– వ్యవసాయం భారమవుతుందంటున్న అన్నదాతలు
– కాడికి దూరమమై తనువు చాలిస్తున్న రైతులు
– ఆత్మహత్యలవైపు అన్నదాతలు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
వ్యవసాయంలో కార్పొరేట్ల పాత్ర పెరగడంతో ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న చిన్న సన్నకారుల పరిస్థితి దయనీయంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతులు దిక్కుతోచని పరిస్థితికి నెట్టవేయబడుతున్నారు. పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని రైతు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. చేసిన అప్పులు తీర్చలేక కాడి పడేసి తనువు చాలిస్తున్న నెలకొంది. ‘వేసిన పంట ఆశించిన స్థాయిలో లేదు. దిగుబడి రాక అప్పుల బారం నుండి గట్టేక్కే స్థితి కనబడటం లేదు. అధిక పెట్టుబడులు, ప్రభుత్వ ఆర్థిక సాయం అందడం లేదు. అప్పుల పాలయ్యాం. అప్పులు తీర్చే మార్గం కనిపించడం లేదు’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల నలుగురు రైతులు అపుప్పలు తీరే దారి లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. భార్యాపిల్లలు వీదిన పడ్డారు. ఈ సమయంలో ఆ కుటుంబాలను నవతెలంగాణ కలిసినప్పుడు తమ ఆవేదనను వెలిబుచ్చారు. అప్పులే కొంపపుచ్చాయని వాపోయారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలని కోరుతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు గ్రామానికి చెందిన బొలగం రామరాజు (34) తన ఇంట్లోనే ప్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతనికి బార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వరసగా మూడేండ్ల నుంచి ఆశించిన స్థాయిలో దిగుబడి రాక బ్యాంకు అప్పులతో పాటు ప్రయివేటు కలిపి రూ. 20 లక్షలు అప్పులు ఉన్నాయి. కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్య్యాపిల్లలు దిక్కులేని పక్షులయ్యారు.
బల్మూరు మండలం అనంతవరం గ్రామంలో పుట్ట వెంకటయ్య (55) సాగు కోసం నాలుగు లక్షల అప్పు చేశాడు.ఇతనికి నలుగురు ఆడపిల్లలున్నారు. ఇద్దరి పెండ్లి చేశారు. అప్పులు తీర్చడంతో పాటు మరో ఇద్దరి పెండ్లీలు చేయడానికి తనకున్న ఎకరంన్నర పొలంను అమ్మచూపాడు.అయితే అదే భూమి ఉమా మహేశ్వర సాగు నీట ప్రాజెక్టులో మునుగుతుందని భూమిని కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రం గోపన్‌పల్లి గ్రామానికి చెదిన యువరైతు ఆంజనేయులు (26) ఉరివేసుకొని చనిపోయాడు.ఇతనికి అర ఎకరం సొంత భూమి ఉంది. దాంతో పాటు 10 ఎకరాలను కౌలుకు తీసుకొని వేరు శనగ పత్తి సాగు చేశాడు.అధిక వర్షాలు , అనుకూలంచిన వాతావరణంతో పంట నష్టం జరిగి సుమారు రూ. 8లక్షలు అప్పుల పాలయ్యాడు.
భూమి అమ్ముదామంటే కుటుంబ సభ్యులు నివారించడంతో చేసేది లేక పొలం వద్ద రేకుల షెడ్డుకు ఉరి వేసుకున్నాడు. ఇతనికి బార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన సీతగారి శ్రీనివాస్‌రెడ్డి (55) తనకున్న 4ఎకరాలకు తోడు 3 ఎకరాలను కౌలుకు తీసుకొన పత్తి, వరి, టమాట పంటలను సాగు చేశాడు. సాగు ఇంటి అవసరాల కోసం ఐదు లక్షలు అప్పు చేశాడు. ఈ ఏడాది దిగుబడి రాక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.ప్రతి రోండు రోజులకు ఒకరు చొప్పున ఉమ్మడి జిల్లాలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పంట దిగుబడుల కోసం అప్పులు చేసిన రైతులు ఈ దారుణాలకు ఒడిగడతున్నారు. ముఖ్యంగా పత్తి, మిర్చి, పంటలకు అధిక పెట్టుబడి అవసరం ఉంటుంది. పెట్టుబడులకు తగిన దిగుబడులు రాకపోవడం వల్ల ప్రతి ఏటా అప్పులు పెరిగిపోతున్నాయి. రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం గత రెండేళ్ల క్రితం ప్రకటించిన రుణమాఫి 85 శాతం రైతులకే వర్తించిందని అంటున్నారు. మిగతా సన్న చిన్న కారు రైతులకు రుణమాఫి కాలేదంటున్నారు. రైతు భరోసా సకాలంలో అందకపోవడం కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం విధానాలూ రైతులు ఈ పరిస్థితి కారణమవుతున్నాయి. జిల్లాలో ఆత్మహత్యలు జరగకుండా ఒక సెల్ ఏర్పాటు చేసి రైతులకు అవగామన కల్పించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ప్రధానంగా రైతులు రుణభారం పెరిగి చనిపోకుండా రుణమాఫితో పాటు రైతు భరోసా వంటివి వెంటనే ఇవ్వాలంటున్నారు. రైతు కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించాలని కోరుతున్నారు.
రెండేండ్ల నుండి సాగు చేస్తున్న భూమిలో పెట్టుబడులు తప్ప దిగుబడులు లేవు. చేసిన అప్పులు తీరే దారి లేక నాభర్త చనిపోయాడు. ప్రయివేటు బ్యాంకు అప్పులు కలిసి రూ. 20 లక్షలు ఉన్నాయి. ప్రభుత్వం ఆదుకోకుంటే మాకు బతుకు దెరువు లేదు సారూ..
– తిరుపతమ్మ, మృతుని భార్య, గుంతకోడూరు,తాడూరు మండలం
రామరాజు చేసిన అప్పులు వ్యవసాయానికి సంబందించినవే.. సాగుకు పెట్టుబడి పెడితే దిగుబడులు మాత్రం ఆశించిన స్తాయిలో రాలేదు. చేసిన అప్పులు 20 లక్షలు తీరే దారి కనిపించ లేదు. ప్రభుత్వం స్పందించి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలి.
– రామరాజు కుటుంబసభ్యులు



