జాతీయ స్వాతంత్య్ర పోరాటకాలంలోనూ, ఆ తరువాత ఎమర్జెన్సీలోనూ, ఆ మాటకొస్తే దేశానికి ముప్పువచ్చిన ప్రతి సందర్భంలోనూ కీలకమైన ప్రజా ఉద్యమాలకు వేదికైన ప్రాంతం బీహార్! దేశానికి కష్టకాలంలో ఐక్యంగా అండగా నిలబడటంతో పాటు పలుమార్లు దేశానికి అవసరమైన రాజకీయ చైతన్యాన్ని బీహార్ ప్రజలు ప్రదర్శించారు. ఆ బీహార్‌లోనే ప్రస్తుతం ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమం సాగుతోంది. ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఓటర్ అధికార్ యాత్ర’కు ప్రజల నుండి లభించిన విశేషమైన మద్దతే దీనికి నిదర్శనం. 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో ఇండియా బ్లాక్ పార్టీలు, బీహార్‌లో ఉన్న అనేక ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలపడంతో పాటు, అన్ని విధాలా సహకరిం చాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రజలు ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ముగింపుసభలో రెండు లక్షలకుపైగా ప్రజలు పాల్గొన్నారని అంచనా! అనేక చారిత్రాత్మక సంఘటనలకు వేదికైన గాంధీ మైదాన్‌లో ఈ సభ జరిగింది. సభకు హాజరైన వారు తమ ఓటు హక్కును హరిస్తున్న మోడీ ప్రభుత్వంపై ఆగ్రహంతో చేసిన నినాదాలు బీహార్ అంతా మారుమోగాయి. ‘ఓటు హక్కు మా స్వంతం. దాన్ని దోచుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం’ అన్న గట్టి హెచ్చరికను ఈ సభ ద్వారా సాధారణ ప్రజానీకం కేంద్ర ప్రభుత్వానికి చేసింది. ఇప్పటి వరకు బీజేపీ-జేడీయూ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను చూసీ చూడనట్టు ఊరుకున్న కొన్ని మీడియా సంస్థలు కూడా ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు తర్వాత తమ వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ముగింపు సభ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణులు ఇదే మాదిరి కొనసాగితే వాటి పునాదులు కదులుతాయన్న సంకేతాలు మీడియా విశ్లేషణల్లో వెలువడు తుండటం గమనార్హం.
నిజానికి, బీహార్‌లో అధికార భాగస్వామిగా కొనసాగడానికి బీజేపీ ఎన్నో టక్కుటమార విద్యలను ప్రదర్శించింది. అనైతిక మార్గాలను అనుసరించింది. తీవ్ర హిందుత్వ విధానాలతో ప్రజలను నిట్టనిలువునా చీల్చడానికి ప్రయత్నించింది. పహల్గాం ఉగ్రదాడిని కూడా ఎన్నికల రాజకీయాలకు ప్రధాని మోడీ వాడుకున్న తీరు ప్రస్తుతం బీహార్‌లో చర్చనీయాంశమైంది. ఇంత చేసినా అధికారంలో ఎక్కువ కాలం కొనసాగలేమన్న భావనతోనే ఓట్ల కుంభకోణానికి బీజేపీ తెరతీసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల సంఘాన్ని ఆయుధంగా చేసుకుని, మైనారిటీలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు వీరందరికీ ఓటు హక్కు నిరాకరించడం. అధికార కూటమి అనుచరులు ఇష్టానుసారంగా ఓటు వేసేలా అనుమతిస్తూ తీసుకున్న పలు చర్యలు ఒకదాని తర్వాత ఒకటిగా వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి వస్తున్న అంశాలకు తగిన విధంగా స్పందించి, సమస్యలను పరిష్కరించడానికి బదులుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీ నేతల భాషలోనే ప్రతిపక్షాలపై దాడి చేయడం చర్చనీయమవుతోంది. బీహార్ నమూనాలోనే ఇతర రాష్ట్రాలలో కూడా ఓటర్ల జాబితా సవరణకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టడంతో ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్న అభిప్రాయం రోజురోజుకూ బలపడుతోంది. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ బద్ధమైన హక్కుల ను కాపాడుకునేందుకు ఐక్యంగా కదలాలన్న ప్రతిపక్ష విజ్ఞప్తికి ప్రజల నుండి సానుకూల స్పందన లభిస్తోంది. ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సభ జరిగిన తీరే దీనికి నిదర్శనం.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ, బీహార్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్‌ల ఆధ్వర్యంలో సాగిన యాత్రకు వామపక్షాలు గట్టిమద్దతు ప్రకటించాయి. ఆ పార్టీల రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రలో భాగస్వాములయ్యారు. ముగింపు సభకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబి హాజరయ్యారు. స్వతంత్ర భారత దేశంలో ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత ఇంతగా గతంలో ఎప్పుడూ ప్రశ్నార్ధకం కాలేదు. బీజేపీ ఆదేశాలను అమలు చేసే ఆయుధంగా ఎన్నికల సంఘం మారిపోవడాన్ని దేశ ప్రజానీకం ఎన్నటికీ అంగీకరించరు. ఓటుదోపిడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరగబోయే ఆందోళనలకు బీహార్‌లో జరిగిన యాత్ర కేవలం ఆరంభం మాత్రమే!
ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES