బీఆర్‌ఎస్‌కి రాష్ట్రంలో స్థానం లేదు
బీజేపీకి జూబ్లీహిల్స్ ప్రజల గట్టి హెచ్చరిక
మరో పదేండ్లు కాంగ్రెస్‌దే అధికారం : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-కంఠేశ్వర్
జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు.. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అంకితమని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లోనూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన అందిస్తామని వెల్లడించారు. బీసీ బిడ్డ నవీన్ యాదవ్‌ను గెలిపించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తదని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పనితీరుపట్ల ప్రజలు సంతృప్తిగా ఉండటం వల్లే భారీ మెజార్టీతో విజయం దక్కిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషిచేసిన సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్ తీర్పుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందని ప్రజలు భరోసా కల్పించారని, కనీసం పదేండ్లు అధికారంలో కొనసాగడం తథ్యమన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కమిట్‌మెంట్‌తో ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకి ఈ తీర్పుతో జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి హెచ్చరిక పంపారని తెలిపారు. ప్రజలిచ్చిన ఈ తీర్పు ద్వారా బీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేదని మరోసారి రుజువైందని, పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజలు గుండు సున్నాతో బీఆర్‌ఎస్ భవిష్యత్తును ఖరారు చేశారని తెలిపారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల మాదిరిగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు స్పష్టమైన మద్దతు ఇచ్చి ప్రతిపక్షాలకు చెంపపెట్టు వంటి తీర్పు ఇచ్చారని అన్నారు. జూబ్లీహిల్స్ విజయం రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, తాహెర్‌బిన్ హందాన్, మానాల మోహన్ రెడ్డి, కేశ వేణు, రత్నాకర్, విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికే ప్రజల పట్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



