Monday, December 1, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ పేలుళ్లు..జావద్‌ అహ్మద్‌ సిద్దిఖీకి రిమాండ్

ఢిల్లీ పేలుళ్లు..జావద్‌ అహ్మద్‌ సిద్దిఖీకి రిమాండ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: ఉగ్రవాద సంబంధిత మనీలాండరింగ్‌ కేసులో అల్‌ఫలా యూనివర్శిటీ వ్యవస్థాపకుడు జావద్‌ అహ్మద్‌ సిద్దిఖీకి ఢిల్లీ కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. సిద్దిఖీని నవంబర్‌ 19న 13రోజుల పాటు ఇడి కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయనను అదనపు సెషన్స్‌ జడ్జి శీతల్‌ చౌదరి ప్రధాన్‌ ఎదుట హాజరుపరచగా, డిసెంబర్‌ 15 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
13రోజుల ఇడి కస్టడీ మంగళవారం తెల్లవారుజామున 1.00గంటకు ముగియనుందని, అయితే ఒకరోజు ముందుగా సోమవారం కోర్టు ఎదుట హాజరుపరిచినట్లు ఇడి న్యాయవాది కోర్టుకు తెలిపారు.

కస్టడీ సమయంలో సూచించిన మందులు, కళ్లజోడులను అందించాలని కోరుతూ సిద్దిఖీ న్యాయవాది దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్థనను కోర్టు అనుమతించింది. సిద్దిఖీ వైద్య ప్రిస్కిప్షన్‌ను ఇడి అధికారులు కోర్టుకు అందించారు. కోర్టు అతనికి సూచించిన చికిత్సను కొనసాగించేలా చూడాలని జైలు అధికారులను ఆదేశించింది.

అలాఫలా యూనివర్శిటీ యుజిసి గుర్తింపును తప్పుగా క్లెయిమ్‌ చేసిందని, ఎన్‌ఎఎసి అక్రిడేషన్‌ స్థితిని విద్యార్థులకు తప్పుగా చూపించిందని ఇడి గతంలో ఆరోపించింది. 2018 -2025 మధ్య సంస్థ రూ.415.10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, ఆస్తుల రికార్డులతో సరిపోలినప్పటికీ.. 2018 నుండి ఆస్తుల్లో భారీ పెరుగుదల నమోదైందని పేర్కొంది.

విద్యార్థుల ఫీజులు, ప్రజల నుండి సేకరించిన నిధులను వ్యక్తిగత, ప్రైవేట్‌ అవసరాలకు మళ్లిస్తున్నారని, సిద్దిఖీ అలా ఫలా ఛారిటబుల్‌ ట్రస్ట్‌, మేనేజింగ్‌ ట్రస్ట్‌ మరియు సంబంధిత సంస్థలపై వాస్తవ నియంత్రణను కలిగి ఉన్నారని ఇడి కోర్టుకు తెలిపింది. ఆయన అరెస్టురోజున ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని 19 ప్రదేశాల్లో జరిపిన సోదాల్లో సుమారు రూ.48లక్షల నగదు లభించిందని ఇడి అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 15న సిద్దిఖీ జ్యుడీషియల్‌ కస్టడీ ముగిసిన తర్వాత ఈ అంశం విచారణకు రానుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -