Sunday, June 22, 2025
E-PAPER
Homeజాతీయంఅభివృద్ధా.. ఎక్కడీ

అభివృద్ధా.. ఎక్కడీ

- Advertisement -

11 ఏండ్ల మోడీ పాలనపై ప్రతిపక్షాల మండిపాటు
బుక్‌లెట్‌ విడుదల చేసిన కాంగ్రెస్‌
అన్ని రంగాల్లోనూ వైఫల్యమేనంటూ ఎద్దేవా
న్యూఢిల్లీ :
ప్రధాని నరేంద్ర మోడీ తన 11 ఏండ్ల పాలనలో సాధించిన విజయాలను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఏకరువు పెట్టారు. దీనిపై ప్రతిపక్షాలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. చిన్నారులలో కుంగుబాటు, నిలిచిపోయిన జీడీపీ వృద్ధి, మళ్లీ ఊపిరి పోసుకుంటున్న పోలియో మహమ్మారి, జడలు విప్పుతున్న ఉగ్రవాదం, కానరాని వ్యాక్సిన్లు…ఇంతకంటే అభివృద్ధి ఏముంటుందంటూ సెటైర్లు వేస్తున్నాయి. దేశాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలను ప్రస్తావించాయి. కాంగ్రెస్‌ పార్టీ గత వారమే ఓ చిన్న పుస్తకాన్ని విడుదల చేసింది. ‘అభివృద్ధి చెందిన భారత స్వర్ణయుగంలో 11 ఏండ్ల సేవ.. సుపరిపాలన.. పేదల సంక్షేమం’పై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతి వాదననూ ఆ పుస్తకంలో తిప్పికొట్టింది. మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాయి.
అంశాల వారీగా ఎండగడుతూ…
’11 ఏండ్ల తప్పుడు హామీలు’ పేరిట కాంగ్రెస్‌ ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందులో ఉటంకిస్తూ ప్రభుత్వం రూపొందించిన 166 పేజీల బుక్‌లెట్‌పై అంశాల వారీగా దాడి చేసింది. ప్రపంచ ఆకలి సూచికను ఉదహరిస్తూ కాంగ్రెస్‌ ఏం చెప్పిందంటే…పోషకాహార లోపం ఇప్పటికీ జాతీయ సంక్షోభమే. చిన్నారులలో 35.5 శాతం మంది కుంగుబాటు (వయసుకు తగిన ఎత్తు లేకపోవడం)కు గురవుతున్నారు.
19.3 శాతం మందిలో ఎత్తుకు తగిన బరువు లేదు. 32.1 శాతం మందికి వయసుకు తగిన బరువు లేదు… స్వచ్ఛ భారత్‌ విజయం సాధించిందన్న వాదనతోనూ కాంగ్రెస్‌ విభేదించింది. నీరు, నిర్వహణ సరిగా లేకపోవడంతో మరుగుదొడ్లు పనిచేయడం లేదని ఎత్తిచూపింది. 2018-19తో పోలిస్తే మరుగుదొడ్ల వినియోగం ఎస్సీలలో 20 పాయింట్లు, ఎస్టీలలో 24 పాయింట్లు తగ్గిందని తెలిపింది.
పోలియో భూతం మళ్లీ వచ్చింది
ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌లో ఉన్న డేటా ప్రకారమే 2024-25లో (జనవరి 29వ తేదీ వరకూ) దేశంలోని 31,600 ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయని కాంగ్రెస్‌ వేలెత్తి చూపింది. గడచిన పది ఆర్థిక సంవత్సరాలలో బ్యాంకులు రూ.16.35 లక్షల కోట్ల పారు బకాయిలు మాఫీ చేశాయని తెలిపింది. కోవిడ్‌ నిర్వహణ, ప్రజారోగ్యంలో సాధించిన విజయాలను ప్రభుత్వం తన బుక్‌లెట్‌లో ప్రస్తావించగా గతేడాది దేశంలోకి పోలియో ప్రవేశించిందని ఎత్తిపొడిచింది. వ్యాక్సిన్ల కోసం ఇతర దేశాలపై సంవత్సరాల తరబడి ఆధారపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పుకుంది. దీనిని కాంగ్రెస్‌ తోసిపుచ్చుతూ ‘పదేండ్ల క్రితం భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 2011లో చిట్టచివరి కేసు నమోదైంది.
అయితే గతేడాది మేలో మేఘాలయలో రెండు సంవత్సరాల చిన్నారికి పోలియో సోకింది. పోలియో నిర్మూలన కోసం గత ప్రభుత్వాలు అమలు చేసిన అనేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడంలో మోడీ సర్కారు విఫలమైంది. 2019 తర్వాత వ్యాక్సినేషన్‌ తీసుకోని పిల్లల సంఖ్య పెరిగింది. పథకం అమలులో అలసత్వం కారణంగా దేశంలోని ప్రతి ఐదుగురు చిన్నారులలో ఇద్దరికి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌ అందలేదు’ అని వివరించింది.
అప్పుల ఊబిలో అన్నదాతలు
వ్యవసాయంపై మోడీ ప్రభుత్వ పథకాలన్నీ విఫలమయ్యాయని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. ‘దేశంలోని 55 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. 19 కోట్లకు పైగా అన్నదాతలు బ్యాంకులకు రూ.33 లక్షల కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంది’ అని ఆ పార్టీ బుక్‌లెట్‌ తెలిపింది. ఆర్టికల్‌ 370 రద్దు కారణంగా వేర్పాటువాదం తగ్గిపోయిందన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చుతూ 2019-2023 మధ్య జమ్మూకాశ్మీర్‌లో 579 ఉగ్రవాద దాడులు జరిగాయని, 168 మంది పౌరులు, 247 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై సైతం కాంగ్రెస్‌ నిప్పులు చెరిగింది. కోవిడ్‌ వచ్చిన 2020-21 నుండి వాస్తవ జీడీపీ వృద్ధి రేటు మందగించిందని, 2024-25లో అతి మరింత తగ్గిపోయిందని వివరించింది. 2020-21, 2024-25 మధ్యకాలంలో నికర ఎఫ్‌డీఐలు 96 శాతం పడిపోయాయని తెలియజేసింది.
ఈ పార్టీలు కూడా…
మోడీ ప్రభుత్వ 11 ఏండ్ల పాలనలో మహిళలపై నేరాలు పెరిగాయని, ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని, నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిందని, ప్రజలను విభజించే బిల్లులు తీసుకొచ్చారని, రైలు ప్రమాదాలలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, కోవిడ్‌-19ని ఎదుర్కోవడంలో దారుణంగా విఫలమయ్యారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ చెప్పుకుంటున్న ‘డబుల్‌ ఇంజిన్‌ వికాస్‌’ను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ దుయ్యబట్టారు. ‘ఢిల్లీ ప్రభుత్వ 11 ఏండ్లను, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ 9 ఏండ్లను కలుపుకుంటే కేంద్రం తన 20 ఏండ్ల పరిపాలనలో ప్రజలకు ఏం ఒరగబెట్టిందో చెప్పాల్సి ఉంటుంది’ అని ఆయన అన్నారు. అమలు చేస్తున్న పథకాలను చూస్తుంటే ఢిల్లీ, లక్నో మధ్య సమన్వయం ఉన్నట్లు కన్పించడం లేదని, ప్రధాని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటికీ దాని ముఖచిత్రంలో మార్పు రాకపోతే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -