Saturday, December 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి

శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి

- Advertisement -

ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుంటేనే జీవితంలో ఉన్నతస్థాయికి
ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి
సృజనాత్మకతను వెలికితీసే రంగస్థలం బాలోత్సవం
ప్రతిరోజూ శారీరక శ్రమ ఉండేలా చూసుకోండి : సీఐ ఉపేంద్ర
ప్రముఖ లైబ్రరీలలో ఎస్వీకే లైబ్రరీ ఒకటి : ఎస్వీకే కార్యదర్శి పి.ప్రభాకర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పిల్లలు చిన్నప్పటి నుంచే ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, సేవా తత్వాలను పెంపొందించుకోవాలని ఎస్‌టీఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి చావ రవి పిలుపునిచ్చారు. అప్పుడే పిల్లలు ఉన్నతస్థాయికి ఎదుగుతారని చెబుతూ అబ్దుల్‌ కలాం, సుందరయ్య జీవితచరిత్రలను ఉదహరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలోత్సవం ముగింపుసభను ఎస్వీకే ట్రస్టు కార్యదర్శి పి.ప్రభాకర్‌ అధ్యక్షతన నిర్వహించారు. హైస్కూల్‌ విభాగంలో వ్యాసరచన, క్విజ్‌, నృత్యప్రదర్శనల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కారపు వెంకటరమణ నిర్వహించిన మ్యాజిక్‌ షో పిల్లలను ఆద్యంతం ఆకట్టుకున్నది. సభనుద్దేశించి చావ రవి మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లోని టాలెంట్‌ను వెలికి తీసేందుకు ఎస్వీకే చేస్తున్న ప్రయత్నం బాగుందని కొనియాడారు.

పిల్లలు చిన్ననాటి నుంచే ప్రతి అంశాన్ని ఎందుకు? ఏమిటి? ఎలా? అని ప్రశ్నలు వేసుకుంటూ అధ్యయనం చేయాలని సూచించారు. సీఐ ఉపేంద్ర మాట్లాడుతూ..సృజనాత్మకతను వెలికితీసే రంగస్థలం బాలోత్సవం అని కొనియాడారు. పిల్లలు కష్టపడేతత్వాన్ని అలవర్చుకోవాలనీ, ప్రతి రోజూ అరగంట నుంచి గంట వరకు శారీరక శ్రమ చేయాలని సూచించారు. ఏ రంగం ఎంచుకున్నా కఠోరంగా శ్రమిస్తే ప్రతి పిల్లవాడూ మరో ఉసేన్‌బోల్ట్‌, థామస్‌ అల్వా ఎడిషన్‌, అంబేద్కర్‌, సచిన్‌ లాగా జీవితంలో ఎదుగుతారని భరోసానిచ్చారు. లండన్‌ లైబ్రరీ అతి పెద్దదనీ, దాన్ని ఎక్కువగా ఉపయోగించున్న అంబేద్కర్‌, కారల్‌ మార్క్స్‌లు ప్రపంచ మేధావులుగా ప్రసిద్ధిచెందారని గుర్తుచేశారు. బ్రూనో, సొక్రటీస్‌, గెలీలియో, భగత్‌సింగ్‌, గాంధీ జీవిత చరిత్రల గురించి ప్రస్తావించారు. పిల్లలంతా పుస్తక పఠనంపై దృష్టి సారించాలనీ, ఫోన్లను దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్వీకే ట్రస్టు కార్యదర్శి పి.ప్రభాకర్‌ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సాధారణమనీ, ఓటమిని గెలుపునకు పునాదిగా మల్చుకోవాలని పిల్లలకు సూచించారు.

బాలోత్సవం విజయవంతానికి కృషిచేసిన టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు. గచ్చిబౌలి సమీపంలోని పది ప్రభుత్వ పాఠశాలల్లో, బస్తీల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఉచితంగా ట్యూషన్లను నిర్వహిస్తున్నామని తెలిపారు, ఎవరైనా సంప్రదిస్తే మరిన్ని బస్తీల్లో ట్యూషన్లను పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గచ్చిబౌలి ఎస్వీకే లైబ్రరీలో తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో మూడు లక్షల పుస్తకాలున్నాయనీ, వాటిని పిల్లలు, పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యేవారు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతినెలా మొదటి ఆదివారం ఎస్వీకే ఆధ్వర్యంలో 600 నుంచి 700 మంది పేదలకు అందిస్తున్న ఉచిత వైద్యసేవల గురించి వివరించారు. పుచ్చలపల్లి సుందరయ్య తన భూములను పేదలకు పంచారనీ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. లోక్‌సభలో తొలి ప్రతిపక్ష నేత సుందరయ్య అనీ, ఆయన మాట్లాడుతుంటే అప్పటి ప్రధాని నెహ్రూ ప్రతి అంశాన్ని నోట్‌ చేసుకునే వారని తెలిపారు. దేశంలో కుల, మత, డబ్బు రాజకీయాలుండొద్దనీ, సమసమాజం రావాలని కోరుకున్న వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు. ఎంఈఓ వెంకటయ్య మాట్లాడుతూ..చదువుతో పాటు క్రీడల్లోనూ పిల్లలు రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాలోత్సవం కన్వీనర్‌ సి.విజరుకుమార్‌, ఎస్వీకేకు చెందిన ఆర్‌.సాంబశివరావు, రవి, అనిల్‌, శ్రీనివాస్‌, మంజూల, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -