‘చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి’.. అంటాడు ఆత్రేయ. అది జీవితమయినా, ప్రకృతయినా, సమాజమయినా రెండు వ్యతిరేక శక్తుల మేళవింపులోనే పయనముంటది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకటి లేకపోతే ఇంకొక దానికి ఉనికే ఉండదు. రెండూ ఉంటాయి. రెండింటి మధ్య నిరంతరం ఘర్షణా ఉంటుంది. అదెప్పుడూ ముందుకు పోవటానికే జరుగుతుంటుంది. ఇవి సూత్రాలు. వీటినలా ఉంచితే, వెలుగును విజయానికి, అభివృద్ధికి, శుభానికి సంకేతంగా చూస్తాము. చీకటిని కష్టానికి, నష్టానికి, అశుభానికి గుర్తుగా భావిస్తాము. ఇవన్నీ మన మానసికమైన విభజన భావనలే.మన కష్టానికి, అశుభాలకు, విజయాలకు, ఆనందాలకు వాటికీ ఏ సంబంధమూ లేదు. మానవుడు భాష, భావాలు అభివృద్ధి చేసుకున్నాక, వాటిని సంకేతంగా వ్యక్తీకరించడం నేర్చుకున్నాడు. వర్ణాలను, కాలాలను, ప్రకృతిని అన్నింటినీ తన భావ నిర్మాణంలోకి తెచ్చుకున్నాడు. అది మానవుడికే సాధ్యమైన పని. రూపకాలను, ఉపమానాలను, అన్ని భాషాలంకారాలనూ నూతన అనుభవంలోంచి వ్యాఖ్యానించి కవిత్వాన్ని కళల్ని నిర్మించుకున్నాడు.
జీవితం అర్థం కావటానికి ఉపయోగపడే సాధనాలివి. అయితే ఇప్పటికైనా మనం సరిగా అర్థం చేసుకున్నామా! ఏమో! అయితే దీపాల కాంతికి అమితమైన విలువ తెచ్చేది అమావాస్య చీకటే. దీపావళి ఒక అందమైన అలంకరణ. అలంకారం. అసలు చీకటి లేకపోతే వెలుగుకు విలువేముంది. కష్టం, కన్నీళ్ల తర్వాత పొందే సంతోష ఆనందాల తీవ్రత మరింత పెరుగుతుంది కదా! ఎప్పుడైనా పోరాటం చేసి సాధించిన ఫలితమే మహా సంతృప్తిని స్తుంది. అందుకే చెడుపై మంచి గెలుపునే పండుగ అంటాము. దీపాలు వెలిగించి వెలుగు నిండిందని సంబర పడిపోతాం. కానీ జీవితాలలో వెలుగులు నిండటానికి వెలగించాల్సినవి ఇంకా ఏవో ఉంటూనే ఉన్నాయి. సరిగా పరిశీలించాలి గానీ, వెలుగుల్లో చీకట్ల మొలకలున్నట్లే, చీకట్లలోనూ వెలుగు రేఖలు అస్పష్టంగా మెరుస్తుంటాయి. వెలుగు చీకట్లను మనమెలా ఆపాదించుకున్నా కష్ట సుఖాలలో, కష్టం లోంచే విలువైన అవసరమైన అనుభవాన్ని, జ్ఞానాన్ని పొందగలుగుతాము. గెలుపోటములు కూడా పాక్షికమైనవే. అందుకే కవులు కూడా చీకట్లను కూడా అద్భుతంగా వర్ణించారు.
దాశరథి తామసి పద్యంలో ‘ఇరులు కోకిలములై ఎచ్చోట కూయునో, అచ్చోట మధు మాసమవతరించు/ ఇరులు తుమ్మెదలుగా ఏవేళ పాడునో ఆ వేళల వసంతమందగించు! ఇరులే మయూరమై ఎట నాట్యమాడునో అటనే నవాషాడమా వహించు! ఇరులై ఉత్పలములై ఏనాడు పూచునో ఆరోజు కార్తీకమ్మాగమించు! ఇరులకన్న అందమెచట కానగరాదు, ఇరులె సౌఖ్యములకు దరులు సుమ్ము, ఇరులు లేని నాడు నరులు కానగరారు, నరులు లేనినాడు ధరణి లేదు’ అని తేల్చేశాడు. చిక్కని చీకటి నిండిన కురులే ముఖానికి అందాన్ని స్తాయని కవి వర్ణిస్తాడు. ఎవరెన్ని రకాలుగా చెప్పినా ఉదయాన్నీ వెలుగును కోరుకుంటాము. ఇక్కట్లను చీకట్లుగా భావిస్తాము. మన అడుగులు ఎటువైపు పడుతున్నాయనే దాన్ని బట్టి వెలుగులా చీకట్లా అనేది తెలుస్తుంది. యువత పెద్ద సంఖ్యలో ఉన్న మనదేశంలో రోజురోజుకూ నిరుద్యోగం పెరిగిపోతున్నది. ఉపాధి దొరక్క సామాన్యులు నానాయాతన పడుతున్నారు. ఉన్న ఉద్యోగాలూ ఊడిపోతున్నాయి. ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ట్రంపు కొత్తగా మనపై వడ్డించిన సుంకాల వల్ల ఇక్కడి అనేక పరిశ్రమలు దివాళా తీసే పరిస్థితి వచ్చింది.
వ్యవసాయ రంగమూ సంక్షోభంలోకి పోతోంది. ఉత్పత్తులు పెరిగినా జీవనం దుర్భరమవుతున్నది. శ్రామికుల హక్కులు హరించివేయబడు తున్నాయి. మహిళల పరిస్థితి, వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వివక్షతలు పెరుగుతున్నాయి. విద్వేషం కోరలు చాస్తున్నది. ప్రశ్నించడం, రాజ్యాంగం కల్పించిన హక్కులను అడగడమే నేరమైపోయింది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే బెదిరించి భౌతికదాడికి పాల్పడే సంఘటన ఆందోళన కలిగిస్తున్నది. ఆదాయాలు తగ్గి, ఉపాధి లేక అశేష సామాన్య జనం బతకడం కష్టమై, పెరుగుతున్న నిత్యావసర ధరలను చూసి బెంబేలెత్తుతున్న సన్నివేశంలో, దీపావళి శోభ జీవితాల్లోకి వచ్చినట్టుగా భావించగలుగుతామా! ప్రపంచంలో ఎటుచూసినా యుద్ధం, విధ్వంసాలు, హాహాకారాలు, కన్నీళ్లు కనబడుతుంటే వెలుగుల ఉత్సాహం మొలకేస్తుందా!అయినా కానీ, వీటన్నింటికి ప్రతిస్పందనగా గొంతుకలు లేస్తూనే ఉన్నాయి. ప్రతిఘటనకు అడుగులు పడుతూనే ఉన్నాయి. దాన్ని మనం ఆహ్వానించాలి. చీకటి వెలుగుల ఘర్షణ నిరంతరం సాగుతూనే ఉంటుంది.
చీకటి వెలుగు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES