నవతెలంగాణ-హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు చెప్పారు. డీఏ ఫైలుపై సంతకం చేసి వచ్చాను. ఈరోజో, రేపో దీనికి సంబంధించిన జీవో అధికారికంగా వెలువడుతుంది” అని ప్రకటించారు. అంతేకాకుండా, ప్రతి ఉద్యోగికి రూ. కోటి రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నామని, పదవీ విరమణ పొందే వారికి ఇచ్చే బెనిఫిట్స్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అమలు చేసే అసలైన సారథులు ఉద్యోగులేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సోమవారం సచివాలయంలో జరిగిన ఉద్యోగ సంఘాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా..
ఉద్యోగ సంఘాల చిరకాల వాంఛ అయిన అసోసియేషన్ భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. “భవన నిర్మాణం కోసం అసోసియేషన్ ఎంత నిధులు సమకూర్చుకుంటే, ప్రభుత్వం కూడా అంత మొత్తాన్ని గ్రాంట్‌గా ఇస్తుంది” అని వెల్లడించారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించడానికి త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.



