Wednesday, July 9, 2025
E-PAPER
Homeఆటలుశాట్జ్‌లో డిప్యూటీ డైరెక్టర్‌ దందా!

శాట్జ్‌లో డిప్యూటీ డైరెక్టర్‌ దందా!

- Advertisement -

– నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతర కోచ్‌ల నియామకం
– ఒక్కో కోచ్‌ పోస్టుకు రూ.2-3 లక్షలు వసూలు?
నవతెలంగాణ-హైదరాబాద్‌

తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) కోచ్‌ల నియామకాన్ని పక్కాగా నోటిఫికేషన్‌ ద్వారానే చేపట్టాలి. నోటిఫికేషన్‌ ప్రక్రియ పాటించకుండా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నేరుగా నియామకాలు చేపట్టకూడదు. 2023 అక్టోబర్‌ 17న జరిగిన ఓ సమావేశంలో రాష్ట్ర క్రీడా మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ ఇచ్చిన ఆదేశాలు ఇవి. కొత్త రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక.. క్రీడాశాఖ, శాట్జ్‌ ఉన్నతాధికారులు మారారు. దీంతో క్రీడా ప్రాధికార సంస్థలోని కొందరు అవినీతి అధికారులు శాట్జ్‌ వైస్‌ చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ను పక్కనదోవ పట్టిస్తూ.. రూల్స్‌కు విరుద్ధంగా స్థానికేతరులను కోచ్‌లుగా నియమించారు. శాట్జ్‌లోని ఓ డిప్యూటీ డైరెక్టర్‌ ఈ తతంగం నడిపించినట్టు కోచ్‌ల సంఘాలు, క్రీడాకారుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దొడ్డిదారిన నియామకం
నోటిఫికేషన్‌ లేకుండా కోచ్‌లను తీసుకోకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్నాయి. అయినా, ఎల్బీ స్టేడియంలో ఓ క్రికెట్‌ కోచ్‌, అథ్లెటిక్స్‌ కోచ్‌ సహా హుస్సేన్‌సాగర్‌లో వాటర్‌స్పోర్ట్స్‌ కోచ్‌ను నియమించారు. రూల్‌ 22 ప్రకారం స్థానికులను మాత్రమే కోచ్‌లుగా నియమించాలి. కానీ క్రికెట్‌, వాటర్‌స్పోర్ట్స్‌ కోచ్‌లు తెలంగాణకు చెందిన వారు కాదు. రూ.2-3 లక్షలకు దొడ్డిదారిన కోచ్‌ పోస్టులను అమ్ముకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఓ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రమేయం ఉందని ఎల్బీ స్టేడియం వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్ర స్థాయిలోనే నిబంధనలకు విరుద్ధంగా కోచ్‌లను నియమించటంతో జిల్లా స్థాయిలో డివైఎస్‌ఓలు అదే బాటలో నడుస్తున్నారు. ఎటువంటి నియామక ప్రక్రియ లేకుండా అస్మదీయులను కోచ్‌లుగా నియమిస్తున్నారు.


కదలని నియామక ఫైల్‌
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థలో 232 కోచ్‌ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2019లో ఈ పోస్టుల నియామకానికి అడుగు పడినా.. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అప్పటి క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి మరుసటి ఏడాదికి వాయిదా వేశారు. ఆరేండ్లు గడిచినా శాట్జ్‌ నుంచి ఇప్పటివరకు కోచ్‌ల నియామకం చేపట్టేందుకు క్రీడాశాఖకు మళ్లీ ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదు. శాట్జ్‌ ఉన్నతాధికారులు శిక్షకుల పోస్టుల మంజూరు, భర్తీ ప్రక్రియపై పూర్తి అలసత్వం వహిస్తున్నారు. ఓ వైపు 232 కోచ్‌ల నియామక ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే.. దొడ్డిదారిన కోచ్‌లను నియమించటంపై బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదే విషయమై ఓ కోచ్‌ మాట్లాడుతూ.. ‘ఎటువంటి నియామక ప్రక్రియ, నోటిఫికేషన్‌ లేకుండా కోచ్‌లను నియమించటం అన్యాయం. అర్హులైన ఎంతోమంది కోచ్‌లు నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తుండగా, దొడ్డిదారిన అనర్హులను తీసుకున్నారని’ వాపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -