Sunday, July 6, 2025
E-PAPER
Homeమానవిముందు జాగ్రత్త అవసరం ప్రియమైన వేణు గీతికకు…

ముందు జాగ్రత్త అవసరం ప్రియమైన వేణు గీతికకు…

- Advertisement -

ఎలా ఉన్నావు, నేను అంతకు ముందు రాసిన ఉత్తరం చదివి ఎవరికి ఇలా జరిగింది అని ఆడిగావు . ఉత్తరాలు చదివి నాతో చర్చిస్తున్నందుకు సంతోషం. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో, ఉంటున్నాయో తెలుసు కోవడం చాలా అవసరం నాన్న. ఈ లేఖ కూడా ముందు రాసిన వాటికి దాదాపు దగ్గరగానే ఉంటుంది. అయితే ఇది తెలిసి చేసే తప్పు అని అనొచ్చు. ఎందుకంటే తల్లితండ్రులకు పిల్లల మీద అపారమైన ప్రేమ, నమ్మకం ఉంటాయి. అలాగే తోబుట్టువులకు కూడా ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది. కానీ ఇవన్నీ పెళ్లి అయిన తర్వాత బాధ్యతల రీత్యా కొంచం తగ్చొచ్చు లేదా మార్పు రావొచ్చు.
అసలు విషయం ఏమిటంటే, మన బంధువుల్లోనే ఒకరు భర్తతో విడాకులు తీసుకుని, ముగ్గురు పిల్లలని భర్త దగ్గరే వదిలి, తల్లిదండ్రుల దగ్గర ఉండేది. ఆ బాధల నుండి బయట పడటానికి స్కూల్లో టీచరగా చేరింది. అతను ఇచ్చేది అతి తక్కువ జీతం. ఆధారంగా ఉండాలని తల్లిదండ్రులు ఓ ఫ్లాట్‌ ఆవిడ కోసం కొన్నారు. కొద్ది రోజులకు తోడబుట్టిన వాడు కూతురు పెండ్లి కోసం అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడానికి సోదరిగా ఈమె ఏమీ ఆలోచించకుండా ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేసింది. భవిష్యత్తులో ఎలాగో తను వాడి దగ్గరే కదా ఉండాల్సింది అనుకుంది. అయితే అమ్మిన తర్వాత ఎంత వచ్చిందో కూడా ఆమె తెలుసుకోలేదు. అంత నమ్మకం సోదరుడంటే.
సరే తల్లిదండ్రులు కాలం చేశాక సోదరుడి దగ్గరకు చేరింది. అక్కడ ఈమెకు సెట్‌ అవ్వలేదు. దాంతో తనకు రావల్సిన డబ్బు గురించి నన్ను అడగమంది. కానీ ఇది అసలు నేను తల దూర్చకూడని వ్యవహారం ఇది. అందుకే ఆమెనే అడగమని చెప్పాను. ఆమెనే ధైర్యం చేసి అడిగితే ‘నేను ఇవ్వను పో’ అన్నాడు. ఇప్పుడు ఇంట్లోంచి బైటకు వచ్చి హాస్టల్లో ఉంటోంది. స్కూల్లో జీతం చాలా తక్కువ ఇస్తారు. వృద్ధాప్యం వచ్చేసింది, ఆరోగ్యం పాడైపోయింది. వృద్ధాశమంలో చేరతానంది. తనకు తెలియని విషయం ఏమిటంటే వృద్ధాశ్రమల్లో రోగులను చేర్చుకోరు. అలాంటి సేవలు చేసే ఆశ్రమాలు ఉన్నాయి, కానీ డబ్బులు ధార పోస్తేనే చూస్తారు.
ఇంకొకరు ఉన్నారు, ఆవిడ తన ఆస్తిని ముందుగానే కొడుకులకు రాసి ఇచ్చేసింది. తర్వాత ఒక వృద్ధాశ్రమంలో చేరింది. ఆవిడకు అప్పుడు జ్ఞానోదయం అయింది. మేము వెళ్ళినప్పుడు ‘ముందుగా ఏవీ పిల్లలకు రాయవద్దు, ఏదైనా మీ తదనంతరమే ఇవ్వండి’ అని. నాన్న, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వయసులో ఉన్నప్పుడు కష్టపడ్డట్టు వృద్ధాప్యంలో కష్టపడలేరు. అందుకని సంపాదించేటప్పుడే కొంత దాచుకోవాలి. ఏదైనా ఉంటే తదనంతరం ఇవ్వాలి. ఈ మధ్య రోజులు అసలు బాగా లేవు. ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు నా దృష్టికి వస్తూనే ఉన్నాయి. అందుకే ఎంతో జాగ్రత్తపడాలి నాన్న. అందరికీ అలా జరుగుతుందని అనను. కేవలం జాగ్రత్తగా ఉండమని అంటున్నాను. ఇది కేవలం నీకు అవగాహన కోసమే నాన్న. వుంటాను
ప్రేమతో మీ అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -