తొంభై రోజుల్లో తొంభై ఒప్పందాలు ఏప్రిల్ రెండవ తేదీ అమెరికా విముక్తి దినం పేరుతో డోనాల్డ్ ట్రంప్ పలికిన ప్రగల్భాల్లో ఒకటి. ఆ గడువు జూలై 9వ తేదీతో ముగియనుంది. అనుకున్నది పగటికలగా మారింది. దాంతో తమతో ఒప్పందాలకు రాకపోతే అపరాధ సుంకాలు విధిస్తానని ఆగస్టు ఒకటి వరకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించాడు. బెదిరింపులో భాగంగా పద్నాలుగు దేశాలు ఎంతెంత సుంకాన్ని ఎదుర్కోవాల్సిందీ వెల్లడిస్తూ లేఖల రూపంలో ఆదేశాలను పంపాడు. ఒప్పందాలు కుదుర్చుకోవటం లేదా సిద్ధంగా ఉన్నట్లు తిరుగులేఖలు రాయకపోతే ఆగస్టు ఒకటవ తేదీ నుంచి తన సుంకాలు అమల్లోకి వస్తాయన్నాడు. చర్చలకు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయని కూడా చెప్పాడు. ‘మాటి మాటికి గడువు పొడిగిస్తా అనుకుంటున్నారేమో నూటికి నూరు శాతం గట్టిగా చెబుతున్నా, వారు గనుక తనకు ఫోన్ చేసి వేరే పద్ధతులను ఆలోచిస్తున్నట్లు చెబితే సరే, దానికి అవకాశం ఇస్తున్నా లేకపోతే ఏం చేస్తానో తెలుసుగా’ అన్నట్లుగా పొడిగించిన గడువుకు అయినా కట్టుబడి ఉంటారా లేదా అని అడిగిన విలేకర్లతో చెప్పాడు. ఏప్రిల్‌లో వివిధ దేశాల సరకులపై ఎంత మేరకు పన్ను విధించేది ప్రకటించిన ట్రంప్ ఏ దేశమూ ముందుకు రాక పోవటంతో మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు, జూలై 9వ తేదీతో గడువు ముగుస్తుందన్నాడు. అయినప్పటికీ స్పందన లేకపోవటంతో ఆగస్టు వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించాడు. ఆలోగా ఒప్పందానికి రాకుంటే ఏప్రిల్ రెండవ తేదీన ప్రకటించిన విధంగా పన్నులను విధిస్తామని వాణిజ్యశాఖ మంత్రి లుటినిక్ చెప్పాడు. మనదేశంతో ఎనిమిదో తేదీలోగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు లీకులు వదిలిన సంగతి తెలిసిందే. తాజా వార్తలను బట్టి ఆ గడువు ఆగస్టు ఒకటి వరకు పొడిగించినట్లు చెబుతున్నారు. నాటకీయంగా ఏదో కుదిరిందని మొక్కుబడి ప్రకటన చేస్తే చెప్పలేము.
రష్యాతో వాణిజ్యం చేస్తే భారత్, చైనాలపై 500శాతం పన్నులు విధిస్తానని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రిక్స్ సమావేశాల్లో అమెరికా బెదిరింపు వైఖరిని విమర్శించిన తర్వాత తమ వ్యతిరేక విధానాలను అనుసరించే బ్రిక్స్ దేశాలతో వాణిజ్యం జరిపే దేశాల మీద కూడా పదిశాతం పన్ను విధిస్తానని బెదిరింపులకు దిగాడు. ఏకపక్ష పన్ను ప్రకటనలు ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తాయని బ్రిక్స్ పేర్కొన్నది. వివిధ దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పన్ను శాతాలు గతంలో ప్రకటించినవి కొన్నింటిలో మార్పులేదు, మరికొన్నింటిని సవరించాడు. ఆయా దేశాల వస్తువులపై జపాన్ 25,దక్షిణ కొరియా 25, థారులాండ్ 36, మలేసియా 25, ఇండోనేషియా 32, దక్షిణాఫ్రికా 30,కంపూచియా 36, బంగ్లాదేశ్ 35,కజకస్తాన్ 25, ట్యునీసియా 25, సెర్బియా 35,లావోస్ 40, మయన్మార్ 40 శాతం పన్నులు ఉంటాయి. ఒక వేళ ఈ దేశాలు గనుక ప్రతి సుంకాలు పెంచినట్లయితే తాను ప్రకటించిన మొత్తాల మీద మరో అంత మొత్తం పెంచుతామని కూడా ట్రంప్ బెదిరించాడు. రానున్న రోజుల్లో మిగిలిన దేశాలకు కూడా ఎంత పన్ను విధిం చేదీ లేఖల రూపంలో తెలియచేస్తామని అధ్యక్ష భవన మీడియా అధికారిణి కారాలోని లీవిట్ చెప్పారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్ను మొత్తాలను పెంచితే ఆ భారం అమెరికా వినియోగదారుల మీదనే పడుతుందన్నది తెలిసిందే.ఆర్థికవేత్తలు చెప్పినదాని ప్రకారం ఒక్కో కుటుంబం మీద 3,800 నుంచి నాలుగువేల డాలర్ల వరకు భారం పడుతుందని, అది ఒకటి నుంచి ఒకటిన్నర శాతం వరకు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.
