Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలురైజింగ్‌-2047కు దిశా నిర్దేశం

రైజింగ్‌-2047కు దిశా నిర్దేశం

- Advertisement -

ఉన్నతస్థాయి సలహా మండలి ఏర్పాటు : ముఖ్యమంత్రి రేవంత్‌ నిర్ణయం
దువ్వూరి సుబ్బారావు, రఘురామ్‌ రాజన్‌, అరుణా రారు, జయతీ ఘోష్‌,
హర్ష మందిర్‌తోపాటు మొత్తం 16 మందితో కౌన్సిల్‌
టెక్నాలజీపై ఇండియా స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌తో భాగస్వామ్యం
పరిపాలన, ఆర్థిక, విద్య, సాంకేతిక, పర్యావరణ, సామాజిక న్యాయాలపై దృష్టి
ఎప్పటికప్పడు మంత్రివర్గానికి సూచనలు, సలహాలు…ఆర్నెల్లకోసారి సమీక్షలు
డిసెంబరు 9న ప్రజల ముందుకు విజన్‌ డాక్యుమెంట్‌
-బి.వి.యన్‌.పద్మరాజు

అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకుంటూనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం రైజింగ్‌ తెలంగాణ -2047 నినాదాన్ని ప్రభుత్వం ఎత్తుకుంది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాలు, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల కల్పనపై కూడా దృష్టి సారించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి తెలంగాణ రైజింగ్‌ -2047 విజన్‌ డాక్యుమెంట్‌ను డిసెంబరు 9న ప్రజల ముందు ఉంచుతామని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. యూపీఎ హయాంలో నేషనల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. ఆ కౌన్సిల్‌ ఇచ్చిన సలహాలు సూచనలతోపాటు వామపక్షాల ఒత్తిడి మేరకు ఉపాధి హామీ, ఆహార, అటవీ, సమాచార హక్కు చట్టాలను నాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు అదే తరహాలో రాష్ట్రంలో సైతం ఒక సలహా మండలిని ఏర్పాటు చేయడం ద్వారా.. దీర్ఘకాలంలో తెలంగాణను రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దాలని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.

అందుకే ఆయా రంగాల్లో నిపుణులైన ప్రముఖుల అభిప్రాయాలు, తెలంగాణ ప్రజల అవసరాలు, వనరుల ప్రాతిపదికన విజెన్‌ డాక్యుమెంట్‌ను రూపొం దిస్తున్నట్టు తెలిసింది. ఇందుకనుగుణంగా ప్రభు త్వానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలను ఇస్తూ, ఎప్పుడైనా ఎక్కడైనా లోపాలు తలెత్తి, పొరపాట్లు దొర్లితే వాటిని సరిదిద్ది, దిశా నిర్దేశం చేసేందుకు వీలుగా దేశంలోని వివిధ రంగాల్లో నిష్ణాణితులైన వారితో ఒక ఉన్నతస్థాయి సలహా మండలి (హై పవర్డ్‌ అడ్వైజరీ కౌన్సిల్‌)ని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. సంబంధిత ఆర్డర్‌ను జులై 25న ప్రభుత్వం ఆమోదించింది. ఆర్బీఐ మాజీ గవర్నర్లు, ప్రముఖ ఆర్థిక వేత్తలు డాక్టర్‌ దువ్వూరి సుబ్బారావు, డాక్టర్‌ రఘురామ్‌ రాజన్‌, సామాజిక కార్యకర్త, ఆర్టీఐ యాక్టివిస్ట్‌ అరుణా రారు, సమ్మిళిత వృద్ధి, ఆహార భద్రత నిపుణురాలు ప్రొఫెసర్‌ జయతీ ఘోష్‌, హక్కుల కార్యకర్త, ప్రముఖ న్యాయవాది హర్ష మందిర్‌తోపాటు మొత్తం 16 మంది ఈ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు వారితో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. కౌన్సిల్‌లో ఉండటానికి వారందరూ అంగీకరించినట్టు తెలిసింది. రాష్ట్రంలో పరిపాలన, ఆర్థిక, విద్య, సాంకేతిక, పర్యావరణ, సామాజిక న్యాయం తదితరాంశాలను ఈ కౌన్సిల్‌ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తుంది. ఇందుకవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌ లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) అందించనుంది. కాగా విజన్‌ డాక్యుమెంట్‌ -2047కు సంబంధించిన క్యాబినెట్‌ నోట్‌ను జూన్‌ 23న ప్రభుత్వం ఆమోదించింది. దానిపై ప్రస్తుతం వివిధ స్థాయిల్లో పలు రంగాల్లోని నిపుణులు వర్క్‌ షాప్‌లు నిర్వహిస్తున్నారు.

మూడు భాగాలుగా విజన్‌ డాక్యుమెంట్‌
అనుకున్న లక్ష్యాలను త్వరితగతిన సాధించేందుకు వీలుగా సలహా మండలి ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు చేసింది. ఇందులో భాగంగా విజన్‌ -2047ను స్వల్ప కాలిక (2025-30), మధ్యకాలిక ((2030-39), దీర్ఘకాలిక (2039-47) అనే మూడు భాగాలుగా విభజించారు. స్వల్పకాలిక లక్ష్యాల సాధన కోసం అన్ని శాఖలు ప్రతి ఆర్నెల్లు, ఏడాదికి టార్గెట్లను నిర్దేశించుకుని పని చేయాలని సూచించారు. నిర్ణీత కాల వ్యవధి తర్వాత వాటిపై సమీక్షలు చేయాలని కౌన్సిల్‌ ప్రతిపాదించింది. ఈ క్రమంలో తలెత్తే భౌతిక, ఆర్థిక, సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కరించుకోవాలని సూచించింది.

రైతులు, మహిళలు, యువత అభివృద్ధే లక్ష్యం
విజన్‌ డాక్యుమెంట్‌లో ప్రధానంగా రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువతపై ఫోకస్‌ చేసినట్టు సమాచారం. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను బలోపేతం చేయటం, రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చేలా చూడటమనేది డాక్యుమెంట్‌లో మొదటి లక్ష్యంగా ఉంది. తెలంగాణలోని కోటి మంది మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయించాలన్నది రెండో లక్ష్యం. స్థానికంగా ఉండి చిన్న చిన్న పనులు, చేతి వత్తులు, కుటీర పరిశ్రమల్లో పని చేస్తూ, మెరుగైన వేతనాలను పొందేలా మహిళలను తీర్చిదిద్దాలని డాక్యుమెంట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇక యువతకు విద్య, క్రీడలు, నైపుణ్యాల్లో తర్పీదునిచ్చి, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటం, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా వారిని తీర్చిదిద్దటమనేది మూడో లక్ష్యంగా ఉంది. తెలంగాణలో ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకోవటం, సామర్థ్యాలను మెరుగు పరచటం, పిల్లలకు సరైన పౌష్టికాహారాన్ని అందించటం ద్వారా ఎనీమియాతోపాటు ఇతర రుగ్మతల నుంచి వారిని బయటపడేయటం డాక్యుమెంట్‌లోని నాలుగో లక్ష్యం. వీటితోపాటు గ్రీన్‌ ఎనర్జీ, సుస్థిర వ్యవసాయం, సుస్థిరాభివద్ధి కోసం గ్రీన్‌ అర్బన్‌ ప్లానింగ్‌ కూడా అందులో కీలకాంశాలుగా ఉన్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad