గత పదకొండేండ్లుగా దేశం అతలాకుతలమై పోతున్న సంగతి అందరికీ తెలిసిందే! అంతేకాదు, దేశ భవిష్యత్తును అంధకారం చేయడానికి ఇప్పటి ఈ కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతూ వచ్చింది. అందుకోసమే ప్రభుత్వ పెద్దలు రాత్రింబవళ్లు కృషి చేస్తూనే ఉన్నారు. ఇతర విషయాలేవైనా, పాఠశాల పాఠ్యపుస్తకాల్లో సిలబస్ మార్చి, రాబోయే తరాల వారికి భవిష్యత్తు లేకుండా చేయబోతున్నారు. దేశంలో ప్రమాదకరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయని మనకు తెలుసు. 2015-16లలో వరుసగా జరిగిన మానవవాదుల హత్యలు, హేతువాదులపై దాడులు, ఆలోచనాపరులైన రచయితలపై ఒత్తిళ్లు – భవిష్యత్తు చీకటిగా ఉండబోతూ ఉందని హెచ్చరిస్తూనే వచ్చాయి. అప్పటి నుండి ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. అందుకు కారణం కేంద్ర మంత్రుల ఉపన్యాసాలు, పనితీరు ఒకటైతే- వివిధ రాష్ట్రాల్లో మార్చిన NCERT-CBSE పాఠ్యాంశాలు మరొక కారణం! ఒకసారి మాజీ రక్షణ శాఖామంత్రి మనోహర్ పర్రికర్, డిఫెన్స్ రీసర్చ్ డవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ)లోని రక్షణ శాస్త్రవేత్తలకు గొప్ప ఉపన్యాసమిచ్చాడు.
ప్రాచీన భారతంలోని రుషులందరూ శాస్త్రవేత్తలేనని సెలవిచ్చాడు. పురాణగాథల్లోని పుణ్యపురుషులంతా నేటి ఆధునిక శాస్త్రవేత్తలకు ఆదర్శప్రాయులనీ, వారి వలె వీరు కూడా శాంతి స్వభావులై ఉండాలని, పనులన్నీ ఎంతో సహనంతో చేస్తూ ఉండాలని చెప్పాడు. రుషులు శాస్త్రవేత్తలేనని తను చెప్పిన విషయాన్ని వివాదాస్పదం చేయవద్దని కూడా చెప్పాడు. ముని అయిన దధీచి, ఇంద్రుడికి వజ్రాయుధాన్ని ఎలా ఇచ్చాడూ? ఆయన స్వయంగా తయారు చేశాడు గనకనే కదా, ఇవ్వగలిగాడూ? అంటే ఆయన శాస్త్రవేత్తే కదా? అన్న వివరణ కూడా ఇచ్చాడు మంత్రి- వీటన్నిటికీ పరాకాష్ట ఏమిటంటే- రాందేవ్ బాబా పతంజలి యోగ పీఠానికున్న స్థాయి డి.ఆర్.డి.వో సాధించాలని కూడా ఆయన చెప్పాడు! స్వాతంత్య్రపోరాటంలో పాల్గొనని దేశ భక్తులు, దేశాన్ని ఏ స్థాయికి తెచ్చారన్నది ప్రతి భారతీయుడూ ఆలోచించాల్సిన విషయం! లేకపోతే- ఒక కేంద్ర మంత్రికి రుషిక శాస్త్రవేత్తకు తేడా తెలియకపోవడం, యోగ పీఠానికీ రక్షణ పరిశోధనా సంస్థకూ ఉన్న తేడా తెలుసుకోక పోవడం విచారకరం కాదు, విషాదకరం!!
