నవతెలంగాణ-హైదరాబాద్: దిత్వా తుపాను శ్రీలంకపై విరుచుకుపడుతోంది. తుపాను ప్రభావంతో ఇప్పటివరకు సుమారు 334మంది మరణించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మరో 370మంది గల్లంతయ్యారని అన్నారు. బదుల్లా, నువారా, ఎలియా మరియు మటలే జిల్లాల్లో ఆదివారం అధిక సంఖ్యలో మరణాలు నమోదయ్యాయని అన్నారు. కొండచరియలు విరిగిపడటంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారని అన్నారు.
సుమారు 11లక్షలకు పైగా ప్రజలు తుపానుతో తీవ్రంగా ప్రభావితమయ్యారని, సుమారు 2 లక్షలమంది నిరాశ్రయులయ్యారని విపత్తు నిర్వహణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. దిత్వా తుఫాను కారణంగా శ్రీలంకలోని అనేక జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని, పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని వెల్లడించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిషేధిత జోన్‌లో చిక్కుకున్న ప్రయాణికులను తరలించేందుకు తమ హెలికాప్టర్లు శ్రీలంక అధికారులతో కలిసి హైబ్రిడ్ రెస్క్యూ మిషన్ చేపట్టాయని భారత వైమానిక దళం తెలిపింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకె తెలిపారు.