జపాన్ నుంచి కార్లు, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, దక్షిణ కొరియా నుంచి సెమీకండక్టర్లు, ఆటోవిడి భాగాలు, ఓడలు, మలేషియా నుంచి సెమికండక్టర్లు, రబ్బరు, బంగ్లాదేశ్ నుంచి దుస్తులు, పాదరక్షలు, కంపూచియా నుంచి తక్కువ వెలగల దుస్తులు, ఫర్నీచర్, ఇండోనేషియా ఓడల్లో ధరించే పాదరక్షలు, పామాయిల్, ఎలక్ట్రానిక్స్ అమెరికా దిగుమతి చేసుకుంటున్నది. దక్షిణాఫ్రికా లోహాలు, పండ్లు, ఆభరణాలు, తాజా వ్యవసాయ ఉత్పత్తులు, ఆటోవిడి భాగాలు, సెర్బియా యంత్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు లావోస్ పాదరక్షలు, కలప వస్తువులు, మయన్మార్ నుంచి చౌకగా లభించే ఉత్పత్తులు, బోస్నియా కలప, లోహాలు, కజకస్తాన్ లోహాలు, తైలాలు, రసాయనాలు, టునీసియా ఆలివ్ ఆయిల్ వంటి వాటిని కూడా దిగుమతుల్లో ఉన్నాయి. వాటి మీద ఎంత పన్ను విధిస్తే అంత మొత్తాన్ని వినియోగదారులు అదనంగా చెల్లించాలి, ఆమొత్తాలతో ట్రంప్ లోటు బడ్జెట్ పూడ్చుకొనేందుకు లేదా కార్పొరేట్లకు పన్ను రాయితీలిచ్చేందుకు వినియోగించాలన్నది అసలు ఎత్తుగడ. జూలై తొమ్మిదవ తేదీలోగా ఒప్పందాలు చేసుకోని దేశాలకు ఆగస్టు ఒకటవ తేదీ వరకు అవకాశం ఇస్తున్నామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చెప్పాడు. వచ్చే మూడు రోజులు తాము ఊపిరి సలపని పనిలో ఉంటామని ఆదివారం నాడు సిఎన్‌ఎస్ టీవితో అన్నాడు. ఆగస్టు ఒకటవ తేదీని కొత్తగడువుగా అభివర్ణించకూడదని, పనులు వేగంగా జరగాలంటే ఏదో ఒకటి ఉండాలన్నాడు. కొత్త పన్నులు కావాలా లేదా గతంలో ప్రకటించినవే కావాలా అన్నది లేఖలు అందుకున్న దేశాలు తేల్చుకోవాలని చెప్పాడు.తాము పద్దెనిమిది ప్రధాన వాణిజ్య భాగస్వాముల మీద కేంద్రీకరిస్తున్నామని అనేక పెద్ద ఒప్పందాలు పూర్తి కావచ్చాయన్నాడు. ఏ దేశ ఉత్పత్తులపై తామెంత పన్ను విధించేది వంద చిన్న దేశాలకు లేఖల ద్వారా తెలియచేస్తామని అన్నాడు. ఇది అమెరికా దురహంకారం తప్ప మరొకటి కాదు.పూర్వర పెద్ద దేశాల రాజులు చిన్న లేదా సామంత దేశాలు తమకు ఏటా ఇంత కప్పం కట్టాలని లేకపోతే తమ తడాఖా చూపుతామని బెదిరించేవారు. అయితే బెసెంట్ మాటలను బట్టి ఏదీ ఖరారు కాలేదన్నది స్పష్టం. అమెరి కాలో వాషింగ్టన్ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నానికల్లా తన లేఖలు సంబంధిత దేశాలకు అందుతాయని ఆదివారం నాడు ట్రంప్ చెప్పాడు. కొన్ని దేశాలు బుధవారం లోగా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు లేదా లేఖలు అందించే అవకాశం ఉందన్నాడు.
ట్రంప్ లేఖలు అంటే ఏకపక్షంగా జారీ చేసినవి, బెదిరించే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.చైనాతో ఒప్పందం కుదిరిందని ఏకపక్షంగా ట్రంప్ ప్రకటించటం తప్ప వివరాలేమిటో ఇంతవరకు తెలియదు. అదే విధంగా వియత్నాంతో వచ్చినట్లు చెబుతున్న అవగాహన కూడా అదే స్థితిలో ఉంది.అంశాలు ఇంకా ఖరారు కాలేదు.మనదేశంతో ఒప్పందం గురించి కూడా రకరకాల వార్తలను ప్రచారంలో పెట్టారు. అసలు ఒకసారి కుదిరిందని ట్రంప్ చెప్పాడు. అంతిమ ఒప్పందం అని, తర్వాత తాత్కాలిక ఒప్పందం, మరోసారి చిన్న ఒప్పందం ఇలా రకరకాలుగా వర్ణించారు. మధ్యలో అమెరికా వస్తువులపై పన్నులను తగ్గించేందుకు భారత్ అంగీకరించటం లేదని లీకులు వదిలారు.మంగళవారం నాడు ఇది రాసిన సమయానికి ఒప్పందం గురించి ఎలాంటి వార్తలు లేవు. రాజకీయంగా, మిలిటరీ, ఆర్థికంగా ఏ రీత్యా చూసినప్పటికీ జపాన్, దక్షిణ కొరియా ఇప్పటి వరకు అమెరికా కనుసన్నల్లోనే వ్యవహరించాయి. అలాంటి దేశాలపై 25శాతం పన్ను విధిస్తానని ఏకపక్షంగా ప్రకటించాడు ట్రంప్.అమలుకు ఆగస్టు ఒకటి వరకు గడువు ఉందన్నాడు. ఇప్పటి వరకు వివిధ దేశాల వైఖరుల సారాంశం దిగువ విధంగా ఉంది.
జపాన్‌లో కూడా ఆటోపరిశ్రమ పెద్దదే. తన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, ఏ పరిస్థితి ఎదురైనా ఎదుర్కొ నేందుకు, తట్టుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆదివారం నాడు ప్రధాని షిగెరు షిబా ఫూజీ టీవీ కార్యక్రమంలో ఆదివారం నాడు చెప్పాడు. అమెరికా వస్తువుల మీద దిగుమతి పన్ను తగ్గిస్తామని మనదేశం సంకేతాలిచ్చినప్పటికీ దానికంటే మన పాడి,వ్యవసాయ రంగాలను అమెరికా ఉత్పత్తులకు తెరవాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు వార్తలు.ఏం జరుగుతుందో తెలియదు.ఇరవై ఏడు దేశాలతో కూడిన ఐరోపా యూనియన్‌తో చర్చల్లో మంచి పురోగతి ఉందని అమెరికా చెప్పటం తప్ప అలాంటి సూచనలు కనిపించటం లేదు. సమాఖ్య దేశాల కార్లపై యాభై శాతం పన్ను విధిస్తానని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అసలుకే మోసం రాకుండా ఒప్పందం ఉందాలని జర్మనీ చెబుతుండగా హానికరమైన ఒప్పందానికి తాము వ్యతిరేకమని ఫ్రాన్సు పేర్కొన్నది. బ్రిటన్ను అదిరించి బెదిరించి ఒప్పందం కుదుర్చుకున్నారు.
