పర్యావరణం..ప్రాణాలను పణంగా పెట్టొద్దు
అడవులు నరకటం వల్లే అనర్థాలు : వరదలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్ల నరికివేత ఇలాగే కొనసాగితే.. మనకు అడవులు లేకుండా పోతాయని వ్యాఖ్యానించింది. అభివృద్ధి అవసరమే కానీ పర్యావరణం, ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదు ” భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయి వ్యాఖ్యానించారు. ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. పదేపదే మెరుపు వరద లు, హిమాలయాల్లో అక్రమంగా నరికివేయబడిన చెట్ల దుంగలు నదుల్లో ప్రవహించడాన్ని ప్రస్తావిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల వరద నీటిలో భారీ సంఖ్యలో చెట్ల దుంగలు కొట్టుకువెళుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో మెరుపు వరదల గురించి కోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పర్యావరణ పరంగా సున్నితమైన హిమాలయాల్లో అడవులను నరికివేయడంతో పదే పదే ప్రకృతి విపత్తులు, మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. ”ఇది చాలా తీవ్రమైన సమస్య. వరదనీటిలో దుంగలు కొట్టుకువెళుతున్నట్టు కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే మనకు అడవులు కనిపించవు. పంజాబ్‌లో మొత్తం గ్రామాలు మునిగిపోయాయి. అలాగే భారత జాతీయ రహదారి అధారిటీ (ఎన్‌హెచ్‌ఎఐ)కి నోటీసులు జారీ చేసింది. వరదల సమయంలో చండీగఢ్ , మనాలి మధ్య ఉన్న 14 సొరంగాలు మరణ ఉచ్చులుగా మారనున్నాయని పిటిషనర్ అనామిక రాణా తరపున న్యాయవాది ఆకాష్ వశిష్ట పేర్కొన్నారు. ఇటీవల వరదల సమయంలో సొరంగం లోపల 300మంది చిక్కుకుపోయారని అన్నారు.