నవతెలంగాణ – హైదరాబాద్: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసే నేరగాళ్ల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. విద్యావంతులైనప్పటికీ, నిరుద్యోగుల ఆశలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన యువకుడి నుంచి సైబర్ నేరగాళ్లు విడతల వారీగా రూ.2 లక్షలు కాజేశారు.
‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సైబర్ నేరగాళ్లు ప్రకటన పెట్టారు. కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే ఉద్యోగంతో పాటు లాభాలు కూడా వస్తాయని నమ్మబలికారు. దీంతో ఆకర్షితుడైన యువకుడు మోసగాళ్ల మాటలు నమ్మి, విడతల వారీగా రూ.2 లక్షలు చెల్లించాడు. చివరికి మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనతో విషయం వెలుగులోకి వచ్చింది.