మంత్రి పొన్నం వ్యాఖ్యల పట్ల అభ్యంతరం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. లక్ష్మణ్‌కు జరిగిన అవమానంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల శామ్యూల్, లక్ష్మీకాంతరావు, కాలే యాదయ్య తదితరులు మంగళవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సమావేశమయ్యారు. అడ్లూరి లక్ష్మణ్‌కు పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే మంత్రి పొన్నం, అడ్లూరి లక్ష్మణ్‌తో తాను మాట్లాడినట్టు ఈ సందర్భంగా మహేశ్ ఎమ్మెల్యేలకు వివరించారు. ఆ సమస్య పరిష్కారమైందని తెలిపారు.
అడ్లూరి వ్యాఖ్యలపై స్పందించను : మంత్రి పొన్నం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై తాను స్పందించబోనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ‘పీసీసీ అధ్యక్షులు నాతో మాట్లాడారు. అదే ఫైనల్. రహ్మత్‌నగర్ భేటీలో ఏం జరిగిందో ఆయనకు వివరించా. అడ్లూరి వ్యాఖ్యలపై నేను స్పందించను. పార్టీ పరంగా మాకు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలు శిరోధార్యం’ అని చెప్పారు.
జరిగే పరిణామాలకు పొన్నందే బాధ్యత : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
తాను మాదిగ సామాజిక తరగతికి చెందిన వ్యక్తి కావడం వల్లే తనకు మంత్రి పదవి వచ్చిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చెప్పారు. తాను మంత్రి కావడం, తమ సామాజికవర్గంలో పుట్టడం తప్పా? అని ప్రశ్నించారు. ‘పొన్నం మాదిరిగా అహంకారంగా మాట్లాడటం నాకు రాదు. ఆయన తన తప్పు తెలుసుకుంటారని అనుకున్నా. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనదే బాధ్యత. త్వరలో సోనియా, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్‌ను కలుస్తా’ అని చెప్పారు.