Wednesday, January 7, 2026
E-PAPER
Homeఖమ్మంపంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ

పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ

- Advertisement -

– మాట్లాడిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట

తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై పలువురు సభ్యులు మాట్లాడారు. అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ ఈ బిల్లు పై శాసనసభలో సమగ్రంగా,స్పష్టంగా,ప్రజల పక్షాన గళమెత్తారు. గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా రూపొందించిన ఈ బిల్లు ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ప్రజాస్వామ్యంలో గ్రామ పంచాయితి లే ప్రాథమిక శక్తి కేంద్రాలు అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతం కావాలంటే పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి, పరిపాలనా అధికారాలు, నిర్ణయ స్వేచ్ఛ తప్పనిసరిగా కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులోని ముఖ్య అంశాలను వివరించిన ఎమ్మెల్యే, ఈ బిల్లు ద్వారా గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు చేరే విధానం బలోపేతం అవుతుందని, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల పాత్ర మరింత విస్తరిస్తుందని, గ్రామాభివృద్ధి పనుల్లో ప్రజల పాల్గొనడం పెరుగుతుందని,నిర్ణయాలలో వేగం పెరిగి పనులు ఆలస్యం కాకుండా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయని వివరించారు. ప్రత్యేకంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్న గిరిజన గ్రామాలు, అటవీ ప్రాంతాలు, దూర గ్రామాల పరిస్థితులను అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి మౌలిక వసతులు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని అన్నారు. 

ఈ అవసరాలను తీర్చడంలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అలాగే, పంచాయతీల ద్వారా అమలు చేసే ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. అవినీతి రహిత పాలన, పారదర్శకత, ప్రజలకు జవాబుదారీతనం ఈ సవరణ బిల్లుతో మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా పంచాయతీల పాత్ర పెరగాల్సిన అవసరం ఉందని జారె ఆదినారాయణ అన్నారు. ఉపాధి హామీ పథకం, స్వయం సహాయక సంఘాలు, రైతు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే స్థానిక సంస్థలకు అధికారం ఇవ్వాలని సూచించారు.

పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమైతేనే గ్రామాల్లో నిజమైన అభివృద్ధి కనిపిస్తుందని, పట్టణాలకు వలసలు తగ్గుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ చట్ట సవరణ బిల్లు గ్రామ పాలనలో ఒక చారిత్రాత్మక అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చేసిన ఈ ప్రసంగానికి అసెంబ్లీలోని పలువురు సభ్యులు మద్దతు తెలిపారు. గ్రామీణాభివృద్ధి పై ఆయన చూపిన అవగాహన, అనుభవం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను సభ ప్రశంసించింది.

ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు కూడా తమ ఎమ్మెల్యేకు అభినందనలు తెలుపుతూ, గ్రామాల అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న నిరంతర కృషి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై ఆయన చేసిన ప్రసంగం గ్రామీణ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే విధంగా ఉందని స్థానిక నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -