్యవసాయ శాస్త్రవేత్త జే విజయ్ రైతులకు సూచించారు.