మహిళలు ఉత్పత్తిలో పాల్గొన్నప్పుడే నిజమైన ప్రగతి : సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
శాండ్విక్ కార్మిక కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ-పటాన్‌చెరు
శ్రమను గౌరవించే సంస్కృతి ఉన్న దేశాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయని సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతం లోని శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) 40వ వార్షికోత్సవ కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆదివారం జరిగిన కార్మిక కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం సభలో సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హాజ రయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక ప్రయివేట్ పరిశ్రమలో ఒకే నాయకత్వంలో నిరంతరాయంగా 40 సంవత్సరాల పాటు ఐక్యంగా కొనసాగడం అభినందనీ యమన్నారు. సీఐటీయూ సిద్ధాంతాలకు లోబడి మొదటి నుంచి కార్మికులను రాజకీయ చైతన్యం చేసుకుంటూ ప్రజాతంత్ర పనివిధానం ద్వారా శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ అనేక అద్భుత విజయాలను సాధించిం దని తెలిపారు. కేవలం తమ జీతభత్యాల కోసమే కాకుండా సామాజిక, సంఘీభావ కార్యక్రమాల్లో సైతం చురుకుగా పాల్గొంటూ.. ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిచిందని అభినందించారు. శ్రమను గౌరవించే దేశాలు అభివృద్ధి సాధించాయని, మనదేశ జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలు ఉత్పత్తిలో భాగస్వాములైతేనే నిజమైన అభివృద్ధి సాధించినట్టు అవుతుందని అన్నారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఇటీవల అడ్డగోలుగా పెంచిన పన్ను టారిఫ్‌ల వల్ల ఎగుమతులపై ఆధారపడిన పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా చైతన్యవంతులైన శాండ్విక్ కార్మికులు మరింత ఐక్యంగా ముందుకు సాగుతూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
4 దశాబ్దాలుగా కార్మికుల్లో ఐక్యత
కార్మిక సంక్షేమంలో రాజీలేకుండా 4 దశాబ్దాల పాటు కార్మికులను ఐక్యంగా నిలబెట్టుకుని, 14 వేతన ఒప్పందాల ద్వారా అత్యధిక వేతనాలు, సౌకర్యాలు సాధించామని శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. కార్మికుల గృహవసతి, మెడికల్ ఇన్సూరెన్స్, గ్రాట్యూటీ సంవత్సరానికి 21 రోజులకు పెంచుకోవడం, రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలకు పెంచడం లాంటి అనేక హామీలను.. కార్మికుల ఐక్య పోరాటాల ద్వారా సాధించామన్నారు. జిల్లాలో అనేక పరిశ్రమల్లో సీఐటీయూ యూనియన్లు ఏర్పడటానికి శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ సాధించిన విజయాలు తోడ్పాటును అందించాయని తెలిపారు. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలను కుటుంబ సభ్యుల వరకు విస్తరించడం శాండ్విక్ యూనియన్ ప్రత్యేకతగా అభివర్ణించారు. కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో కార్మిక కుటుంబాలు అత్యధిక సంఖ్యలో కదిలి రావడం 40 సంవత్సరాల యూనియన్ కృషికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా.. మరిన్ని విజయాలు సాధించి తమ ప్రయాణం గోల్డెన్ జూబ్లీ వైపు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్మిక కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం అత్యంత ఉత్సాహభరితంగా, ఆనందోత్సవాల మధ్య జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పి.పాండురంగారెడ్డి, ఎం.మనోహర్, ఏవీ రావు, సదాశివరెడ్డి, సత్తిబాబు, కమిటీ సభ్యులు, కార్మికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
– శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు
శ్రమను గౌరవించే దేశాల్లోనే అభివృద్ధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES