19 మంది సజీవ దహనం.. బస్సు ఢీకొన్న బైకర్ మృతి
కర్నూలు జిల్లాలో ప్రయివేట్ స్లీపర్ బస్సు దగ్ధం
మృతుల్లో ఆరుగురు తెలంగాణ వాసులు
గాఢ నిద్రే శాశ్వత నిద్రగా మారింది. మంటలధాటికి మెలకువ వచ్చేసరికే ప్రాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. బెర్త్‌ల్లో పడుకున్న వారు పడుకున్నట్టే మాంసం ముద్దలు అయ్యారు. సీట్లలో కూర్చుని కునికిపాట్లు పడుతున్నవారు ఏం జరిగిందో తెలుసుకొనే లోపే మంటలు చుట్టుముట్టి ఆర్తనాదాలతో ప్రాణాలు వదిలారు. అక్కడి దృశ్యం హృదయవిదారకం. తల్లిని కౌగిలించుకొని పడుకున్న చిన్నారులు అలాగే మాంసం ముద్దలు అయ్యారు. పక్క బెర్త్‌పైనే ఉన్న భర్తను పిలిచే టైం కూడా మృత్యువు వారికి ఇవ్వలేదు. 19 మంది సజీవ దహనం అయ్యారు. వారిలో ఆరుగురు తెలంగాణకు చెందిన వారు. మరో ఆరుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. మిగిలిన ఏడుగురు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు.
అదే బస్సులో ఉన్న మరో 22 మంది తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కొందరు ఒంటికి అంటుకున్న మంటలతోనే బస్సులోంచి దూకేశారు. ఆర్తనాదాలు, హాహాకారాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. అదేరోడ్డుపై వెళ్తున్న కొందరు క్షతగాత్రుల్ని తమ వాహనాల్లో వెంటనే ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మరికొందరు పోలీసులు, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. వారొచ్చేసరికే నష్టం జరిగిపోయింది. మృత్యువు నుంచి తృటిలో బయటపడిన ప్రయాణీకులు షాక్ నుంచి బయటపడలేదు. కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ హఠాత్పరిణామానికి రెండు తెలుగురాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.
కర్నూలు : హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రయివేటు ఏసీ స్లీపర్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. మిగిలిన వారు అతికష్టం మీద బస్సు అద్దాలను పగలకొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఓ బైక్‌ను బస్సు ఓవర్‌టేక్ చేయబోయి ఢకొీనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఆ సమయంలో బైక్ బస్సుకిందకు దూసుకుపోయి ఇరుక్కుపోగా, దాని నుండి చెలరేగిన మంటలు బస్సుకు అంటుకున్నాయి. ఇంత జరిగినా బస్సు ఆగకపోవడం, విపరీతమైన వేగంతో ముందుకు దూసుకుపోవడంతో మంటలు క్షణాల్లోనే బస్సును దగ్ధం చేశాయి.
వెనుకవైపు ఎమర్జన్సీడోర్‌లు తెరుచుకోకపోవడం, పగలకొట్టడానికి వీలేలేనంత గట్టిగా బస్సు అద్దాలు ఉండటం, పగలకొట్టడానికి అవసరమైన పరికరాలు అందుబాటులో లేకోవడంతో పాటు, ముందువైపు తలుపు కూడా తెరుచుకోకపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. అతికష్టం మీద అద్దాలు పగలకొట్టుకుని కొందరు బయటకు దూకేశారు. బస్సులో నుంచి బయటకు రాలేని 19 మంది బస్సులోనే సజీవ దహనమయ్యారు. మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారి గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. బైక్‌పై కర్నూలు నుంచి డోన్ వైపు వెళ్తున్న కర్నూలు ప్రజానగర్‌కు చెందిన శివశంకర్ (21) ఎగిరి రోడ్డు పక్కన పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ బైక్ బస్సు కింద ఇరుక్కుపోగా బస్సు 300 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌లో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే బస్సు దాదాపుగా కాలి బూడిదైంది. క్షతగాత్రుల్లో 12 మందిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు.
బస్సులో ఎందరు..?
ప్రమాద సమయంలో బస్సులో 39 మంది పెద్దలతో పాటు నలుగురు చిన్నారులు ఉన్నారు. వారిలో 23 మంది పెద్దలు, ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. మరణించిన వారిలో 17 మంది పెద్దలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బస్సులో కాలిబూడిదైన వారిలో ఏపీకి చెందిన ఆరుగురు, తెలంగాణకు చెందిన ఆరుగురు, కర్ణాటకకు చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన ఇద్దరు, బీహర్, ఒడిశాకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. మృతుల్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారు.
మృతదేహాలు కాలి గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ప్రమాద స్థలాన్ని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, హోం మంత్రి వంగలపూడి అనిత్స, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్య చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రులు వైద్యులను ఆదేశించారు. ఈ ఘటనపై ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక డ్రైవర్ శివ నారాయణను అరెస్టు చేశారు. మరో డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్య పరారీలో ఉన్నారు.
మృతుల్లో తల్లీకూతుళ్లు
బస్సు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా శివాయిపల్లికి చెందిన తల్లి కూతురు సంధ్యారాణి (43), చందన (23) అక్కడికక్కడే మరణించారు. శివాయిపల్లికి చెందిన అనంద్‌గౌడ్ మస్కట్‌లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డాడు. భార్య సుధారాణితో కలిసి అప్పుడప్పుడు ఇండియాకు వచ్చిపోతుంటారు. కూతురు చందన బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. కొడుకు వల్లభగౌడ్ అలహబాద్‌లో చదువుతున్నాడు. దీపావళి పండుగకు కుటుంబంతో కలిసి శివాయిపల్లికి వచ్చారు. రెండు రోజుల క్రితమే వల్లభగౌడ్, ఆనంద్‌గౌడ్ తిరుగు ప్రయాణమయ్యారు. కూతురును బెంగళూరులో విడిచి పెట్టి తల్లి సంధ్యారాణి దుబ్బాయి వెళ్లాలనుకుంది. గురువారం కావేరి ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదంలో వీరు కాలి బూడిదయ్యారు.
మిగతా మృతులు వీరే..
నల్గొండ జిల్లా గుండాల మండలం వస్తాకొండూరు గ్రామానికి చెందిన మహేశ్వరం శ్రీనివాసరెడ్డి కుమార్తె అనూషరెడ్డి (22) బెంగళూరులోని ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. దీపావళికి ఇంటికి వచ్చి బెంగళూరుకి తిరుగు ప్రయాణమైంది. ఖైరతాబాద్‌లో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కింది. ఈ ప్రమాదంలో మృతి చెందింది. హైదరాబాద్‌కు చెందిన గిరిరావు (48), తెలంగాణకు చెందిన మేఘనాథ్(25)తో పాటు మృతుల్లో కోనసీమ జిల్లా కొవ్వూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి, బాపట్లకు చెందిన జి ధాత్రి, అర్ఘా బందోపాధ్యాయ (23),కర్నాటకకు చెందిన ఫిలోమెన్ బేబీ (64), కిషోర్ కుమార్ (41), తమిళనాడుకు చెందిన ప్రశాంత్ (32), యువన్ శంకర్ రాజ్ (22), బీహార్‌కు చెందిన (18), ఒడిశాకు చెందిన కె దీపక్ కుమార్ (24) ఉన్నారు.
బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
కర్నూల్ జిల్లా బస్సు ప్రమాదంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డితో శుక్రవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్షణమే ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వెంటనే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు జెన్‌కో సీఎండీ హరీష్‌ను వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలనీ, బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు. మరణించిన వారి గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
చాలా బాధాకరం : రాష్ట్రపతి ముర్ము
బస్సు అగ్ని ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోపోవడం అత్యంత బాధాకరమైన విషయం. మృతుల కుటుంబ సభ్యులకు నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి.
వారికి అండగా ఉంటాం : ప్రధాని మోడీ
బస్సు ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి.
భద్రత ఏదీ ?
మృతుల కుటుంబాలకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ సంతాపం
బస్సు అగ్ని ప్రమాదం గురించి విని చాలా బాధపడ్డాను. ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలు పదేపదే జరుగుతున్నందున బలమైన భద్రతా నిబంధనలను, కఠినమైన జవాబుదారీతనాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.



