Tuesday, September 16, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఖతార్‌ దాడులపై మానవ హక్కుల మండలిలో నేడే చర్చ

ఖతార్‌ దాడులపై మానవ హక్కుల మండలిలో నేడే చర్చ

- Advertisement -

మౌనమే…ఇంతవరకు తెచ్చింది
ఇజ్రాయిల్‌ను జవాబుదారీ చేయాల్సిందేనన్న ఖతార్‌ ప్రధాని

జెనీవా : హమాస్‌ నేతలను మట్టుబెట్టే లక్ష్యంతో ఖతార్‌పై ఇజ్రాయిల్‌ దాడులు పాల్పడిన ఘటనపై మంగళవారం చర్చ జరపనున్నట్లు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి తెలిపింది. ఇజ్రాయిల్‌ దాడిపై అత్యవసరంగా చర్చ జరగాలంటూ అధికారికంగా రెండు అభ్యర్ధనలు వచ్చాయని, ఆ మేరకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు కౌన్సిల్‌ సోమవారం తెలిపింది. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ (ఓఐసి) సభ్య దేశాల తరపున పాకిస్తాన్‌ నుండి ఒక అభ్యర్ధన రాగా, గల్ఫ్‌ అరబ్‌ దేశాల సహకార మండలి తరపున కువైట్‌ నుండి మరో అభ్యర్ధన వచ్చిందని మండలి తెలిపింది. 2006లో మండలి ఏర్పడిన తర్వాత అత్యవసరంగా చర్చలు జరిపిన వాటిల్లో ఇది పదవదని కౌన్సిల్‌ తెలిపింది. ఖతార్‌పై దాడులకు అంతర్జాతీయంగా తీవ్ర ఖండనలు వెల్లువెత్తాయి.

నెతన్యాహూ జాగ్రత్తగా వుండు…
ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహుతో ఖతార్‌పై దాడుల విషయాన్ని చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో భేటీ అయ్యారు. ఖతార్‌పై దాడుల వల్ల గాజాలో కాల్పుల విరమణ చర్చలు పక్క దారి పట్టే అవకాశం వుందని అమెరికా ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. ఆదివారం ట్రంప్‌, కతార్‌కు మద్దతును ప్రకటించారు. ఖతార్‌ మాకు మంచి మిత్రపక్షం. ఇజ్రాయిల్‌తో సహా ఎవరైనా సరే జాగ్రత్తగా వుండాల్సిందే, ప్రజలపై దాడి చేసేటపుడు మరింత అప్రమత్తత అవసరమని ట్రంప్‌ విలేకర్లతో వ్యాఖ్యానించారు.

ద్వంద్వ ప్రమాణాలు తిరస్కరించండి : ఖతార్‌ ప్రధాని విజ్ఞప్తి
ద్వంద్వ ప్రమాణాలను పాటించడాన్ని తిరస్కరించి, ఇజ్రాయిల్‌ను తాను పాల్పడిన నేరాలకు జవాబుదారీ చేయాలని ఖతార్‌ ప్రధాని షేక్‌ మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ జాసిమ్‌ అల్‌ తాని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. దోహాలో ఇజ్రాయిల్‌ అనూహ్యంగా జరిపిన దాడులపై చర్చించేందుకు అత్యవసరంగా ఏర్పాటు చేసిన అరబ్‌-ఇస్లామిక్‌ సదస్సుకు ముందస్తు మంత్రిత్వ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దాడిలో ఖతార్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌తో సహా ఐదుగురు హమాస్‌ నేతలు మరణించారు. గల్ఫ్‌ దేశాల మధ్య ఐక్యతను ప్రదర్శించేలా సోమవారం అరబ్‌, ఇస్లామిక్‌ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. తద్వారా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. గాజాలో పాలస్తీనా జాతిని అంతం చేయాలన్న ఇజ్రాయిల్‌ లక్ష్యం నెరవేరదని ఖతార్‌ ప్రధాని స్పష్టం చేశారు. ఇజ్రాయిల్‌ను ఇంతలా ప్రోత్సహిస్తున్నది ఏమిటనుకుంటున్నారు? మౌనం, నిష్క్రియాపరత్వం అదే ఇంతవరకు తెచ్చింది, ఇకపై ఇటువంటివి సాగబోవని, చేసిననేరాలకు శిక్ష అనుభవించాల్సిందేనని ఇజ్రాయిల్‌కు స్పష్టం చేయాల్సిందేనని ప్రధాని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -