జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య
నవతెలంగాణ – బోనకల్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ పంటల సర్వేను శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య సిబ్బందిని ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల పరిధిలో లక్ష్మీపురం గ్రామంలో వాలంటీర్స్ నిర్వహిస్తున్న డిజిటల్ పంటల సర్వేను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో వాలంటీర్లకు డిజిటల్ పంటల సర్వే పై పలు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయిలో పంటల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
డిజిటల్ పంటల సర్వే ప్రక్రియను వ్యవసాయ విస్తరణ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో వాలంటీర్లను పర్యవేక్షించాలని సూచించారు.అదేవిధంగా మొక్కజొన్న పంటలో తీసుకోవలసిన తగు యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పంటల అధిక దిగుబడిని సాధించాలని సూచించారు. రసాయనక ఎరువుల వాడకాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించారు. సేంద్రీయ ఎరువులను వాడటం వలన పంటల దిగుబడి అధికంగా ఉండటంతో పాటు పంట నాణ్యత ఉంటుందన్నారు. పంటలకు పదేపదే రసాయనక ఎరువులను వినియోగించడం వలన పంటలు రసాయనక పదార్థాలుగా తయారవుతాయని దీని వలన వినియోగించే ప్రజలు ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు సూచనలు పాటిస్తూ రైతులు వ్యవసాయం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి షేక్ హుస్సేన్ సాహెబ్, వాలంటీర్స్, తదితరులు పాల్గొన్నారు.