దేశ పాలకుల ఆలోచనా సరళి ఈ విధంగా ఉన్నప్పుడు అది అన్ని శాఖల్లో, అన్ని మూలలకూ వ్యాపిస్తుంది. ఉదాహరణకు దేశంలోని వివిధా రాష్ట్రాల్లో పాఠశాల పాఠ్య పుస్తకాల్లో ఉన్న అసంబద్ధమైన అంశాలు, అసత్యాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం! పదమూడు, పదిహేను సంవత్సరాల మధ్య వయసున్న బాలబాలికలకు తప్పుడు సమాచారంతో పాఠాలు చెప్పడమంటే, వారిని తప్పుడు వ్యక్తులుగా తయారు చేయడమే కదా? 1. చారిత్రాత్మకంగా ముఖ్యమైన సంవత్సరాల్ని తప్పుగా ముద్రించారు. 2. గాంధీని గాండిగా రాశారు 3. ఓడలు వెళ్లడానికి ఏర్పరిచిన సూయజ్ కాలువను సీవేజ్ కాలువగా ఇంగ్లీషు పాఠ్యపుస్తకంలో అచ్చేశారు. ఇలాంటి తప్పుల్ని ఎవరైనా ఏ విధంగా సమర్థిస్తారూ? వార్తా ఛానల్ వాళ్లు వెళ్లి సంబంధిత అధికారుల్ని ప్రశ్నించినపుడు గాంధీజీ హత్య చేయబడ్డ సమయం తేదీ అన్నీ తప్పుగా అచ్చయ్యాయనీ, సవరించాల్సి ఉందని ఒప్పుకున్నారు. గుజరాత్‌లో డెబ్బయి వేల మంది విద్యార్థులు చదువుకునే సామాన్య శాస్త్ర పాఠ్యపుస్తకంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో జపాన్ అమెరికాపై అణు యుద్ధం ప్రకటించిందని ఉంది. వక్రీకరించిన చారిత్రికాంశాలు చదువుకుని భావి భారత పౌరులు ఎలా తయారవుతారూ?
స్త్రీల గౌరవాన్ని దిగజార్చే అంశాలు పాఠ్యపుస్తకాల్లో చేర్చడం వల్ల భవిష్యత్తులో మహిళల పరిస్థితి ఏమిటీ? మన సమాజం ముందుకు వెళుతుందా? లేక వెనక్కి వెళుతూ ఉందా? దేశపౌరులుగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇది! రాజస్థాన్‌లో బోధిస్తున్న ఒక పాఠ్య పుస్తకంలో స్త్రీలకూ గాడిదలకూ పోలిక చూపారు.
ఉదయం నుండి రాత్రి దాకా స్త్రీలు గాడిదల్లా చాకిరి చేయాల్సి ఉంటుందని హిందీ పాఠ్య పుస్తకంలో సెలవిచ్చారు. గాడిదలకు చెట్టుకింద కాసేపు విశ్రాంతి నివ్వొచ్చుకానీ, స్త్రీలకు విశ్రాంతి నివ్వకూడదు. పాపం ! గాడిదలు పారిపోయినా మళ్లీ వెంటనే దొరుకుతాయి. స్త్రీల వలె పుట్టింటికి పారిపోయే వెసులు బాటు/సౌకర్యం వాటికి లేదు కదా? అని ఆపాఠం రాసిన రచయిత వ్యంగంగా వ్యాఖ్యానించాడు. దాన్ని కింది స్థాయి నుండి పైస్థాయి దాకా అధికారులు ఆమోదించారు. కాస్త ఇంగిత జ్ఞానం ఉన్న ఉపాధ్యాయుడెవరైనా ఉంటే- అతను ఇలాంటి పాఠం ఎలా చెప్పగలడు? మనసు చంపుకుని పాఠం చెప్పడమంత శిక్ష మరొకటి ఉండదుకదా? ఒక పత్రికా విలేకరి సంబంధిత ఉన్నతాధికారిని అడిగితే- ”ఏదో పిల్లలకు కాస్త సరదాగా ఉండడానికి అలా పెట్టి ఉంటారు లెండి!- అదో పెద్ద విషయమా?” అని ఎదురు ప్రశ్నించి తేలగొట్టేశాడు. ”భార్యలు గాడిదల్లాంటి వారు” అన్న పోలికలో అతనికి ఏ తప్పు కనిపించలేదు. ఆ నైతికంగా భార్యను వదిలేసిన వాడే అయి ఉంటాడు – ఆ ఉన్నతాధికారి ! మరి అలాంటి వాడే దేశ భవితవ్యాన్ని మంట గలుపుతున్నప్పుడు -ఇక పిల్లల పాఠాల్లో ఇలాంటివి కాక, మరిక ఎలాంటివి ఉంటారు?
