నవతెలంగాణ-హైదరాబాద్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ద్వారా బెంగాల్‌లో 58 లక్షలకు పైగా పేర్లు తొలగించబడినట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. నవంబర్‌లో ఎన్నికల సంఘం SIR ప్రక్రియ ప్రారంభించింది. ప్రత్యేక సర్వే ముగియడంతో మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
ఓటర్లు నమోదిత చిరునామాలో లేరని.. శాశ్వతంగా బదిలీ అవ్వడమో.. లేదంటే మరణించి ఉంటారని.. దీంతో 58 లక్షల మంది పేర్లు తొలగించినట్లు పేర్కొంది. ప్రస్తుతం 7.66 కోట్లకు పైగా ఓటర్లు పరిగణనలో ఉన్నట్లు తెలిపింది. 7,66,37,529 మంది ఓటర్లు సవరణ డ్రైవ్ పరిధిలోకి వచ్చినట్లు ఈసీ వెల్లడించింది.
ఇక తుది ఓటర్ల జాబితా ఫిబ్రవరి 14న విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యంతరాలు, విచారణల ప్రక్రియ మాత్రం ఫిబ్రవరి, 2026 కొనసాగుతుందని ఈసీ పేర్కొంది.వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక సర్వే చేపట్టింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే మాదిరిగా సర్వే చేపట్టింది.



