Tuesday, December 2, 2025
E-PAPER
Homeజాతీయంభారత్‌లో సంతానోత్పత్తి రేటు తగ్గుదల

భారత్‌లో సంతానోత్పత్తి రేటు తగ్గుదల

- Advertisement -

2080 నాటికి భారత జనాభాలో స్థిరత్వం
180-190 కోట్లుగా నమోదయ్యే అవకాశం
ఐఏఎస్‌పీ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ :
భారత్‌లో 2080 నాటికి జనాభాలో ఒక స్థిరత్వం వచ్చే అవకాశాలున్నాయి. ఆ సమయానికి దేశ జనాభా 180-190 కోట్లుగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సంతానోత్పత్తి రేటులో తగ్గుదల కారణంగానే ఇది సంభవించనున్నది. భారత్‌లో ప్రస్తుతం మొత్తం ఫెర్టిలిటీ రేటు (టీఎఫ్‌ఆర్‌) రీప్లేస్‌మెంట్‌ స్థాయి కంటే తక్కువగా నమోదై 1.9గా ఉన్నది. ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ పాపులేషన్‌ (ఐఏఎస్‌పీ) తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఐఏఎస్‌పీ జనరల్‌ సెక్రెటరీ అనిల్‌ చంద్రన్‌ ఈ విషయాలను వెల్లడించారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం… భారత్‌లో సంతానోత్పత్తి రేటులో తగ్గుదల కారణంగా 2080 నాటికి జనాభాలో ఒక స్థిరత్వం రానున్నది. ఆ సమయానికి దేశ జనాభా అధికంగా 180-190 కోట్లుగా నమోదై, ఆ సంఖ్యకే పరిమితం కానున్నది. భారత్‌లో ఫెర్టిలీటీ రేటు క్రమంగా పడిపోవడంతో గత రెండు దశాబ్దాలుగా జనాభా సంఖ్యలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2000 ఏడాదిలో భారత్‌లో టీఎఫ్‌ఆర్‌ 3.5గా ఉన్నది. ఇప్పుడది 1.9కి పడిపోయి తీవ్ర క్షీణతను నమోదు చేసింది. ఇక భారత జనాభా 200 కోట్ల మంది కంటే తక్కువే ఉంటుందని అన్ని అంచనాలూ చెప్తున్నాయి.

భారత్‌లో సంతానోత్పత్తి తగ్గుదలకు ప్రధానంగా అభివృద్ధి, విద్యా స్థాయిలు పెరగడమే కారణాలుగా ఉన్నాయి. మహిళా అక్షరాస్యత పెరుగుదలతో వివాహం, పిల్లలను కనడం వంటి విషయాల్లో వారి ప్రభావం ఉంటుంది. ఇవి చిన్న కుటుంబాల ఏర్పాటుకు దారి తీస్తాయి. గర్భనిరోధక సాధనాల వినియోగం పెరిగి పోవడం, జనన నియంత్రణకు విస్తృతమైన సమాచారం వంటివి అందుబాటులో ఉండటం కూడా సంతానోత్పత్తి రేటు పడిపోవడానికి కారణాలుగా ఉన్నాయి. పిల్లల్ని ఎప్పుడు, ఎందరిని కనాలో అన్న విషయంలో దంపతులు నియంత్రణను కలిగి ఉన్నారు. ఇక వివాహాలు ఆలస్యంగా జరగడం, ఆర్థిక అవకాశాలు పెరగడం, ముఖ్యంగా మహిళలకు ఉద్యోగావకాశాలు వంటివి పెరగటం వంటి కారణాలతోనూ పిల్లలను కనే విషయంలో ప్రభావం చూపుతున్నది. అభివృద్ధి పెరిగితే జననాల రేట్లు తగ్గుతున్నాయి. నిరక్షరాస్య సమూహాల్లో సంతానోత్పత్తి స్థాయిలు ఇప్పటికీ 3 కంటే ఎక్కువే ఉన్నాయి. కానీ ఇది విద్యావంతుల్లో 1.5 నుంచి 1.8 మధ్య ఉన్నది. 1987-89 మధ్య రీప్లేస్‌మెంట్‌ స్థాయి ఫెర్టిలీటీ (2.1)ను సాధించిన కేరళ రాష్ట్రం.. ఇప్పుడు టీఎఫ్‌ఆర్‌ దాదాపు 1.5గా నమోదైంది.
దేశంలో జనన రేటు పడిపోయి, వృద్ధుల సంఖ్య పెరగటం ఒక సవాలుగా పరిణమించ నున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. యువత సంఖ్య తగ్గిపోతుందనీ, దీంతో శ్రామిక శక్తిలో వారి భాగస్వామ్యం పడిపోయి.. దేశ జీడీపీ, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు. కొన్ని రంగాల్లో కార్మికుల కొరత విపరీతమవుతుందని అంటున్నారు.

పశ్చిమబెంగాల్‌లో ఫెర్టిలిటీ రేటు దారుణం
ఇక పశ్చిమబెంగాల్‌లో ఫెర్టిలిటీ రేటు పడిపోయింది. శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌) స్టాటిస్టికల్‌ రిపోర్ట్‌ 2023 ప్రకారం.. రాష్ట్ర టీఎఫ్‌ఆర్‌ 2017లో 1.7గా ఉండగా.. అది ఇప్పుడు 1.3కి పడిపోయింది. అంటే 18 శాతం తగ్గుదలను నమోదు చేసింది. ఇది రీప్లేస్‌మెంట్‌ స్థాయి 2.1 కంటే తక్కువే. దీంతో పశ్చిమబెంగాల్‌ దేశంలోనే తక్కువ టీఎఫ్‌ఆర్‌ను కలిగి ఉన్న రాష్ట్రంగా ఉన్నది. ఇక భారత్‌లో వృద్ధుల సంరక్షణలో కొత్త సవాళ్లు ఎదురువుతున్నాయి. యువత ఉపాధి కోసం వలసపోతుండటంతో వయోవృద్ధుల కోసం డే కేర్‌ సర్వీసుల పెరిగిపోతున్నాయి. ఈ పరిణామం దేశంలో ఆందోళనను కలిగిస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -