డబ్బులు ఇవ్వలేదని పక్క గ్రామ ఆయాకు టీచర్ పోస్టు
బాధిత ఆయా అరుణ ఆరోపణ
నవతెలంగాణ – భూపాలపల్లి
అంగన్వాడి టీచర్ ప్రమోషన్ కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేసి, ఇవ్వలేకపోయినందుకు అన్యాయంగా పక్క గ్రామానికి చెందిన ఆయాకు పోస్టు కట్టబెట్టినట్లు భూపాలపల్లి సిడిపిఓ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి డీడబ్ల్యూ మల్లీశ్వరిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బాధితురాలు ఆయా గుండ్ల అరుణ గురువారం భూపాలపల్లి సిడిపిఓ కార్యాలయ ఆవరణలో విలేకరులకు వెల్లడించారు.
ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. తాను ఖాసింపల్లి అంగన్వాడి సెంటర్–2లో గత 15 సంవత్సరాలుగా ఆయాగా విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఇదే అంగన్వాడి సెంటర్–1లో టీచర్‌గా పనిచేసిన ఝాన్సీ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ పోస్టు ఖాళీ అయ్యిందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన ఆయాలకు ప్రమోషన్ కల్పిస్తామని చెప్పడంతో తాను స్థానికురాలిగా, అన్ని అర్హతలు కలిగి దరఖాస్తు చేసుకున్నానని వివరించారు.
ఈ క్రమంలో సిడిపిఓ మల్లీశ్వరి తనను కార్యాలయానికి పిలిపించి, కాశీంపల్లి అంగన్వాడి సెంటర్–1 టీచర్ పోస్టు ఇవ్వాలంటే రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. తాను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తినని, లక్ష రూపాయలు ఇచ్చే స్థోమత లేదని చెప్పడంతో తనపై కక్షగట్టి, పక్క గ్రామమైన సెగ్గంపల్లికి చెందిన ఆయా దుర్గం లక్ష్మి వద్ద రూ.4 లక్షలు లంచం తీసుకుని ఆమెకే పోస్టు కట్టబెట్టారని ఆరోపించారు.
దరఖాస్తు చేసినప్పటి నుంచి డబ్బుల కోసం వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసిన అరుణ, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని లంచాల ఆరోపణలపై సిడిపిఓ మల్లీశ్వరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికురాలిగా అన్ని విధాల అర్హత ఉన్న తనకు కాసింపల్లి అంగన్వాడి సెంటర్–1 టీచర్ పోస్టు కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.