మధ్య భారతంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో హైస్కూలు విద్యార్థులు చదువుకునే పాఠ్యపుస్తకంలో- ”దేశంలో నిరుద్యోగ సమస్యకు మూల కారణం : మహిళలు”. అని ఉంది. దీనికి వివరణ ఏమంటే, మహిళలు అన్ని రంగాలలో విజృంభించడం వల్ల, అన్ని రకాల ఉద్యోగాల్లో చేరుతూ ఉండడం వల్ల, పోటీ ఎక్కువైంది.. అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. ఫలితంగానే నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది – అని నిర్దారించారు. ప్రభుత్వం వారు స్త్రీ, పురుషులందరూ పౌరులయినప్పుడు, పౌరులకు సమాన హక్కులున్నప్పుడు- అందుకు తగిన విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఉద్యోగావకాశాలు కల్పించాలి. అంతేగాని, మహిళలు చదువుకుని ఉద్యోగాలకు ఎగ బడడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందనడం అర్థరహితంగా, అసంబద్ధంగా లేదూ? స్త్రీలను గాడిదలని, వారి వల్లే ఉద్యోగాలు లేకుండా పోయాయని.. మాంసా హారులంతా నీతిమాలిన వారని చెపుతూ ఏ సమాజాన్ని నిర్మించాలని ప్రభుత్వం కలలు కంటూ ఉంది? ఈ ప్రభుత్వాన్ని ఇలాగే వదిలేస్తే రేప్పొద్దున మనుస్మృతిలోని సతీసహగమనాన్ని మళ్లీ ప్రవేశపెడతారేమో? చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం!
సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) పాఠపుస్తకంలో పది, పదకొండేండ్ల వయసు పిల్లలు చదువుకునే పుస్తకంలో మాంసాహారుల వల్ల సమాజంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఉంది. మాంసాహారం తీసుకునేవారు అవలీలగా అబద్దాలు చెపుతారనీ, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోరని, అల్లర్లూ, అలజడులు సృష్టిస్తారనీ- ముఖ్యంగా లైంగికదాడులకు పాల్పడుతారనీ, వారికి నిజాయితీ నిబద్ధతా ఉండవని, ఊరికే ఆవేశపడి బూతులు మాట్లాడుతారని.. ఉంది! ఇలా దోషాలన్నీ మాంసాహారులకు అంటగట్టి, పసి మనసుల్ని కలుషితం చేయడం ఏమి సబబూ? ఏ ఆహారం తీసుకుంటే ఏయేలాభాలున్నాయి? ఎందులో ఏ నష్టాలున్నాయి – అనేవి వారికి శాస్త్రీయంగా వివరిం చాలి. అంతే! ఆహారం ఎంచుకునే స్వేచ్ఛ పిల్లల కివ్వాలి. అంతే గాని- నైతికంగా దిగజారిన వారి లక్షణాలన్నీ గుదిగుచ్చి మాంసాహరులకు ఆపాదిస్తే అవన్నీ నిజమైపోవు కదా?
ఒక రకంగా చూస్తే, మాంసాహారులు, శాఖాహారులు ప్రపంచంలో సమానంగా ఉండి ఉంటారు. లేదా కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో మాంసాహారుల సంఖ్యే ఎక్కువగా ఉండి ఉంటుంది. ఏమైనా, శాఖాహారులంతా సచ్ఛలురు. సత్యవ్రతులు, సత్ప్రవర్తన గల మహనీయులు కాదుగదా ? ఈ విషయమే డైరెక్టర్‌ను అడిగితే- పాఠ్యాంశాలపై దేశంలో నియంత్రణ లేదని, ఒక్కో ప్రాంతంలో ఒక్క భాషలో విషయాలు ఒక్కోరకంగా ఉన్నాయనీ – ఒప్పుకున్నాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బయి ఎనిమిదేండ్లయినా బాల బాలికలకు చెప్పాల్సిన అంశాలపై ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడం ఒక ఘోరం! ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంశాలు, వక్రీకరణలు మారుతూ ఉండడం మరో ఘోరం!! ఆరోగ్యకరమైన మార్పులు చేస్తే ఆహ్వానించవచ్చు.. కానీ, ఇక్కడ పిల్లల్ని నైతికత లేని వారిగా, బుద్ధిహీనులుగా తయారు చేసే కుట్ర జరుగుతూ ఉంది. ఈ దేశ పౌరులు ఆందోళన చెంది, కార్యాచరణకు పూనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది!
