రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో రూ.60 వేల కోట్లతో ఆర్ అండ్ బి రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో పట్టణంలోని నాగార్జునసాగర్ ఎక్స్ రోడ్ నుండి దర్వేశిపురం ఎల్లమ్మ దేవాలయం వరకు, మహబూబ్ నగర్ – నల్లగొండ రహదారిని నాలుగు లైన్ల రహదారి నిర్మాణం, సెంట్రల్ మీడియన్, సెంట్రల్ లైటింగ్ తో సహా నిర్మించేందుకు ఉద్దేశించి రూ.50 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వారం రోజుల్లో సాగర్ ఎక్స్ రోడ్ నుండి దర్వేషి పురం వరకు నిర్మించే నాలుగు లైన్ల రహదారి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ధర్వేశిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని దర్వేషిపురం వద్ద ఇదివరకే 12 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డుతో పాటు , సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ మీడియన్ కట్టించామని తెలిపారు. అలాగే కొత్తపల్లి ముషంపల్లి రహదారుల తోపాటు ,జిల్లాలో అన్ని రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అన్ని గ్రామాలకు రోడ్లతో పాటు, మురుగు కాలువలను నిర్మిస్తున్నామని, ఏఎంఆర్పి కాలువల లైనింగ్ కు 450 కోట్ల రూపాయలు మంజూరు చేయించామని తెలిపారు.నల్గొండ పట్టణంలో ప్రధాన రహదారుల అభివృద్ధిలో భాగంగా సెంట్రల్ మీడియన్,సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని, బైపాస్ రహదారి చేపట్టామని తెలిపారు.
గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలే బస్సులను నిర్వహించుకునేలా బస్సులు ఏర్పాటు చేసామని, 5 లక్షల రూపాయలతో ఒక్కొక్కరికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని, రైతు భరోసా, సన్న బియ్యం ,సన్న ధాన్యం పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. రాబోయే మూడేళ్లలో ఇల్లు లేని పేదవారు ఉండకుండా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. ప్రతి గ్రామంలో రేషన్ షాపు ఉండేలా చూసామని, తన నియోజకవర్గంలో 18 కొత్త రేషన్ షాపులు ఏర్పాటు చేశామన్నారు.
పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే మూడేళ్లలో గ్రామాల స్వరూపాలను మారుస్తామని తెలిపారు. నల్గొండ పట్టణంలో దశలవారీగా ఇల్లు లేని వారందరికీ ఇండ్లు కట్టిస్తామన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వడం జరిగిందని, నల్గొండ నియోజకవర్గంలో కనగల్, తిప్పర్తి, నల్గొండ మండలాలలో మహిళల చేత రైస్ మిల్లుల నిర్వహణకు రైస్ మిల్లు కట్టించి ఇస్తామని, తద్వారా వారికి వచ్చే లాభాన్ని మహిళా సంఘాలు పంచుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు .ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో నిర్మించిన బొట్టు గూడ ప్రభుత్వ పాఠశాలను డిసెంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.
నీటిపారుదల అభివృద్ధిలో భాగంగా సొంత నిధులు వెచ్చించి ఏ ఎం ఆర్ పి కాలువల లైనింగ్, కంపచెట్లను తొలగించడం, బ్రాహ్మణవెల్లెముల ద్వారా చెరువులను నింపడం వంటివి చేసామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి ,మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, ఇతర ప్రజాప్రతినిధులు ,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