పదిశాతం కనీస పన్నులు విధిస్తారు, దానికి ప్రతిగా అమెరికా కార్లు, విమానాలకు బ్రిటన్ తలుపులు తెరిచింది. తాము జూలై 21లో ఒప్పందం కుదుర్చుకుంటామని కెనడా చెప్పటంతో దానికి లేఖ పంపలేదు. ఎవరైనా ఇదే మాదిరి ఒప్పందానికి దగ్గరగా ఉంటే వాటికి వ్యవధిని పెంచుతామని ట్రంప్ సలహాదారు కెవిన్ హాసెట్ చెప్పాడు.
చైనాతో ఒప్పందం కుదిరిందని లండన్ భేటీ తర్వాత డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. దాని మీద చైనా అవుననిగానీ కాదని గానీ ప్రకటించలేదు. నువ్వెంత దిగివస్తే నేనంత తగ్గుతాను అన్నట్లుగా చైనా వ్యవహరిస్తున్నది.లాభం లేదని గ్రహించిన ట్రంప్ తొలుత ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నాడు.ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థలు చైనాకు ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్ అందించేందుకు, విమాన ఇంజన్ల ఎగుమతులకు అవకాశం కల్పించాడు. దానికి ప్రతిగా ఆంక్షలున్న ఎనిమిది వస్తువుల ఎగుమతులపై నిబంధనలను సడలించేందుకు చైనా చర్యలు తీసుకుంది. ఈ విధంగా ఇరుదేశాల వాణిజ్య యుద్ధ రాజీ ఒప్పందం ముందుకు పోతున్నదని రాయిటర్స్ పేర్కొన్నది.అమెరికా దిగిరావటానికి అక్కడి బహుళజాతి గుత్త సంస్థలు ట్రంప్ మీద తెస్తున్న ఒత్తిడే ప్రధాన కారణం. ఉదాహరణకు 2014లో ఇంటెల్ కంపెనీ మొత్తం రాబడిలో 27శాతం ఉంది. క్వాల్‌కామ్ ఆదాయంలో 50శాతం చైనా నుంచి ఉంది. దీనికి తోడు చైనా పారిశ్రామిక ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టటంతో ఆ ఉత్పత్తులున్న అమెరికన్ కంపెనీలకు అది పెద్ద మార్కెట్‌గా మారింది. ట్రంప్ రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత అమెరికా అనేక పాఠాలు నేర్చుకుంది. ఇతర దేశాల మాదిరి లేఖల ఆదేశాలు పంపి గరిష్టంగా ఒత్తిడితో అదిరించి బెదిరిస్తే లొంగే ఘటం కాదు అన్నది ఒకటి. కలసి ఉంటే కలదు సుఖం ఘర్షణ పడితే లాభం లేదని, పరస్పరం లాభదాయకమైన అంశాల్లో రాజీపడటమే మేలని గ్రహించటం రెండవది. కృత్రిమ గోడలు కట్టి సరఫరా వ్యవస్థలను విచ్చిన్నం చేస్తే అమెరికా పొందే లాభం లేదని, తన స్వంత చట్టాలతో ఇతర దేశాలను శిక్షించినట్లుగా చైనాతో వ్యవహరిస్తే కుదరదని గ్రహించటం వంటి అంశాలు ప్రభావతం చేశాయి.అయితే ఇంకా బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, నూతన ఇంథనం వంటి కొన్ని రంగాల్లో చైనాను కట్టడి చేసేందుకు అమెరికా చూస్తూనే ఉంది. చైనాలో పెట్టుబడులు పెట్టేవారి మీద పన్నులు విధిస్తున్నది. దానికి తగినట్లుగా చైనా కూడా తన తురుపు ముక్కలను వాడుతున్నది. ఐరోపా యూనియన్, ఇతర దేశాలు అమెరికా మాదిరి మడికట్టుకు కూర్చోవటం లేదు, అది ఆడమన్నట్లుగా ఆడకుండా చైనాతో తమ ప్రయోజనాలను బేరీజు వేసుకుంటున్నాయి. ఇది కూడా అమెరికా మీద ప్రభావం చూపుతున్నది.
ఎం కోటేశ్వరరావు 8331013288