నవతెలంగాణ – మల్హర్ రావు
పేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రజా ప్రభుత్వం చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం మంథని నియోజకవర్గంలోని అడవి సోమనపల్లి గ్రామంలో పర్యటించి పూర్తయిన 40 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పేద ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మొదటి దఫా లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3500 చొప్పున మొత్తం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే పేదలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రతి సోమవారం డబ్బులు విడుదల చేస్తున్నామన్నారు. మంథని నియోజకవర్గం పరిధిలో నేడు గృహ ప్రవేశాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పేద ప్రజల ముఖాలలో సంతోషం చూస్తే తనకు చాలా సంతృప్తి కలుగుతుందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలోపు మరో మూడు విడతలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పేద ప్రజల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ సరఫరా, ఉగాది నుంచి నిరుపేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ, 11 లక్షల నూతన రేషన్ కార్డుల పంపిణీ చేశామని తెలిపారు.
సోమనపల్లి వద్ద రూ.200 కోట్లతో చేపట్టిన యంగ్ ఇండియా గురుకుల పాఠశాల పనులు జరుగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో రైతులు తాలు కట్టింగ్ తో ఇబ్బందులు పడితే, ప్రజా ప్రభుత్వం కట్టింగ్ కు స్వస్తి పలికి సన్నరకం వడ్లకు క్వింటాళ్ల రూ.500 బోనస్ అందించామన్నారు. 25 లక్షల 65 వేల మంది రైతులకు రూ.20 వేల 681 కోట్ల 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసామన్నారు. వానాకాలం పంటలో సన్న రకం పండించిన ధాన్యానికి రూ.1800 కోట్ల బోనస్ అందించామని అన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ లాభసాటి వ్యవసాయం ఎలా చేయాలి అనే అంశంపై రైతులకు శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అనంతరం రూ. 3కోట్ల 5 లక్షలతో నిర్మించనున్న సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.




