Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంవాస్తవాలను ప్రపంచానికి చేరవేసేకరదీపిక 'నవతెలంగాణ'

వాస్తవాలను ప్రపంచానికి చేరవేసేకరదీపిక ‘నవతెలంగాణ’

- Advertisement -

– విద్యార్థులతో పదో వార్షికోత్సవం జరుపుకోవడం అభినందనీయం : టీఎస్‌ యూటీఎఫ్‌ సీనియర్‌ నాయకులు రాజా శ్రీనివాసరావు
– విద్యార్థి దశ నుంచే పత్రికలను చదవటం అలవాటు చేసుకోవాలి : నవతెలంగాణ జిల్లా ఇన్‌చార్జి ఎంబి.నర్సారెడ్డి
– విద్యార్థులకు డ్రాయింగ్‌ పోటీలు

నవతెలంగాణ-భద్రాచలం
వాస్తవాలను అక్షర రూపంలో ప్రజలకు చేరవేసే కరదీపిక నవతెలంగాణ దినపత్రిక అని టీఎస్‌ యూటీఎఫ్‌ సీనియర్‌ నాయకులు రాజా శ్రీనివాసరావు అన్నారు. ప్రజాశక్తిగా ప్రారంభమై రాష్ట్ర విభజన నేపథ్యంలో నవతెలంగాణగా మార్పు వచ్చిందన్నారు. కార్మికుల, కర్షకులతోపాటు ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై వాస్తవ కథనాలను రాస్తూ పదో వార్షికోత్సవాన్ని విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం అభినందనీయమని కొనియాడారు. నవతెలంగాణ పదో వార్షికోత్సవం సందర్భంగా గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు పాపారావు అధ్యక్షతన నిర్వహించిన సభలో రాజా శ్రీనివాసరావు మాట్లాడారు. విలువలకు కట్టుబడి నిజాన్ని నిర్భయంగా రాయటం నవతెలంగాణకు మాత్రమే సాధ్యమని చెప్పారు. ప్రజా సమస్యలను వెలికితీస్తూ కథనాలు రాయటమే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడూ ప్రజలకు చేరవేస్తుందని తెలిపారు. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిలిచిన నవతెలంగాణ ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో విజయవంతంగా జరుపుకోవాలని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ఆకాంక్షించారు.
పత్రికలను చదవటం అలవాటు చేసుకోవాలి : నర్సారెడ్డి
విద్యార్థి దశ నుండే ప్రత్రికలను చదవటం అలవాటు చేసుకోవాలని నవతెలంగాణ జిల్లా ఇన్‌చార్జి ఎంబి.నర్సారెడ్డి సూచించారు. కార్మిక, కర్షక పత్రికైన నవతెలంగాణ పదో వార్షికోత్సవాన్ని విద్యార్థులతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. సోషల్‌ మీడియా శరవేగంగా అభివృద్ధి చెందినప్పటికీ విషయం పట్ల సమగ్ర సమాచారాన్ని అందించేది పత్రికలే అన్నారు. ప్రభుత్వ, ప్రయివేట్‌ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను వెలికితీయటంలో నవతెలంగాణ చాంపియన్‌గా నిలుస్తుందని, అదేవిధంగా విద్యార్థులకు అనేక రకాల సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. అలాంటి నవతెలంగాణ పత్రికను కార్మికులు, కర్షకులు ఉద్యోగస్తులతో పాటు విద్యార్థులు కూడా చదవాలని సూచించారు.
మాజీ వార్డ్‌ నెంబర్‌ బండారు శరత్‌బాబు మాట్లాడుతూ.. నవతెలంగాణ నిర్వహించిన డ్రాయింగ్‌ పోటీలలో చిన్నారులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారని, ప్రతి విద్యార్థీ సృజనాత్మకంగా చిత్రాలు గీశారని అన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ టౌన్‌ రిపోర్టర్‌ దారిశెట్టి సతీష్‌బాబు, డివిజన్‌ ఇన్‌చార్జి సంతోష్‌ కుమార్‌, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img