తెలుగు రాష్ట్రాలపై టాటా ఎఐజి దృష్టి
సైబర్ ఎడ్జ్ పాలసీ ఆవిష్కరణ
హైదరాబాద్ : దేశంలోని పలు సంస్థలు, స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఇలను పెరుగుతున్న సైబర్ దాడులు, డేటా ఉల్లంఘనల ముప్పు నుంచి రక్షించడానికి ప్రత్యేకంగా సమగ్ర సైబర్ బీమా పరిష్కారమైన ‘సైబర్ ఎడ్జ్’ను ప్రారంభించినట్లు ప్రముఖ సాధారణ బీమా సంస్థలలో ఒకటైన టాటా ఎఐజి జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లో ఆ సంస్థ ఫైనాన్సీయల్ లైన్స్ నేషనల్ హెడ్ నజ్మ్ బిల్గ్రామి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే మూడు సంవత్సరాలలో రెండు రెట్ల వ్యాపార వృద్ధిని అంచనా వేస్తున్నామన్నారు. తమ మొత్తం సైబర్ బీమా పోర్ట్‌ఫోలియోలో రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 25 శాతం వాటాను చేరొచ్చని అన్నారు.
హైదరాబాద్, వైజాగ్, విజయవాడలోని ఐటి పారిశ్రామిక క్లస్టర్‌లలో పెరుగుతున్న సైబర్ సంసిద్ధత తమ వ్యాపారానికి మద్దతును ఇవ్వనుందన్నారు. సైబర్ నేరాలలో ఆంధ్రప్రదేశ్. తెలంగాణ కలిపి భారతదేశంలో రెండవ స్థానంలో ఉన్నాయన్నారు. గత 2024లో రెండు రాష్ట్రాలు 62 లక్షలకు పైగా మాల్వేర్ గుర్తింపులు, 17,500 రాన్సమ్‌వేర్ సంఘటనలను చవి చూశాయన్నారు. ముఖ్యంగా ఫార్మా, ఐటి, ఫైనాన్సీయల్, తయారీ రంగాలు ఎక్కువగా సైబర్‌దాడులకు గురైతున్నాయన్నారు. గతేడాది దేశ వ్యాప్తంగా 400 పైగా సైబర్ పాలసీలను విక్రయించామన్నారు. ఈ పరిశ్రమ మార్కెట్ సైజ్ రూ.900 కోట్లుగా ఉందని.. అందులో తమకు 18 శాతం మార్కెట్ వాటా ఉందని.. దీన్ని 25 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.