మహిళా శిశు సంక్షేమ శాఖా మాజీ మంత్రి శ్రీమతి మేనకా గాంధీ – ”దౌర్జన్యాలన్నీ పురుషులవే” నని ఘంటాపథంగా సెలవిచ్చారు. అధికారం రాగానే ఇంగితం లేకుండా, లాజిక్ లేకుండా ఏదైనా మాట్లాడవచ్చా ?- అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయమై మంత్రి జాతికి క్షమాపణ చెప్పాల్సిందేన ఐఎఫ్‌ఎఫ్(సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్) డిమాండ్ చేసింది. నేరప్రవృత్తిగల మహిళలందరినీ ఆమె కాపాడుతున్నారనీ, పురుషుల హక్కుల్ని కాలరాస్తున్నారని ఫెడరేషన్ ధ్వజమెత్తింది. మంత్రికి చేతనైతే అలాంటి ఆత్మహత్యలు జరగకుండా చూడాలని ఫెడరేషన్ సూచించింది. హింసకు లింగ భేదం ఉండదని కూడా చెప్పింది. ప్రభుత్వ పాలనలో ఎక్కడ ఏలోపమున్నా ప్రశ్నించడం ఈ దేశపౌరుల హక్కు. రాజ్యాంగాన్ని మార్చి, మనుస్మృతిని తేవాలని, దేశాన్ని హిందూ రాష్ట్రగా మార్చాలని, గాంధీ స్థానంలో సావర్కర్‌ను జాతిపిత చేయాలని కుట్రలు పన్నుతున్న ఈ ఆరెస్సెస్-బీజేపీ ప్రభుత్వ విధానాల్ని దేశప్రజలు క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు. ఎక్కడిక్కడ ఎండగడుతూనే ఉన్నారు. తాజాగా ఓట్ చోరితో వారి బండారం పూర్తిగా బయటపడింది.
రుషి పుంగవులంతా వైజ్ఞానికులే అయితే వారు శతఘ్నులు, రాకెట్లు, హెలికాప్టర్లు ఎందుకు తయారు చేయలేకపోయారు? ఆ రోజుల్లో గ్రహాంతరయానం, ఇంటర్నెట్, సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు ఎందుకు లేవూ? సైంటిస్టులు రుషుల్లా కండ్లుమూసుకుని కూర్చుంటే దేశరక్షణ జరుగుతుందా? జనాభాలో సగభాగమైన మహిళల్ని హీనంగా చూపిస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని ఎలా రూపొందించగలరూ? ఆలోచనా సామర్ధ్యం గల నాయకుల్ని ఎన్నుకుని ఉంటే, దేశంలో పరిస్థితులు కొంత భిన్నంగా ఉండేవి. బయట సమాజంలో నిత్యం చూస్తూనే ఉన్నాం. మైనార్టీల మీద, ముఖ్యంగా ముస్లింల మీద ద్వేష భావాన్ని పెంచుతున్నారు. ఇక్కడ పాఠ్యపుస్తకాల్లో మహిళల్ని టార్గెట్ చేశారు. అన్ని రంగాల్లో దేశ పరిస్థితి దిగదుడుపుగా ఉంది. మేధావుల సూచనలు కంఠశోషగా మిగిలిపోతున్నాయి. డబుల్ ఇంజన్ల బుల్ డోజర్ నడుస్తుంటే సామాన్యుడు నలిగి పోతున్నాడు. ఏ మతమూ, ఏ భక్తి, ఏ దేవుడూ, ఏ ఆధ్యాత్మికత ఇంత తిండి పెట్టలేదు. ఏదో పని కల్పించి ఇంత జీవనాధారం చూపలేదు. ఈ దేశ పౌరులు ఇప్ప టికైనా వాస్తవాలు అర్థం చేసుకుని, చదువూ, వివేచనా గల యువ ప్రజానాయకుల్ని తమ నుంచి తామే తయారు చేసుకుంటూ ఉండాలి. అందమైన అబద్దాలు ఎదురు పడతాయి. మీద పడతారు!! వాటిని తోసేస్తూ, ధైర్యంగా నిజాల్ని అన్వేషిస్తూ ముందుకు కదిలేవాడే ధీరోదాత్తుడు! మనకు ఇప్పుడు అలాంటి ధీరోదాత్తులు కావాలి! వాళ్లు ఎక్కడినుండో ఊడిపడరు. మననుండి మనమే తయారు చేసుకోవాలి!
విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత.
డాక్టర్ దేవరాజు మహారాజు