నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు, అత్యంత దారుణంగా వాయు కాలుష్యంతో హస్తిన ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే, దట్టమైన పొగ మంచుతో విజిబులిటీ పూర్తిగా పడిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, ఎయిర్ పోర్టు రన్ వేపై తగ్గిన విజిబిలిటీ, పలు విమానాలు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక, కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీలో గ్రాఫ్ 4 చర్యలు అమలు చేస్తున్నారు.
అయితే, ప్రభుత్వ- ప్రయివేటు కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతో నిర్వహణ, మిగతా వారికి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది సర్కార్. ఇక, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలకు నో ఫ్యూయల్ ను అమలు చేస్తున్నారు. అత్యవసర సేవల వాహనాలు మినహా ఢిల్లీలోకి డీజిల్ వాహనాలపై పూర్తిగా నిషేధం విధించారు. అలాగే, గడువు ముగిసిన వాహనాలపై నిషేధం అమలు చేస్తున్నారు. ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో నిర్మాణ పనులపై నిషేధాలు ఉన్నాయి. దీంతో ఉపాధి కోల్పోతున్న కార్మికులకు 10 వేల రూపాయల సాయం అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, ఢిల్లీ పొల్యూషన్ నేపథ్యంలో 5వ తరగతి వరకు ఆన్లైన్లో మాత్రమే తరగతులు నిర్వహించాలని.. 6 నుంచి 12వ తరగతి వరకు హైబ్రిడ్ విధానంలో క్లాసులు చేపట్టాలని స్కూల్స్ కి ఆదేశాలు ఇచ్చింది.



