నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ తీవ్ర రూపం దాల్చి ఏపీని అతలాకుతలం చేసింది. రాత్రి 12. 30 గంటల సమయంలో ఈ తుపాను మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో అర్ధరాత్రి 12.30 తర్వాత తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ‘మొంథా’ తుపాను ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణిస్తుంది. బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ వద్ద మరింత బలహీన పడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గంటకు 85 కి.మీ నుంచి 95 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాను కారణంగా రాగల 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇందులో భాగంగా.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో భద్రాద్రి, ఖమ్మం, ములుగు, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. అలాగే హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.



