నవతెలంగాణ-మియాపూర్: హైకోర్టు ఆదేశాల మేరకు సంధ్య కన్వెన్షన్ లో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. ఈసారి వీకెండ్ లో కాకుండా సోమవారం ఉదయమే కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్‌లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు ఆక్రమణలపై పలువురు బాధితులు హై కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం గత మంగళవారం సంధ్యా శ్రీధర్ రావు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్ గా పరిగణించింది.
మొత్తం 20 ఎకరాల పరిధిలో వేసిన లేఔట్‌లో 162 వరకు ప్లాట్లుండగా.. అందులోని మెజార్టీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశ్యంతో రహదారులు, పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. హైడ్రా అందుకే ఆక్రమణలను తొలగించిందని పేర్కొంది. ఒకసారి లే ఔట్ వేస్తే.. అదే కొనసాగుతుందని స్పష్టం చేసింది. సంధ్యా శ్రీధర్ రావు రహదారుల ఆక్రమణలను ఇటీవల హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే. ఈ విషయమై సంధ్యా శ్రీధరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా బాధిత ప్లాట్ యజమానులు కూడా వారి గోడును హైకోర్టుకు విన్నవించుకున్నారు. లే ఔట్‌లో సరిహద్దులన్నీ చెరిపేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నారని సంధ్యా శ్రీధర్‌రావుపై ఫిర్యాదు చేశారు. ఎక్కువ ప్లాట్లు కొని.. తమను భయపెట్టి మిగతావి కూడా సొంతం చేసుకోవాలని సంధ్యా శ్రీధరరావు ప్రయత్నించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఎక్కువ ప్లాట్లు తనవే ఉన్నాయని.. లే ఔట్‌లోని రహదారులు, ఆ పక్కనే ఉన్న తమ ప్లాట్లు, పార్కులు సరిహద్దులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదేమని అడిగితే తమపై దాడి చేసేవారని బాధితులు తెలిపారు.
ఓ ప్లాట్ యజమానురాలిపై దాడి చేయడమే కాకుండా తప్పుడు కేసులు కూడా పెట్టారని సంధ్యా శ్రీధర్ రావుపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఇందుకు గాను సంధ్య శ్రీధర్‌రావుకు రూ. 10 లక్షలు సుప్రింకోర్టు ఫైను విధించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ ప్లాట్లు చూడడానికి కూడా వీలు లేకుండా చేశారని వాపోయారు. నేరుగా దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేసిన సమయంలో తాము హైడ్రాను ఆశ్రయించామని బాధితులు తెలిపారు. హైడ్రా అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి రహదారుల ఆక్రమణలను నిర్ధారించాక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మాకు పెట్టిన ఇబ్బందులను కోర్టుకు విన్నవించుకోవడానికే తాము ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యామని చెప్పారు.
బాధితుల ఫిర్యాదులన్నీ విన్నాక జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ఇప్పటికే రహదారుల పునరుద్ధరణకు తాము హైడ్రాకు సూచించామని బాధితులకు తెలిపారు. అందులోని ప్లాట్ల యజమానులకు అండగా హైకోర్టు ఉంటుందని ధైర్యం చెప్పారు. లే ఔట్‌లోని రహదారులను, పార్కులను పునరుద్ధరించాలని హైడ్రాకు హైకోర్టు మరోసారి సూచించింది. ఫైనల్ హియరింగ్ కోసం ఈనెల 18వ తేదీకి కేసును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా సోమవారం ఉదయమే కూల్చివేతలు చేపట్టింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్ లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. అనుమతులు లేని షేడ్స్ కట్టడాలను తొలగించారు హైడ్రా సిబ్బంది.



