వెంటనే సమస్యలు పరిష్కరించాలి
తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్
టీజీ-ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ‘లంచ్ అవర్’ నిరసన
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పట్ల వివక్ష తగదని, వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ టీజీ-ఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు ఆనంద్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని టీజీ-ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట బుధవారం తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘లంచ్ అవర్’ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో జరిగిన పీఎన్‌సీ సమావేశాల్లో అంగీకరించిన అంశాలను ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసినట్టు తెలిపారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు, కాన్‌సీక్వెన్షియల్ సీనియార్టీ అంశాలపై కోర్టు కేసుల్లో కావాలనే జాప్యం జరుగుతోందని ఆరోపించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు న్యాయమైన ఉద్యోగోన్నతులు కల్పించకపోవడం తీవ్ర అన్యాయమని అన్నారు. ఆర్టిజన్లపై వివక్షపూరిత చర్యలు, సస్పెన్షన్లు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై వేధింపులను అరికట్టాలని, 2004కు ముందు నియామకమైన ఉద్యోగులకు జీపీఎఫ్ వర్తింపజేయాలని, పెండింగ్‌లో ఉన్న మెడికల్, అత్యవసర బదిలీలను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలపై ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ యాజమాన్యం స్పందించలేదని, ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గూడెం బీచ్‌పల్లి కంపెనీ జనరల్ సెక్రెటరీ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రయ్య, రాష్ట్ర నాయకులు సోమ్లా నాయక్, ఎం.రవీందర్, సీహెచ్.కృష్ణ, నరసింహ, ఆర్.కృష్ణమూర్తి, దొంతుల శ్రీనివాస్, కట్ట శ్రీకాంత్, మహేష్, రఘునాథ్, సురేష్, గంగాధర్, మధుసూదన్, స్వామిదాస్, కనకయ్య, కంపెనీ నాయకులు, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పట్ల వివక్ష తగదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



