Thursday, October 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచెరుకు రైతుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్ష

చెరుకు రైతుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్ష

- Advertisement -

తెలంగాణలోనూ టన్ను చెరుకుకు రూ. 5,500 ఇవ్వాలి
ప్రోత్సాహం కింద ఎకరాకు రూ.15 వేలివ్వాలి
నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలి : చెరుకు రైతుల సంఘం అఖిల భారత అధ్యక్షులు డి.రవీంద్రన్‌


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలోని చెరుకు రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతుండటంతోనే ఏటేటా చెరుకు సాగు విస్తీర్ణం తగ్గుతున్నదనీ, చెక్కర ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయని చెరుకు రైతుల సంఘం అఖిల భారత అధ్యక్షులు డి.రవీంద్రన్‌ విమర్శించారు. తెలంగాణలో ప్రతి టన్నుకు రూ.5,500 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే రైతులకు గిట్టుబాటు అవుతుందని చెప్పారు. చెరుకు సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.15 వేల ప్రోత్సాహాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చెరుకు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బొంతు రాంబాబు అధ్యక్షతన రైతుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రవీంద్రన్‌ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 2003లో తీసుకున్న నిర్ణయం ఫలితంగా చెరుకు సాగు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తోందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతి చెరుకు క్రషింగ్‌ సీజన్‌ కంటే ముందు ప్రకటించే ఎఫ్‌ఆర్పీలో మార్పులు చేసిన ఫలితంగానే సాగు నుంచి రైతులు దూరమవుతున్నారని తెలిపారు.

గతంలో టన్ను చెరుకుకి 8.5 శాతం పంచదార రికవరీపై ధర నిర్ణయించగా..ప్రస్తుతం దాన్ని కేంద్ర ప్రభుత్వం 10.5 శాతానికి పెంచడం దారుణమని విమర్శించారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అదనంగా కలిపి పంజాబ్‌లో రూ.4,100, హర్యానాలో రూ.4010, యూపీలో రూ.3,850 ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలోనూ చెరుకు రైతులకు బోనస్‌ ఇవ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, గిట్టుబాటు కాకపోవటం, వర్షాభావ పరిస్థితులు, కోతుల సమస్య, సాగు ఖర్చులు పెరగటం, కూలీల కొరత నేపథ్యంలో రైతులు చెరుకు సాగుకు దూరమవుతున్నారని గణాంకాలతో వివరించారు. మనదేశంలో 29 మిలియన్‌ టన్నుల పంచదార అవసరముండగా..27 టన్నుల మాత్రమే ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. తెలంగాణలో 12 చెక్కెర పరిశ్రమలుండగా కేవలం 7 మాత్రం ఈ సీజన్లో క్రషింగ్‌ కి అవకాశం ఉందని తెలిపారు. అవికూడా మూతపడితే అందులో పనిచేసే కార్మికులు, రోజువారీ కూలీలు కూడా రోడ్డునపడే ప్రమాదముందని వాపోయారు.

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ మాట్లాడుతూ..నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం తెరిపిస్తే అనుబంధ పరిశ్రమలు వస్తాయనీ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కూరగాయలు, పంటలకు కేరళ ప్రభుత్వం ఇస్తున్న మాదిరిగా రేట్లను నిర్ణయించాలనీ, బహిరంగ మార్కెట్‌లో ఆ రేటు కంటే తక్కుగా ఉంటే ప్రభుత్వం రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మొదటి నుంచీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చెరుకు రైతుల్ని విస్మరిస్తున్నాయని విమర్శించారు. బడా కార్పొరేట్లకు చెక్కర ఫ్యాక్టరీలను, వ్యవసాయాన్ని కట్టబెట్టే కుట్రలు జరుగుతున్నాయన్నారు. బ్రెజిల్‌లో ఎకరాకు 60 నుంచి 70 టన్నుల చెరుకు దిగుబడి వస్తుంటే మన దేశంలో మాత్రం అది 30 నుంచి 35 టన్నులే ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులకు మేలు రకాలైన చెరుకు వంగడాలను అందించాలని డిమాండ్‌ చేశారు. పంట దిగుబడి పెరిగితే రైతులకు కొంత మేరకు లబ్ది చేకూరుతుందన్నారు.

సబ్సిడీలు ఇవ్వాలని కోరారు. చెరుకు సంఘం రాష్ట్ర కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర, దేశ అవసరాలకు అవసరమైన మేరకు చెరుకు సాగు కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అనుకూలమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం టన్ను చెరుకుకు రూ 1000 బోనస్‌ చెల్లించాలనీ, డ్రిప్‌ ఇరిగేషన్‌కు బిందు సేద్యంకు పూర్తి సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో చెరుకు ఉప ఉత్పత్తిలో నుంచి రైతులకు వాటా ఇవ్వాలని విన్నవించారు. చెరుకు రైతులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు, చెరుకు రైతు సంఘం రాష్ట్ర నాయకులు రచ్చ నర్సింహ్మా రావు, తోటకూర రాజు, ఎనమద్ది రామకృష్ణ, నెల్లూరు నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ, ఎ. లెనిన్‌, సంగన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -