నవతెలంగాణ-హైదరాబాద్: విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) విమాన సేవల్లో తీవ్ర అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు, ఎయిర్‌పోర్టుల్లో రద్దీ వంటి కారణాలు విమానాల రద్దుకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) ఇండిగో అధికారులకు సమన్లు జారీ చేసింది. మొత్తంగా గత నెల అంటే నవంబర్‌లో ఏకంగా 1,232 సర్వీసులను రద్దు చేసినట్లు డీజీసీఏ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఇండిగో ప్రతిరోజూ 2200 విమానాలను నడుపుతున్నది.
గత రెండు రోజుల వ్యవధిలోనే 250 నుంచి 300 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇవాళ కూడా పెద్ద సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 30 విమానాలు రద్దయ్యాయి. ఇక కోల్‌కతాలో నాలుగు విమానాలను సంస్థ రద్దు చేయగా.. సుమారు 24 విమాన రాకపోకలు ఆలస్యం అయ్యాయి.



