జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి
రాఘవాచారి 6వ స్మారకోపన్యాసం
నవతెలంగాణ-సిటీబ్యూరో
భావప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఆధారమని, అది లేకుంటే ప్రజాస్వామ్యం నిలువదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం విశాలాంధ్ర మాజీ సంపాదకులు సి.రాఘవాచారి 6వ స్మారకోపన్యాసం సి.రాఘవాచారి మెమోరి యల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాఘవాచారి భయమెరుగని జర్నలిస్టని, విలువలను కాపాడిన మహనీయుడని కొనియాడారు. రూ.5000 వేతనంలో జీవిస్తూ, రిక్షాలో ప్రయాణం చేస్తూనే మూడు దశాబ్దాల పాటు విశాలాంధ్రను నిబద్ధతతో నడిపారని గుర్తుచేశారు.
1939లో పాలకుర్తిలో జన్మించిన ఆయన సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సాధించారని, రామాయణం, మహాభారతం, భాగవతం వంటి గ్రంథాలు లోతుగా అధ్యయనం చేశారని వివరించారు. రచనలో ఏం కావాలి, ఏం రాయకూడదన్న విషయంలో రాఘవాచారి పాఠాలు తనంతట తాను నేర్చుకోవాలని భావించారని చెప్పారు. పత్రికలు, యాజమాన్యాలు, సంపాదకులకు విడదీయలేని సంబంధముందని, అయినప్పటికీ పత్రికా స్వేచ్ఛను ప్రజలు, కోర్టులు ఎల్లప్పుడూ రక్షించాయని తెలిపారు. ఆర్టికల్ 19(1)పై నెహ్రూ ప్రభుత్వం చేసిన సవరణలను, సర్క్యులేషన్ తగ్గించేందుకు ఆంక్షలు విధించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను సుప్రీం కోర్టు తిరస్కరించిందని గుర్తుచేశారు. సోషల్ మీడియా ఇప్పుడు మీడియా ఉద్యోగుల చేతుల్లో లేదని, ప్రపంచంలోని కొద్దిమంది ధనవంతుల నియంత్రణలోకి వెళ్లిందని అన్నారు. దీనిపై నియంత్రణ సాధ్యాసాధ్యాలపై సుప్రీం కోర్టులో చర్చ జరుగుతుందని చెప్పారు.
మీడియా అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మీడియాను రాజ్యాంగంలో పేర్కొనకపోవడం అంబేద్కర్ తీసుకున్న సుదూర దృష్టి నిర్ణయమని తెలిపారు. ప్రజల తరఫున స్వేచ్ఛగా పనిచేయడమే మీడియా ఉద్దేశం కాబట్టి దాన్ని రాజ్యాంగపు బంధంలో పెట్టరాదనే భావన అంబేద్కర్‌కు ఉన్నదని చెప్పారు. రమేష్ థాపర్ కేసులో ఆర్టికల్ 19(1)(ఎ)లో పత్రికా స్వేచ్ఛ అంతర్భాగమని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. మొదట ట్రస్ట్ సభ్యులు డి.సోమసుందర్ స్వాగతం పలికారు. చివరలో డాక్టర్ సి.అనుపమ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పత్రికా రంగ ప్రముఖులు కె.రామచంద్రమూర్తి, ఆర్‌వి.రామారావు (విశాలాంధ్ర ఎడిటర్), దేవులపల్లి అమర్ (మన తెలంగాణ ఎడిటర్), టీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ, ఐజేయూ నాయకులు ఎంఎ.మాజిద్, వై.నరేందర్ రెడ్డి, ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ అజీజ్ పాషా, ట్రస్ట్ సభ్యులు కె.జ్యోత్స్న, వైవి.కృష్ణ, ఎ.చందర్, టి.సురేష్, బి.జమిందార్ పాల్గొన్నారు.



